రూ. 140తో కాలుష్యానికి చెక్‌.. ఢిల్లీ కుర్రాడి వినూత్న ఆవిష్కరణ | Student Turns Ceiling Fan into air Purifier | Sakshi
Sakshi News home page

రూ. 140తో కాలుష్యానికి చెక్‌.. ఢిల్లీ కుర్రాడి వినూత్న ఆవిష్కరణ

Nov 12 2026 12:21 PM | Updated on Nov 12 2026 12:21 PM

Student Turns Ceiling Fan into air Purifier

న్యూఢిల్లీ: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు 16 ఏళ్ల విద్యార్థి వినూత్న ఆవిష్కరణ చేశాడు. ఖరీదైన ఎయిర్ ప్యూరిఫైయర్లు కొనలేని సామాన్యులకు ఉపయోగపడేలా సాధారణ ఫ్యాన్‌నే ఎయిర్ ప్యూరిఫైయర్‌గా మార్చే ప్రత్యేక ఫిల్టర్‌ను రూపొందించాడు. కేవలం రూ.140 ఖర్చుతో తయారయ్యే ఈ ఫిల్టర్‌తో గాలిలోని కాలుష్యాన్ని 90 శాతం వరకు తగ్గించవచ్చని పరీక్షల్లో వెల్లడైంది.

ఢిల్లీకి చెందిన కృష్ అగర్వాల్ తన స్నేహితుడు సమర్థ్ మీటల్‌తో కలిసి ‘ప్రాజెక్ట్ వాయు’ను ప్రారంభించాడు. ఈ ప్రాజెక్టులో భాగంగా రూపొందించిన ప్రత్యేక ఫిల్టర్‌ను సాధారణ ఫ్యాన్‌కు అమర్చుకోవచ్చు. ఇందులో ఎలక్ట్రోస్టాటిక్‌గా ఛార్జ్ చేసిన ఫైబర్లను ఉపయోగించారు. ఇవి గాలిలోని సూక్ష్మ ధూళి, కాలుష్య కణాలను ఆకర్షించి పట్టుకుంటాయి. ఫ్యాన్ ఆన్ చేయగానే ఫిల్టర్ బెలూన్‌లా ఉబ్బి గాలిని శుద్ధి చేస్తుంది.

మూసి ఉన్న గదిలో నిర్వహించిన పరీక్షల్లో గాలిలో పీఎం2.5 స్థాయి ఒక క్యూబిక్ మీటర్‌కు 158 మైక్రోగ్రాముల నుంచి గంట తర్వాత 11 మైక్రోగ్రాములకు తగ్గింది. అంటే దాదాపు 90 శాతం కాలుష్యం తగ్గినట్లు పరీక్షల్లో తేలింది. ఈ ఫిల్టర్లను పాఠశాలల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. తొలుత 602 ఫిల్టర్లను 295 తరగతి గదుల్లో ఏర్పాటు చేయగా, సుమారు 8 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. ఇప్పటివరకు 10 వేలకు పైగా విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరింది. త్వరలో మరో 45 పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ వినూత్న ఆవిష్కరణకు కృష్ అగర్వాల్‌కు ‘2026 డయానా’ అవార్డు లభించింది.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement