కాంగ్రెస్, కాక్రోచ్‌కు చెక్‌! | Amit Shah to Visit Telangana on November 2 | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, కాక్రోచ్‌కు చెక్‌!

Nov 2 2026 4:45 AM | Updated on Nov 2 2026 4:45 AM

Amit Shah to Visit Telangana on November 2

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాదయాత్ర రూట్‌ను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు తదితరులు

నేడు హైదరాబాద్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాదయాత్ర 

బషీర్‌బాగ్‌ నుంచి మొజాంజాహీ మార్కెట్‌ వరకు నిర్వహణ 

భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని సందర్శించనున్న బీజేపీ అగ్రనేత 

రూట్‌మ్యాప్‌ పరిశీలించిన కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ‘లోక్‌ తంత్ర బచావో–అరాచకత హటావో’కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గొననున్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై ఇండియా కూటమి, కాక్రోచ్‌ జనతా పార్టీ చేస్తున్న విమర్శలను, ఆరోపణలను తిప్పికొట్టడంలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో పాదయాత్ర చేపట్టనున్నారు. తొలుత బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత మొజాంజాహీ మార్కెట్‌ వరకు 2 కి.మీ మేర ఇది కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

సర్‌ విషయంలో కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని బీజేపీ నాయకత్వం విమర్శిస్తోంది. ఈ ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, తమ వాదనను బలంగా వినిపించేందుకు ఈ పాదయాత్రను వేదికగా చేసుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్‌ ఢిల్లీలో చేపడుతున్న నిరసనలకు కౌంటర్‌ను హైదరాబాద్‌ కేంద్రంగా ఇవ్వాలని కమలదళం భావిస్తోంది. పాదయాత్రను విజయవంతం చేయడంపై రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. దాదాపు లక్ష మంది పాల్గొనేలా చేయాలని సన్నాహక సమావేశాల్లో నిర్ణయించింది.  

రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు! 
కాంగ్రెస్, కాక్రోచ్‌ పార్టీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ యాత్రలను చేపట్టాలని కాషాయ పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లోనూ ర్యాలీలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదనంగా నిర్మల్‌లోనూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించే అవకాశాలున్నాయి. ఇదిలాఉండగా ఈ నెల 5వ తేదీన కరీంనగర్‌లో చేపట్టే పాదయాత్రకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ సిన్హా 
రానున్నారు. 

షా షెడ్యూల్‌లో మార్పులు 
అమిత్‌ షా రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. తొలుత అనుకున్నదానికంటే ఒకగంట ముందుగానే ఆయన హైదరాబాద్‌ చేరుకోనున్నారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 1:25 గంటలకు చారి్మనార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనానికి వెళ్తారు. అక్కడ పూజలు చేసిన తర్వాత 2 గంటలకు ఐటీసీ కాకతీయ హోటల్‌కు బయలుదేరుతారు. సాయంత్రం 4 గంటలకు హోటల్‌ నుంచి బయలుదేరి నిజాం కాలేజీ సమీపంలోని బాబూ జగ్జీవన్‌ రామ్‌ విగ్రహం వద్దకు చేరుకుంటారు. 

అక్కడ నుంచి యాత్ర ప్రారంభం కానుండగా.. సుమారు గంటపాటు అంటే సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు యాత్ర కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 5:15 నుంచి 5.45 గంటల వరకు ఎంజే మార్కెట్‌ వద్ద నిర్వహించే బహిరంగ సభలో అమిత్‌షా ప్రసంగిస్తారు. 6 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఇదిలా ఉండగా రిజర్వ్‌ సమయంలో రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నేతలతో కేంద్ర హోంమంత్రి సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షా పర్యటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.   

విజయవంతం చేయాలి: కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు 
గన్‌¸ûండ్రీ: ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరావుతో కలిసి అమిత్‌షా పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం బషీర్‌బాగ్‌ చౌరస్తా నుంచి అబిడ్స్, ఎంజే మార్కెట్‌ వరకు రహదారిని పరిశీలించి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. 

కొందరు నేతలు పార్టీని అమ్ముతున్నారు: రాజాసింగ్‌ 
అమిత్‌ షా పర్యటన నేపథ్యంలో బీజేపీకి గుడ్‌బై చెప్పిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలనేది కేంద్రం, అలాగే బీజేపీ కార్యకర్తల కల అని పేర్కొన్నారు. అయితే దురదృష్టం ఏంటంటే.. తెలంగాణకు చెందిన కొందరు నాయకులు పార్టీని అమ్ముతున్నారని ఆరోపించారు. పార్టీని ముంచుతున్నారని, అలాంటి వారిని గుర్తించి పక్కకు జరపాలని సూచించారు. పార్టీ బలోపేతానికి నాయకత్వ ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement