విదేశీ శక్తుల చేతుల్లో ‘టూల్‌కిట్’లా పని చేస్తున్నారు
రాహుల్ గాంధీపై నితిన్ నబిన్ ధ్వజం
హరియాణాలో ‘లోక్‌తంత్ర బచావో, అరాచకతా హఠావో’పాదయాత్ర
చండీగఢ్: దేశంలో అరాచకం సృష్టించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కుట్రలు సాగిస్తున్నారని, విదేశీ శక్తుల ఆదేశాల మేరకు పని చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మండిపడ్డారు. రాహుల్ విదేశీ శక్తుల చేతుల్లో ఒక ‘టూల్‌కిట్’లా వ్యవహరిస్తూ దేశ ప్రజాస్వామ్యాన్ని సవాలు చేస్తున్నారని విమర్శించారు. భారతదేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందే తప్ప, ‘గాంధీ కుటుంబ చట్టాల’ప్రకారం కాదని తేల్చిచెప్పారు.
ఓట్ల చోరీ ఆరోపణలపై ప్రతిపక్ష కూటమి ఢిల్లీలో ర్యాలీ నిర్వహించడాన్ని తప్పుపట్టారు. ప్రజాదరణ కోల్పోయి ఎన్నికల్లో వరుసగా ఓడిపోతుండడంతో నిరాశకు లోనై రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం హరియాణాలోని రోహ్‌తక్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘లోక్‌తంత్ర బచావో, అరాచకతా హఠావో’పేరిట భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నితిన్ నబిన్ పాల్గొన్నారు.
పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేసి, క్షమాపణ కోరడానికి బదులుగా, ఆ హత్యాకాండ జరిగి నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు దిగిందని తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అత్యున్నతమైనదని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పుడు ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారని గుర్తుచేశారు. కానీ, హరియాణా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌లో ఓడిపోయినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ నిందలు వేశారని ఆరోపించారు.
ఈ ద్వంద్వ ప్రమాణాలు ఏమిటని నిలదీశారు. గాంధీ కుటుంబం నిర్దేశించే నియమాల ప్రకారమే ప్రజాస్వామ్యం నడవాలా? అని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజాస్వామ్యాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తారని నితిన్ నబిన్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను నెహ్రూ–గాంధీ కుటుంబం అవమానించిందని ఆరోపించారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీనే మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని పునరుద్ఘాటించారు. మోదీ ఎక్కడికీ వెళ్లబోరని, 2029లో ఆయన మళ్లీ ఎర్రకోట వద్ద కనిపిస్తారని స్పష్టంచేశారు.


