కాంగ్రెస్ నేత రాహుల్ గాందీకి అమిత్ షా హితవు
సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగిన రోజే ‘బడా జల్సా’ చేసుకున్నారని ధ్వజం
చండీగఢ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1984 నవంబర్ 1న ఢిల్లీలో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయని, అదే నవంబర్ 1న ఢిల్లీలో రాహుల్ గాంధీ చేసుకున్న ‘బడా జల్సా’ను దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి పదవి కావాలని అనుకుంటే జీవితాంతం ‘మాక్ పార్లమెంట్’లోనే ఉండాలని రాహుల్‌కు సూచించారు. అమిత్ షా ఆదివారం చండీగఢ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు.
అబద్ధాలు చెప్పడం, అరాచకాన్ని, ప్రతికూలతను వ్యాప్తి చేయడం, పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకోవడం ప్రతిపక్షాల నిజ స్వరూపమని విమర్శించారు. ఢిల్లీలో నరమేధం జరిగిన విషాదకరమైన రోజున ‘జల్సా’నిర్వహించారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రాహుల్ చెబుతున్న ‘మొహబ్బత్ కీ దుకాన్’నుంచి ప్రజలు ద్వేషం తప్ప మరేమీ పొందలేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గత 15 ఏళ్లుగా ఎన్నికల్లో ఓడిపోతోందని, కుమారుడు రాహుల్ ప్రధానమంత్రి కావాలన్న సోనియా గాంధీ కల ఇంకా నెరవేరలేదని ఎద్దేవా చేశారు. దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం రాహుల్‌కు ఎప్పుడు రాదు కాబట్టి జీవితాంతం మాక్ పార్లమెంట్‌లో ప్రధానమంత్రిగా వ్యవహరించాలని అమిత్ షా వ్యంగ్యా్రస్తాలు విసిరారు.
కాంగ్రెస్‌కు విదేశాల నుంచి నిధులు
ర్యాలీని దీపావళి పండుగ తర్వాత నిర్వహించుకోవాలని ఢిల్లీ వ్యాపారులు కోరితే ‘ఇండియా’కూటమి నాయకులు పట్టించుకోలేదని అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని వాపోయారు. సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగిన రోజునే ర్యాలీ నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు తన మాట గుర్తుంచుకోవాలని, రాబోయే మూడు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని తేల్చిచెప్పారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ భారీ సభ నిర్వహించడం 1984 నాటి అల్లర్ల బాధితుల, వారి కుటుంబాల గాయాలపై కారం చల్లినట్లుగా ఉందని మండిపడ్డారు. వేలాది మంది సిక్కులను సజీవ దహనం చేసిన రోజున ఢిల్లీలో సభ నిర్వహించాల్సిందిగా విదేశాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు అందాయని ఆమిత్ షా ఆరోపించారు. ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను సజావుగా సాగనివ్వడం లేదని తప్పుపట్టారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించడం రాహుల్ గాం«దీకి ఇష్టం లేదన్నారు. దేశంలో ‘నారీ శక్తి’కి 33 శాతం రిజర్వేషన్లను నరేంద్ర మోదీ కచ్చితంగా కల్పిస్తారని, ఇది తమ సంకల్పం అని ఉద్ఘాటించారు.


