పులివెందుల రిజర్వేషన్‌లో ట్విస్ట్‌.. ఈసీ ఇదేం లెక్క? | Pulivendula Twist ST Quota for MPP Post Despite No ST MPTC Seats | Sakshi
Sakshi News home page

పులివెందుల రిజర్వేషన్‌లో ట్విస్ట్‌.. ఈసీ ఇదేం లెక్క?

Nov 14 2026 11:44 AM | Updated on Nov 14 2026 11:52 AM

Pulivendula Twist ST Quota for MPP Post Despite No ST MPTC Seats

సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు మరో కొత్త వివాదానికి తెరలేపాయి. ఎంపీపీ స్థానాన్ని ఎస్టీలకు కేటాయించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. అదే మండలంలోని ఐదు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఎస్టీలకు కేటాయించలేదు. దీంతో ఎస్టీ ఎంపీటీసీ సభ్యుడే లేకుండా ఎంపీపీని ఎలా ఎన్నుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం రిజర్వేషన్ల కేటాయింపుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఎన్నికల సంఘం తీరుపై రాజకీయ నేతలు మండిపడుతున్నారు. 

పులివెందుల మండలంలోని ఐదు ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించే క్రమంలో జనరల్ మహిళకు రెండు, జనరల్‌కు ఒకటి, ఎస్సీలకు ఒకటి, బీసీలకు ఒకటి చొప్పున కేటాయించారు. ఎన్నికల్లో ఎస్టీలకు మాత్రం ఒక్క స్థానం కూడా కేటాయించలేదు. మరోవైపు మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) స్థానాన్ని మాత్రం ఎస్టీలకు రిజర్వ్ చేశారు. దీంతో ఎంపీపీని ఎన్నుకునే సమయంలో ఎస్టీ వర్గానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడే లేకపోతే ఎలా ఎంపీపీని ఎన్నుకుంటారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే.. పులివెందుల మండలంలోని ఐదు ఎంపీటీసీ స్థానాలనూ టీడీపీ దౌర్జన్యం చేసి ఏకగ్రీవం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా దౌర్జన్యాలకు పాల్పడింది. అయితే, కుట్రలతో ఐదు స్థానాలనూ ఏకగ్రీవం చేసుకున్నప్పటికీ ఎంపీపీ స్థానం ఎస్టీలకు కేటాయించడంతో ఆ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై టీడీపీ నేతల్లోనూ అయోమయం నెలకొంది. ఈసీ నిర్ణయంలో రిజర్వేషన్ల కేటాయింపులో ఈ పరిస్థితి ఎలా తలెత్తిందనే దానిపై అధికారుల్లోనూ తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో రిజర్వేషన్లను తిరిగి కేటాయించి ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారా? లేక ప్రస్తుత కేటాయింపులపైనే ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చ సాగుతోంది. మొత్తానికి ఐదు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్క ఎస్టీ స్థానం కూడా లేకపోవడం.. ఎంపీపీ స్థానాన్ని మాత్రం ఎస్టీలకు కేటాయించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. ఏం చేయాలో పాలుపోక అధికారులు, అధికార పార్టీ నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. 

ఇదీ చదవండి: పల్నాడులో ఉద్రికత్త.. పోలీసుల ఓవరాక్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement