Photo Credit: BCCI Twitter
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో ఆదివారం చిరకాల ప్రత్యర్థులు ఇండియా-ఏ, పాకిస్తాన్-ఏ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దోహా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ సారథ్యంలోని టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. నేపాల్‌తో జరిగిన తొలి పోరులో భారత్ 306 పరుగుల తేడాతో లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసి జోష్ మీద ఉంది.
నేపాల్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ విఫలమైనప్పటికీ, పాక్‌తో మ్యాచ్‌లో చెలరేగే అవకాశముంది. ఆయుశ్ బదోని, కుమార్ కుషాగ్ర, తిలక్ వర్మ, రింకూ సింగ్, ప్రబ్‌సిమ్రన్‌సింగ్‌లతో బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఇక తమ బౌలింగ్‌తో నేపాల్‌ను బెంబెలెత్తించిన ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రానాలు చిరకాల ప్రత్యర్థిపై మరోసారి చెలరేగితే మాత్రం పాక్‌కు కష్టాలు తప్పవు.
వీరిద్దరికి తోడు సూర్యాన్ష్ షెడ్గే, షహబాజ్ అహ్మద్, విప్రజ్ నిగమ్ వంటి పదునైన ఆల్‌రౌండర్లు ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశం. మొత్తం మీద భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు పాకిస్తాన్-ఏ జట్టు కూడా యూఏఈపై 61 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. అబ్దుల్ సమద్ నాయకత్వంలోని పాక్ జట్టులో షమైల్ హుసేన్, మాజ్ సదాకత్, అబ్దుల్ సమద్‌లు బ్యాటింగ్‌లో కీలకం కానుండగా, బౌలింగ్‌లో సుఫ్యాన్ మొకిమ్, పేసర్ అలీరెజా, మొహమ్మద్ హస్నైన్‌లు కీలకం కానున్నారు. ఇక మ్యాచ్ రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: రిషబ్ పంత్ ప్రపంచ రికార్డు


