సరిహద్దుల్లో విష వ్యర్థాల డంపింగ్‌.. సీఎం విజయ్‌కు బీజేపీ నేత సవాల్‌! | Tamil Nadu is Keralam dumping ground Nagendran serious On Vijay | Sakshi
Sakshi News home page

సరిహద్దుల్లో విష వ్యర్థాల డంపింగ్‌.. సీఎం విజయ్‌కు బీజేపీ నేత సవాల్‌!

Nov 12 2026 12:43 PM | Updated on Nov 12 2026 12:43 PM

Tamil Nadu is Keralam dumping ground Nagendran serious On Vijay

చెన్నై: ఒకవైపు పచ్చని పొలాలు.. మరోవైపు ఆసుపత్రుల నుంచి వచ్చిన ప్రమాదకర వ్యర్థాలు. కేరళ నుంచి తమిళనాడులోకి వైద్య వ్యర్థాలను అక్రమంగా తరలించి వ్యవసాయ భూముల్లో పడేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వ్యర్థాలను పడేయడమే కాకుండా అక్కడే తగలబెడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ తీవ్రంగా స్పందించారు. సీఎం విజయ్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా వీడియోను షేర్‌ చేశారు.

తమిళనాడులోని తెన్కాశి జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని నాగేంద్రన్‌ ఆరోపించారు. కేరళ నుంచి టన్నుల కొద్దీ వైద్య వ్యర్థాలను తీసుకొచ్చి వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాల్లో పడేస్తున్నారని తెలిపారు. కొన్ని చోట్ల వాటిని తగలబెడుతున్నారని పేర్కొన్నారు. తాజాగా తెన్కాశి జిల్లా శంకరన్‌కోవిల్‌ సమీపంలోని వెప్పన్‌కుళం గ్రామంలో ప్రైవేటు భూమిపై వైద్య, ప్లాస్టిక్‌ వ్యర్థాలను పడేసి తగలబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. బుధవారం ఉదయం దుర్వాసన, పొగ కారణంగా స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు, తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి వ్యర్థాలను తీసుకొచ్చిన వాహనాలను గుర్తిస్తామని పోలీసులు తెలిపారు.

కేరళ లేబుళ్లతో బాటిళ్లు!
వ్యర్థాల్లో కేరళలోని ఆసుపత్రులు, సంస్థలకు సంబంధించినవిగా అనుమానిస్తున్న మందుల సీసాలు, ప్లాస్టిక్‌ సంచులు కనిపించాయని స్థానికులు తెలిపారు. కొన్ని బాటిళ్లపై 'For sale in Kerala state only' అనే లేబుళ్లు ఉన్నాయని నైనార్‌ నాగేంద్రన్‌ తన ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. కేరళ నుంచి వచ్చే వ్యర్థాలను అడ్డుకోవడంలో సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద సరైన నిఘా లేదని ఆయన విమర్శించారు. కేరళలో మాత్రం ఇతర రాష్ట్రాల వ్యర్థాలు తమ ప్రాంతంలోకి రాకుండా కఠినంగా తనిఖీలు చేస్తున్నారని ఆరోపించారు.

సీఎం విజయ్‌కు కీలక డిమాండ్లు!
ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి విజయ్‌ వెంటనే స్పందించాలని నాగేంద్రన్‌ కోరారు. కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడి వ్యర్థాల తరలింపును నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలని, అక్రమంగా వ్యర్థాలు తరలించే వాహనాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. బాధ్యులపై కేసులు నమోదు చేయాలని కోరారు. ఇదిలా ఉండగా.. 2024 డిసెంబర్‌లోనూ కేరళ నుంచి వచ్చిన భారీ మొత్తంలో బయోమెడికల్‌ వ్యర్థాలను తిరునల్వేలి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పడేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (NGT) సుమోటోగా విచారణ చేపట్టి, కేరళ ప్రభుత్వం ఆ వ్యర్థాలను వెనక్కి తీసుకెళ్లాలని ఆదేశించింది. ఆ తర్వాత 30కి పైగా లారీల్లో వ్యర్థాలను తరలించారు. తాజాగా మళ్లీ ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడంతో సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ వ్యవహారంపై నవంబర్‌ 18న NGTలో తదుపరి విచారణ జరగనుంది. 

ఇదీ చదవండి: పవార్‌ ఫ్యామిలీలో ట్విస్ట్‌.. సునేత్రా వ్యాఖ్యలతో పొలిటికల్ సస్పెన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement