ఫరీదాబాద్: పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం కాల్పులకు దారితీసింది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో టెక్ రంగానికి చెందిన సీనియర్ అధికారి పరమ్‌జీత్ ధన్‌ఖర్ (Paramjit Dhankhar) తన పొరుగింటి వ్యక్తి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. సింగపూర్ నుంచి మేనల్లుడి వివాహానికి వచ్చిన ఆయనపై నిందితుడు తన లైసెన్స్‌డ్ పిస్టల్‌తో సుమారు 15 రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే అందులో తొమ్మిది బుల్లెట్లు తగిలి పరమ్‌జీత్ అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసుల వివరాల ప్రకారం.. టెక్ మహీంద్రా ఆసియా కార్యకలాపాలకు గతంలో నాయకత్వం వహించిన పరమ్‌జీత్ ప్రస్తుతం వియత్నాంకు చెందిన ఓ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం. ఆయన మేనల్లుడి వివాహం కోసం రెండు రోజుల క్రితమే పరమ్‌జీత్ ఫరీదాబాద్‌కు వచ్చారు. కాగా శుక్రవారం రాత్రి జిమ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. అయితే అప్పటికే తన పార్కింగ్ స్థలంలో పొరుగునే ఉండే మోహన్ అలియాస్ మోను శర్మ కారు కనిపించింది. దాంతో పరమ్‌జీత్ తన పార్కింగ్ స్థలం నుంచి కారును తొలగించాలని కోరడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన మోహన్ తన లైసెన్స్‌డ్ పిస్టల్‌తో వరుస కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే గతంలోనూ ఇరు కుటుంబాల మధ్య పెంపుడు కుక్కను పార్కింగ్ ప్రదేశంలోకి తీసుకురావడం వంటి ఇతర విషయాలపై కూడా గొడవలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
కాల్పుల అనంతరం నిందితుడు కుటుంబంతో కలిసి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ బృందాలు ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: ప్రజల వాహనాల్లో పెట్రోల్ చోరీ: రాహుల్ గాంధీ


