సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆఫీసు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాలకు వ్యతిరేకంగా ఎస్‌ఈసీకి వ్యతిరేకంగా ఎమ్మెల‍్సీ లేళ్ల అప్పిరెడ్డి సహా ఇతర వైఎస్సార్‌సీపీ నేతలు నినాదాలు చేశారు. విజయవాడలో ఎస్‌ఈసీ ఆఫీసు దగ్గర వారు ఆందోళన నిర్వహిస్తున్నారు. కార్యాలయం గేటు వద్ద బైఠాయించారు.
మరోవైపు, విజయవాడ 70వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌పై టీడీపీ శ్రేణుల దాడి చేశారు. ఎలక్షన్ ఏజెంట్ విజయ్ యాదవ్ మెడలో ఉన్న ఐడీని లాగి పడేశారు. కాగా, జమ్మలమడుగులో రిగ్గింగ్ అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు, డోన్‌లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ధర్నాకు దిగారు. పోలింగ్ జరుగుతున్న తీరుపై ఆయన విమర్శలు గుప‍్పించారు.
కడప కార్పొరేషన్‌లో రీపోలింగ్: వైఎస్సార్‌సీపీ డిమాండ్
కడప కార్పొరేషన్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగలేదని, 361 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను రద్దుచేసి రీ పోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి తదితరులు ఆదివారం వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌ను కలిశారు. తమ పార్టీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించకుండా ఎన్నికలను నిర్వహించటం దుర్మార్గమని పేర్కొన్నారు. వెంటనే కేంద్ర బలగాల సహాయంతో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అప్పటి వరకు నేను ఓటు వేయను.. వైఎస్ జగన్


