సంచలనం.. డబుల్‌ హ్యాట్రిక్‌ | Jamshed Alam Bags Double Hat Trick To Rewrite SMAT Record | Sakshi
Sakshi News home page

సంచలనం.. డబుల్‌ హ్యాట్రిక్‌

Nov 22 2026 1:46 PM | Updated on Nov 22 2026 1:51 PM

Jamshed Alam Bags Double Hat Trick To Rewrite SMAT Record

source: X

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ (SMAT) ఎలైట్‌ 2026 టోర్నీలో రైల్వేస్‌ పేసర్‌ జంషెడ్‌ ఆలం సంచలనం సృష్టించాడు. సౌరాష్ట్రతో జరిగిన కీలక మ్యాచ్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించాడు. మొత్తంగా 38 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అతడి ఐదు వికెట్లలో నాలుగు వరుస బంతుల్లోనే రావడం విశేషం.

అభిమన్యు మిథున్‌, దర్శన్‌ నల్కండే సరసన జంషెడ్‌
రైల్వేస్‌ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్య ఛేదనలో సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ను జంషెడ్‌ ఆలం వేశాడు. ఆ ఓవర్‌లో తొలి వికెట్‌గా హర్విక్‌ దేశాయ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాతి మూడు బంతుల్లోనూ వరుసగా ప్రేరక్‌ మాంకడ్‌, రుచిత్‌ అహిర్‌, సమ్మర్‌ గజ్జర్‌లను ఔట్‌ చేశాడు. ఇలా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి డబుల్‌ హ్యాట్రిక్‌ పూర్తి చేశాడు.

23 ఏళ్ల జంషెడ్‌ ఆలం.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ చరిత్రలో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. గతంలో అభిమన్యు మిథున్‌, దర్శన్‌ నల్కండే ఈ ఘనత సాధించారు.

రాణించిన అండర్‌-19 ఆసియా కప్‌ హీరో
అండర్‌-19 ఆసియా కప్‌ 2026 ఫైనల్లో పాకిస్తాన్‌పై అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మొహిత్‌ ఉల్వా.. ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున మెరుగైన ప్రదర్శన చేశాడు.15 బంతుల్లో 22 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ నాలుగు ఓవర్లలో 38 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

మొహిత్‌ ఉల్వా రాణించినప్పటికీ.. జంషెడ్‌ ఆలం ఐదు వికెట్ల ప్రదర్శనతో సౌరాష్ట్రను 153/8కే పరిమితం చేశాడు. తద్వారా రైల్వేస్‌ 29 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.

ఇదీ చదవండి: దంచికొట్టిన 3D ప్లేయర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement