తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈరోజు(ఆదివారం, నవంబర్ 1వ తేదీ) పులివెందులలో జరిగిన పోలింగ్ తీరుపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. నూటికి నూరు శాతం ఇవి ఎన్నికలు కావని మండిపడ్డారు. పోలీసులు, ఎన్నికల అధికారుల సమక్షంలోనే దాడులు జరిగితే.. వీటిని ఏమంటారని ప్రశ్నించారు సజ్జల. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న తీరు.. ఇప్పుడు పోలింగ్ రోజున ఓటు వేయకుండా అడ్డుకున్న కోణాన్ని పరిశీలిస్తే దీనిని అరాచకం కాక ఇంకేమంటారని నిలదీశారు.
తాడేపల్లి నుంచి మాట్లాడిన సజ్జల.. ‘అన్ని చోట్లా టీడీపీ గూండాల రిగ్గింగ్ చేశారు.. దానికి పోలీసులు సహకరించారు. పోలింగ్ కేంద్రాలను క్యాప్చర్ చేసి పచ్చమూకల రిగ్గింగ్ చేశారు. దుర్మార్గాలను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, నేతలపై దాడులు చేశారు. అధికారంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నిస్సహాయ స్థితిలో నెట్టేశారు. చివరికి గంజాయి కేసులు కూడా పెట్టారు. పూర్తి ఆధారాలు ఉన్నా, స్క్రూటినీలో అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. ఇలాంటి ఎన్నికలు జరగడం చరిత్రలో ఇదే మొదటిసారి.
చంద్రబాబు పోలీసులతో బలప్రయోగం చేశారు..
పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను కూర్చోనివ్వకుండా చేశారు. పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. చంద్రబాబు పెద్ద నాటకానికి తెరలేపారు. ప్రజల తీర్పును ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు లేదు. చంద్రబాబు పోలీసులతో బలప్రయోగం చేశారు. పోలీసుల అండతో దొంగ ఓట్లు వేయించారు. ఎన్నికలు ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు కుట్రలు అమలు చేశారు. టీడీపీ నేతలు, పోలీసులు, ఎస్‌ఈసీ కలిసి కుట్రను రక్తికట్టించాయి.
ఓటమి భయంతోనే చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చారు. పులివెందులకు బయట నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చారు. అసలైన పులివెందుల ప్రజలను ఓటేసేందుకు అనుమతివ్వలేదు. గెలిచామని చెప్పుకునేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు. రేపు కౌంటింగ్‌లో కూడా ఇలానే వ్యవహరించినా ఆశ్చర్యం లేదు. సీసీ ఫుటేజ్‌ను ఎస్‌ఈసీ తెప్పించి ఎందుకు పరిశీలించడం లేదు’ అని ప్రశ్నించారు.
టీడీపీ దౌర్జన్యాలను జాతీయ స్థాయికి తీసుకెళ్తాం..
టీడీపీ దౌర్జన్యాలను జాతీయ స్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించారు. టీడీపీ నేతలను నడిరోడ్డ మీద నిలబెడతామన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ వాళ్లు, పోలీసులు దాడులు చేశారు. దాడులు చేసిన వారి పేర్లతో ఆధారాలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. అంతా బాగుందనే యత్నం చేస్తున్నారు. టీడీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఎన్నికల చరిత్రలో చీకటిరోజు


