చెన్నై: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ చిత్రకారుడు శ్రీనివాసన్(86) కన్నుమూశారు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టికి చెందిన ఆయన.. వయోభారంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. ప్రపంచవ్యాప్తంగా కనిపించే వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసింది ఆయనే కావడం విశేషం. అలాంటి చిత్రకారుడు ఇక లేరన్న వార్తతో ఆయన చిత్రకళా ప్రస్థానం మరోసారి గుర్తుకొస్తోంది.
1970లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు గర్భగుడిలోని శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసి చిత్రించేందుకు ఆసక్తి ఉన్న చిత్రకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందుకోసం ఓ వార్తాపత్రికలో ప్రకటన ఇచ్చారు. ప్రముఖ చిత్రకారుడు ఓవిమామణి కొండైరాజు వద్ద చిత్రకళను అభ్యసించిన శ్రీనివాసన్ ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన పేరును పరిశీలించిన టీటీడీ.. తిరుమలకు రావాలని లేఖ పంపించింది.
అయితే, ఆ సమయంలో శ్రీనివాసన్‌కు తట్టు వ్యాధి సోకడంతో నిర్ణీత తేదీన తిరుపతికి వెళ్లలేకపోయారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత టీటీడీ పంపిన లేఖతో తిరుమలకు చేరుకున్నారు. తన అనారోగ్య సమస్యను అధికారులకు వివరించి, గర్భగుడి సమీపంలో కూర్చొని స్వామివారి చిత్రాన్ని గీసేందుకు అనుమతి కోరారు. ఇందుకోసం ఆయన చాలాకాలం ప్రయత్నించాల్సి వచ్చింది. చివరకు అధికారులు అనుమతి ఇచ్చారు. స్వామివారి విగ్రహంతో పాటు ఆభరణాలను కూడా చిత్రించేందుకు అవకాశం కల్పించారు. ఆభరణాలతో అలంకరించిన రూపంతో పాటు, అలంకరణ లేని స్వామివారి చిత్రాన్ని కూడా గీసేందుకు సమయం కేటాయించారు. అలా గర్భగుడి సమీపంలో కూర్చొని శ్రీనివాసన్ గీసిన వెంకటాచలపతి చిత్రం విశేష ప్రజాదరణ పొందింది.
కొండైరాజు గురుకులంలో చిత్రకళను అభ్యసించిన శిష్యుల్లో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉండేది. ఆ చిత్రకళా సంప్రదాయానికి చెందిన శ్రీనివాసన్ తన కుంచెతో శ్రీవేంకటేశ్వర స్వామి రూపాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఆయన గీసిన చిత్రాన్ని శివకాశి ప్రింటర్స్ ముద్రించి, క్యాలెండర్ల రూపంలోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భక్తుల ఇళ్లలో, వ్యాపార సంస్థల్లో కనిపించే ప్రసిద్ధ చిత్రంగా మారింది.
ఇదీ చదవండి: పులివెందుల రిజర్వేషన్‌లో ట్విస్ట్.. ఈసీ ఇదేం లెక్క?


