ఫరీదాబాద్: పార్కింగ్ వివాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. చిన్నచిన్న విషయాలపై పొరుగువారితో ఏర్పడిన గొడవ చివరకు హత్యకు దారితీసింది. సింగపూర్‌లోని ఓ బహుళజాతి సంస్థలో పనిచేస్తున్న పరంజీత్ ధన్‌ఖడ్ (42)ను ఆయన పొరుగింట్లో ఉండే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. కుటుంబంలో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు సింగపూర్ నుంచి భారత్‌కు వచ్చిన ఆయన దారుణ హత్యకు గురయ్యారు. నవంబర్ 6న ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
అందులో నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడం, బాధితుడి కుమారుడు భయంతో పరుగులు తీయడం కనిపిస్తోంది. హరియాణాలోని ఫరీదాబాద్ సెక్టార్ 21సీలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. నిందితుడు మోను శర్మ పార్కింగ్ సమస్యపై మాట్లాడాలంటూ మొదటి అంతస్తులోని తన ఇంటి నుంచి పరంజీత్‌ను బయటకు పిలిచాడు. ఆ సమయంలో పరంజీత్ కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
మాట్లాడుతూనే మోను శర్మ.. పరంజీత్‌ను ‘వితంతువు అంటే తెలుసా?’ అంటూ ప్రశ్నించాడు. తనపై ముగ్గురితో దాడి చేయించేందుకు పరంజీత్ ప్రయత్నించాడని ఆరోపించాడు. దీంతో అయోమయానికి గురైన పరంజీత్ ఏం జరిగిందో చెప్పాలని.. తనకు ఈ విషయం తెలియదని చేతులు జోడించి మరీ బదులిచ్చాడు. అయినప్పటికీ నిందితుడు వినిపించుకోలేదు.
టీషర్ట్, లోయర్ ధరించి ఉన్న మోను శర్మ ఒక్కసారిగా తన కుడి జేబులో నుంచి తుపాకీ తీసి పరంజీత్‌పై కాల్పులు జరిపాడు. కేవలం ఐదు సెకన్ల వ్యవధిలోనే పలుమార్లు కాల్పులు జరిపాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరంజీత్ పరుగులు తీస్తున్నా నిందితుడు వెంటాడుతూ తూటాల వర్షం కురిపించాడు. బాధితుడు భవనం బయటకు వెళ్లి గేటు మూసే ప్రయత్నం చేయగా.. నిందితుడు కూడా అతడి వెంట బయటకు వచ్చాడు. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉన్న పరంజీత్.. నిందితుడి కాలర్ పట్టుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కొద్దిసేపు పెనుగులాట జరిగింది. ఇంతలో ఓ మహిళ భవనం నుంచి బయటకు పరుగెత్తుకొచ్చి సాయం కోసం కేకలు వేసింది.
అయితే, కాల్పులు ఆపి అక్కడి నుంచి పారిపోతాడని భావించిన నిందితుడు.. అందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన తుపాకీలో మళ్లీ బుల్లెట్లు నింపుకుని పరంజీత్ వద్దకు వచ్చాడు. మరో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ సమయంలో బాధితుడిని దూషిస్తూ.. ‘హ్యాపీ దీపావళి..’ అని అరిచాడు. అంతటితో ఆగకుండా ‘అందరినీ చంపేస్తా.. అందరినీ చంపిన తర్వాతే వెళ్తా’ అంటూ బెదిరించాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు నిందితుడు మోను శర్మను అరెస్టు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో క్రైమ్ బ్రాంచ్ బృందాలన్నీ రంగంలోకి దిగి అతడిని పట్టుకున్నాయని సూరజ్‌కుండ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ప్రహ్లాద్ కుమార్ వెల్లడించారు.
పరంజీత్ తన మేనల్లుడి వివాహానికి హాజరయ్యేందుకు ఘటనకు ఒక్కరోజు ముందే భారత్‌కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు, నిందితుడు ఇద్దరూ ఫరీదాబాద్‌లోని సెక్టార్ 21సీలో ఒకే భవనంలో నివసిస్తున్నారు. పరంజీత్ మొదటి అంతస్తులో, మోను శర్మ మూడో అంతస్తులో ఉంటున్నారు. పార్కింగ్ సహా ఇతర చిన్నచిన్న విషయాలపై గతంలోనూ ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, అవే చివరకు నవంబర్ 6న హత్యకు దారితీశాయని పోలీసులు వెల్లడించారు.
this is so disturbing video Singapore nunchi Paramjeet Dhankhar, 42, IT executive — Diwali ki, nephew wedding ki vachadu.Parking dispute lo neighbour kalchi champadu. Champaka "Happy Diwali" ani paripoyadhu. #Faridabad https://t.co/waMPbkIUzj
— Insight Hunt🕶️ (@Insighthunt) November 12, 2026
ఇదీ చదవండి: అదృశ్యమైన పోలీసులు.. అనుమానాస్పద మృతి


