source: X
భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తుత తరం క్రికెటర్లతో తన డ్రీమ్ వరల్డ్ టెస్ట్ ఎలెవన్‌ను ఎంపిక చేశాడు. ఈ జట్టులో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు కల్పించాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు జరుగుతున్న సమయంలో పఠాన్ ఈ జట్టును వెల్లడించాడు.
ఇర్ఫాన్ తన డ్రీమ్ టీమ్ ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేశాడు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు టీమిండియాకు అద్భుతమైన ఆరంభాలు అందించారు. ఈ ఇద్దరూ కలిసి 33 ఇన్నింగ్స్‌ల్లో 1205 పరుగులు జోడించారు.
మూడో స్థానంలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌కు చోటిచ్చాడు. టెస్టు క్రికెట్‌లో 13 వేల పరుగుల మైలురాయిని దాటిన రూట్.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతడికే జట్టు పగ్గాలు కూడా అప్పగించాడు.
నాలుగో స్థానంలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేశాడు. 2025లో ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టులు ఆడిన గిల్.. నాలుగు సెంచరీల సాయంతో 700కు పైగా పరుగులు సాధించాడు. కెప్టెన్‌గా అతడికి అదే తొలి టెస్టు సిరీస్ కావడం విశేషం.
ఐదో స్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు చోటు దక్కింది. మూడు ఫార్మాట్లలోనూ తనదైన ముద్ర వేస్తున్న బ్రూక్.. భారీ ఇన్నింగ్స్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆరో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను ఎంపిక చేశాడు. పంత్ దూకుడైన ఆటతీరుతో జట్టు స్కోరుకు అదనంగా 50-60 పరుగులు జోడించగలడని అభిప్రాయపడ్డాడు.
ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాను ఎంపిక చేసిన ఇర్ఫాన్.. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో యాన్సెన్‌కు కూడా చోటిచ్చాడు. టెస్టుల్లో జడేజా ఆరు సెంచరీలు, 356 వికెట్లు సాధించగా.. యాన్సెన్ 830 పరుగులు, 104 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్‌లపై పఠాన్ నమ్మకం ఉంచాడు. బుమ్రా ఇప్పటివరకు టెస్టుల్లో 234 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్ 460 వికెట్లు సాధించాడు. ఇర్ఫాన్ ప్యాట్ కమిన్స్‌కు కూడా తుది జట్టులో స్థానం కల్పించాడు.
ఇర్ఫాన్ పఠాన్ డ్రీమ్ వరల్డ్ టెస్ట్ XI
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, జో రూట్ (సి), శుభ్‌మన్ గిల్, హ్యారీ బ్రూక్, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), రవీంద్ర జడేజా, మార్కో జాన్సెన్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జస్ప్రీత్ బుమ్రా
ఇదీ చదవండి: IND Vs PAK: భారత బౌలర్, పాక్ బ్యాటర్ మధ్య మాటల యుద్ధం


