ఉదయనిధి స్టాలిన్‌కు హైకోర్టులో బిగ్‌ షాక్‌ | DMK Udhayanidhi Stalin Faces Legal Challenge Over Election Victory | Sakshi
Sakshi News home page

ఉదయనిధి స్టాలిన్‌కు హైకోర్టులో బిగ్‌ షాక్‌

Nov 14 2026 9:35 AM | Updated on Nov 14 2026 9:35 AM

DMK Udhayanidhi Stalin Faces Legal Challenge Over Election Victory

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రతిపక్ష నేత, డీఎంకే కీలక నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపును సవాలు చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను ప్రారంభ దశలోనే కొట్టివేయాలన్న ఆయన ప్రయత్నానికి న్యాయస్థానం అడ్డుకట్ట వేసింది. ఎన్నికల పిటిషన్‌పై విచారణ కొనసాగించేందుకు అనుమతించింది. అంతేకాదు.. నాలుగు వారాల్లోగా తన వాదనలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో చెపాక్‌-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి ఉదయనిధి సాధించిన విజయంపై న్యాయపోరాటం ఆసక్తికరంగా మారింది.

ఎన్నికల పిటిషన్‌ వెనుక అసలు వివాదం ఏమిటి?
2026 ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్‌-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన ఉదయనిధి స్టాలిన్‌ 62,992 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, టీవీకే అభ్యర్థి డి. సెల్వం 55,852 ఓట్లు పొందారు. దీంతో ఉదయనిధి 7,140 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పి. మిలానీకి కేవలం 30 ఓట్లు వచ్చాయి. అయినప్పటికీ ఆయన ఉదయనిధి ఎన్నికను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

నామినేషన్‌ పత్రాలు, ఆస్తుల వివరాలపై అభ్యంతరాలు
ఉదయనిధి స్టాలిన్‌ ఎన్నికల అఫిడవిట్‌, నామినేషన్‌ పత్రాల్లో కొన్ని వివరాలను సరిగ్గా వెల్లడించలేదని మిలానీ తన పిటిషన్‌లో ఆరోపించారు. ముఖ్యంగా ఫారం-26 అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులు, ఆర్థిక బాధ్యతలకు సంబంధించిన వివరాలను పూర్తిగా వెల్లడించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే మరో అభ్యర్థి దిలీప్‌ కుమార్‌ నామినేషన్‌ను సరిగా తిరస్కరించలేదని, ఉదయనిధి నామినేషన్‌ను సక్రమంగా పరిశీలించకుండా ఆమోదించారని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఇవ్వడం ఓటర్లను ప్రభావితం చేసే చర్యగా పరిగణించాలన్నది పిటిషనర్‌ వాదన.

45 రోజుల గడువుపై ఉదయనిధి వాదన
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 81 ప్రకారం ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోపు ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేయాలి. ఈ నిబంధనను ప్రస్తావిస్తూ ఉదయనిధి స్టాలిన్‌ తరఫు న్యాయవాదులు కీలక అభ్యంతరం లేవనెత్తారు. మే 4న ఎన్నికల ఫలితం ప్రకటించగా.. జూన్‌ 18న మిలానీ పిటిషన్‌ దాఖలు చేశారని, గడువు ముగిసిన తర్వాత వచ్చిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించకూడదని వాదించారు. అయితే పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు ఈ వాదనను వ్యతిరేకించారు. గడువు లెక్కింపులో ఎన్నిక ఫలితం ప్రకటించిన రోజును మినహాయించాలని పేర్కొన్నారు. ఈ లెక్క ప్రకారం మే 5 నుంచి జూన్‌ 18 వరకు 45 రోజుల గడువు పూర్తవుతుందని వివరించారు. ఈ వాదనను పరిశీలించిన న్యాయస్థానం పిటిషన్‌ గడువులోపే దాఖలైనట్లు స్పష్టం చేసింది.

కోర్టును ఆశ్రయించిన మిలానీ
ఈ వివాదంలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. ఉదయనిధి స్టాలిన్‌కు సంబంధించిన ఎన్నికల పత్రాలు పొందేందుకు మిలానీ తొలుత ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. అక్కడి నుంచి అవసరమైన పత్రాలు లభించకపోవడంతో మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఉదయనిధి సమర్పించిన ఆమోదిత నామినేషన్‌ పత్రం (ఫారం-2బి), దానికి జత చేసిన అఫిడవిట్‌, సమర్పించిన పత్రాల చెక్‌లిస్ట్‌తో పాటు తిరస్కరించిన నామినేషన్లు, వాటిపై వచ్చిన అభ్యంతరాలు, రిటర్నింగ్‌ అధికారి తీసుకున్న నిర్ణయాల ధ్రువీకరించిన ప్రతులను కోరారు. జూన్‌ 8న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఈ పత్రాలను అందించాలని ఆదేశించింది. అనంతరం వాటి ఆధారంగా మిలానీ ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇక, ఈ వ్యవహారంపై జస్టిస్‌ జి. అరుల్‌ మురుగన్‌ ధర్మాసనం అక్టోబర్‌ 22న ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నవంబర్‌ 13న తీర్పు వెలువరించింది. ఎన్నికల పిటిషన్‌ను ప్రారంభ దశలోనే కొట్టివేయాలని, అందులోని కొన్ని అంశాలను తొలగించాలని ఉదయనిధి దాఖలు చేసిన రెండు అభ్యర్థనలను తిరస్కరించింది. నాలుగు వారాల్లోగా తన సమాధానాన్ని కౌంటర్‌ రూపంలో దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 11కు వాయిదా వేసింది. 

ఇదీ చదవండి: టీవీకేలో చేరిన రేవతి మణివన్నన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement