ఇంగ్లండ్‌పై ఆల్‌రౌండ్‌ షో.. చ‌రిత్ర సృష్టించిన ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ | IND-Born-Nikhil-Chaudhary-History-Match Winning Knock Vs ENG 1st T20I | Sakshi
Sakshi News home page

AUS Vs ENG: ఇంగ్లండ్‌పై ఆల్‌రౌండ్‌ షో.. చ‌రిత్ర సృష్టించిన ఆసీస్‌ ఆల్‌రౌండర్‌

Nov 21 2026 6:49 PM | Updated on Nov 21 2026 7:08 PM

IND-Born-Nikhil-Chaudhary-History-Match Winning Knock Vs ENG 1st T20I

Photo Credit: Twitter

మెల్‌బోర్న్ వేదిక‌గా శ‌నివారం రాత్రి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రిగిన హైవోల్టేజీ మ్యాచ్ అభిమానుల‌ను అల‌రించింది. మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజ‌యాన్ని న‌మోదు చేసింది. మ్యాచ్‌లో భార‌త సంత‌తి క్రికెట‌ర్ నిఖిల్ చౌద‌రి ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో హీరోగా నిలిచాడు. 

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన నిఖిల్ చౌద‌రి ఛేద‌న స‌మ‌యంలో ఉండే ఒత్తిడిని త‌ట్టుకొని 38 బంతుల్లోనే 66 ప‌రుగులు సాధించి ఆసీస్ గెలుపుకు బాట‌లు వేశాడు. నిఖిల్ చౌద‌రికి ఇదే తొలి అంత‌ర్జాతీయ టీ20 ఫిఫ్టీ కావ‌డం విశేషం. అంత‌క‌ముందు బౌలింగ్‌లో రెండు కీల‌క వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఈ నేప‌థ్యంలోనే నిఖిల్ చౌద‌రి ఒక అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే, ఇంగ్లండ్‌తో టీ20ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ఆసీస్ బ్యాట‌ర్‌గా రికార్డులకెక్కాడు. 2018లో హోబర్ట్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన టీ20లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి గ్లెన్ మ్యాక్స్‌వెల్ (58 బంతుల్లో 103 నాటౌట్‌) అజేయ సెంచ‌రీ సాధించి తొలి స్థానంలో నిలిచాడు. 

రెండో స్థానంలో నిఖిల్ చౌద‌రీ ఉండ‌గా, మూడో స్థానంలో జార్జ్ బెయిలీ (28 బంతుల్లో 20 నాటౌట్‌; 2014లో మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో) కొన‌సాగుతున్నాడు. త‌న కెరీర్‌లో మూడో టీ20 ఆడుతున్న నిఖిల్ చౌద‌రి ఇప్ప‌టివ‌ర‌కు లిస్ట్‌-ఏ టీ20 క్రికెట్‌లో 1200 ప‌రుగులు చేయ‌డంతో పాటు త‌న లెగ్‌బ్రేక్ బౌలింగ్‌తో 32 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తాజా అర్థ‌సెంచ‌రీతో నిఖిల్ చౌద‌రి ఆసీస్ జ‌ట్టులో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప‌నిలో ప‌డ్డాడు.

ఎవ‌రీ నిఖిల్ చౌద‌రి?
నిఖిల్ చౌదరి ఢిల్లీలో జన్మించాడు. 2017-2019 మధ్య కాలంలో పంజాబ్ జట్టు తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (T20), విజయ్ హజారే ట్రోఫీ (లిస్ట్-A) లలో ఆడాడు. ప్రస్తుత భారత స్టార్ క్రికెటర్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మలతో కలిసి నిఖిల్ దేశవాళీ క్రికెట్ ఆడాడు. అలాగే ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ ట్ర‌య‌ల్స్‌లో కూడా పాల్గొన్నాడు.

అయితే 2020లో నిఖిల్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉన్న తన బాబాయ్‌ను కలవడానికి వెళ్ళాడు. అదే సమయంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆస్ట్రేలియా అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసింది. దీంతో నిఖిల్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బతుకుదెరువు కోసం క్రికెట్ ఆడుతూనే.. ఒక మెక్సికన్ రెస్టారెంట్లో, ఆ తర్వాత కొంతకాలం పోస్ట్మ్యాన్ గా కూడా పనిచేశాడు.

బ్రిస్బేన్‌లో గ్రేడ్ క్రికెట్ ఆడుతున్న సమయంలో అప్పటి హోబర్ట్ హరికేన్స్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ కంటిలో నిఖిల్ పడ్డాడు. హోప్స్ సిఫార్సుతో బిగ్ బాష్ లీగ్ (BBL) లో హోబర్ట్ హరికేన్స్ జట్టు నిఖిల్‌ను ఎంపిక చేసింది. 2023/24 సీజన్ నుంచి జట్టులో కీలక సభ్యుడిగా మారిన నిఖిల్, 2024-25 లో హరికేన్స్ బిగ్ బాష్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 

గత సీజన్లో 153.50 స్ట్రైక్ రేట్‌తో 307 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.  ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో టాస్మానియా జట్టు తరపున ఆడుతూ షెఫీల్డ్ షీల్డ్లో అరంగేట్రం చేశాడు. క్వీన్స్‌లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్ల హాల్ తీయడంతో పాటు అజేయంగా 76 పరుగులు చేశాడు. ఆ తర్వాతి నెలలోనే న్యూ సౌత్ వేల్స్‌పై తన తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీని కూడా నమోదు చేశాడు.

ఇదీ చదవండి: AUS vs ENG: ఇంగ్లండ్‌ సరికొత్త చరిత్ర.. టీమిండియా రికార్డ్‌ బ్రేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement