- పులివెందులలో పచ్చమూకల మాస్ రిగ్గింగ్.. ఖాకీల ప్రేక్షక పాత్ర
- Z+ సెక్యూరిటీని ఛేదించి మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్‌పైకి దూసుకొచ్చిన వివేకా హంతకుడు దస్తగిరి కారు
- 14 మంది ఓటర్లుంటే 681 ఓట్లా? పీక్ స్టేజ్‌కు చేరిన రిగ్గింగ్ బాగోతం.. తలకిందులైన ఎన్నికల సంఘం అధికారిక లెక్కలు
- గాల్లో ఇంధనం అయిపోతున్నా జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు కలెక్టర్ బ్రేకులు.. తప్పనిసరి పరిస్థితుల్లో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
- 80 బూత్‌లలో 70 చోట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల బహిష్కరణ.. ఆర్వో ఆఫీస్ ముందు 70 మంది ఏజెంట్లతో రోడ్డుపై బైఠాయించిన వైఎస్ జగన్
- చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై భౌతిక దాడి.. వాహనం ధ్వంసం!
- అడ్డుకున్నందుకు వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి జింక వెంకటచలపతిపై పోలీసుల దారుణ లాఠీచార్జ్
(పులివెందుల రౌండప్..)
సామాన్య మహిళా ఓటర్లను లాగిపడేసిన పోలీసులు.. భయభ్రాంతులకు గురిచేసేందుకు మహిళా కానిస్టేబుళ్లే కట్టెలు సరఫరా చేసిన వైనం.. ఓటు హక్కు కోసం రోడ్డెక్కిన 400 మంది ఓటర్లు.. జూనియర్ కాలేజీ వద్ద భారీ బైఠాయింపు! ఇస్లాంపురంలో ఓటర్లపై రాళ్ల వర్షం. అరాచకాలను కవర్ చేస్తున్న జాతీయ, ప్రాంతీయ మీడియాపై దాడులు.. ఇండియా టుడే, ఇండియా టీవీ, ఎన్టీవీ కెమెరాలు పూర్తిగా ధ్వంసం.. స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున పులివెందుల నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అరాచకం జుగుప్సాకర స్థాయికి చేరింది.
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అల్లరిమూకలు ఉదయం 5:00 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలను తమ దురాక్రమణలోకి తీసుకోగా, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా కూటమి శ్రేణులకు వంత పాడుతూ ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై ఖూనీ చేసింది. "ఇది అసలు ఎన్నికలేనా? బిహార్‌ను మించిన అరాచక పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. తక్షణమే ఈ మున్సిపల్ ఎన్నికలను రద్దు చేసి రీ-పోలింగ్ జరపాలి" అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.

Z+ సెక్యూరిటీ వలయంలోకి దస్తగిరి.. ఖాకీల పర్యవేక్షణలోనే స్కెచ్!
పులివెందులలో ఎన్నికల ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ తీవ్ర భద్రతా ఉల్లంఘన వెలుగుచూసింది. బెంగళూరు నుంచి పులివెందుల చేరుకుని కాన్వాయ్‌లో వెళ్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రతా వలయాన్ని దాటుకుని, వివేకా హత్య కేసు నిందితుడు/అప్రూవర్ దస్తగిరి తన కారుతో ఒక్కసారిగా కాన్వాయ్ ముందుకు దూసుకువచ్చాడు. అత్యంత కఠినమైన Z+ కేటగిరీ రక్షణలో ఉన్న వీఐపీ వాహనాల శ్రేణిలోకి ఒక మర్డర్ కేస్ ముద్దాయి కారు ఎలా ప్రవేశించిందో పోలీసులకే సమాధానం లేదు. స్వయంగా పోలీసుల ప్రొటెక్షన్ మధ్యే దస్తగిరితో టీడీపీ ఈ హైడ్రామాకు తెరలేపిందని, కావాలనే కాన్వాయ్‌లోకి అనుమతించి ఆ తర్వాత పక్కకు తప్పించినట్లు డ్రామాలు ఆడారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.
అధికారిక లెక్కల తిరకాసు బట్టబయలు.. 14 మందికి 681 ఓట్లు ఎలా?
పచ్చమూకలు యథేచ్ఛగా సాగించిన మాస్ రిగ్గింగ్ బాగోతం ఎన్నికల అధికారుల అధికారిక గణాంకాలతోనే అడ్డంగా దొరికిపోయింది. ఉదయం 11:00 గంటల సమయానికి పులివెందులలో 'ఇతరులు' కేటగిరీలో 1.25% పోలింగ్ జరిగిందని, అంటే 681 ఓట్లు పోలైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిక రికార్డుల ప్రకారం పులివెందుల మున్సిపాలిటీ మొత్తం మీద 'ఇతరుల' కేటగిరీ ఓటర్లు ఉన్నది కేవలం 14 మంది మాత్రమే! 14 మంది ఓటర్లు ఉన్న చోట 681 ఓట్లు ఎలా పోలవుతాయని సామాన్య ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఉదయం నుంచే బూత్‌లను ఆక్రమించి టీడీపీ శ్రేణులు ఎడాపెడా దొంగ ఓట్లు గుద్దడం వల్లే ఈ అంకెలు తారుమారయ్యాయని స్పష్టమవుతోంది. కేవలం 4 గంటల్లోనే పులివెందులలో 35.17% పోలింగ్ నమోదు కావడం ఈ మాస్ రిగ్గింగ్‌కు సజీవ సాక్ష్యం.

జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు కుట్ర..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ఆఖరి నిమిషం వరకు కుట్రలు పన్నింది. శనివారమే హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చిన పోలీసులు, నేడు హఠాత్తుగా మాట మార్చారు. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాతే ల్యాండింగ్‌కు అనుమతి ఉంటుందంటూ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆకస్మికంగా కొత్త ఆదేశాలు జారీ చేశారు. అప్పటికే బెంగళూరు నుంచి హెలికాప్టర్ గాల్లోకి లేవగా, వెనక్కి వెళ్ళిపోవాలని అధికారులు ఒత్తిడి తెచ్చారు. అయితే గాల్లో ఇంధనం కొరత ఏర్పడటంతో పైలట్ తీవ్ర ఉత్కంఠ మధ్య పులివెందులలోనే హెలికాప్టర్‌ను ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఒక మాజీ సీఎం ప్రాణాలతో ప్రభుత్వం ఇంత దారుణంగా చెలగాటమాడటంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి.

ఆర్వో ఆఫీస్ తాళాలు.. 70 మంది ఏజెంట్లతో జగన్ భీష్మ నిరసన!
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 80 పోలింగ్ బూత్‌లలో దాదాపు 70 బూత్‌ల నుంచి వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను పోలీసులు, టీడీపీ గుండాలు కలిసి మెడపట్టి బయటకు తోసేశారు. దీంతో వైఎస్ జగన్ స్వయంగా ఆ 70 మంది బహిష్కృత ఏజెంట్లను వెంటబెట్టుకుని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అభ్యర్థులు వస్తున్నారని తెలిసి భయంతో అధికారులు ఆర్వో ఆఫీస్ ప్రధాన గేట్లకు తాళాలు వేశారు. లోపలికి వెళ్లకుండా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు దారుణంగా అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. అనంతరం వైఎస్ జగన్ ఏజెంట్లతో కలిసి ఆర్వో ఆఫీస్ ఎదుట రోడ్డుపైనే బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు. ఆర్వో శ్రీనివాస్, ఆర్డీవో చిన్నయ్యలను నిలదీస్తూ.. "ఓడిపోతామనే భయం ఉన్నప్పుడు ఈ దొంగ ఎన్నికలు ఎందుకు? మాజీ సీఎం నియోజకవర్గంలోనే ఏజెంట్లు లేకుండా ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకుంటారా? లాఠీచార్జ్ చేస్తారా చేయనీయండి.. అదొక్కటే మిగిలింది" అంటూ జగన్ గర్జించారు.

అభ్యర్థులపై దాడులు.. ప్రశ్నిస్తే లాఠీచార్జ్!
పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ బూత్ నంబర్ 21 వద్దకు వెళ్లగా, ఆమెపై టీడీపీ రౌడీలు భౌతిక దాడికి తెగబడటమే కాకుండా, ఆమె ప్రయాణిస్తున్న అధికారిక వాహనాన్ని కర్రలతో కొట్టి పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే 16వ పోలింగ్ బూత్‌లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను రాకుండా అడ్డుకుని, టీడీపీ ఏజెంట్లతో ఏకపక్షంగా మాక్ పోలింగ్ నిర్వహించడాన్ని ప్రశ్నించిన వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జింక వెంకటచలపతిపై ఎస్ఐ శివకుమార్, సీఐలు లాఠీలతో దారుణంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన చైర్మన్ అభ్యర్థి రక్తం ఓడుతున్నా బూత్ ముందే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
మహిళల లాగివేత - ఓటరు దేవుళ్ల తిరుగుబాటు!
చైనారెడ్డి కాలనీ, ఇస్లాంపురం, పెద్ద రంగాపురం, ఐదో వార్డు పోలింగ్ బూత్‌ల వద్ద దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరాయి. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వృద్ధులను, మహిళలను పోలీసులు లోపలికి వెళ్లనివ్వకుండా క్యూలైన్ల నుండి బలవంతంగా చేతులతో వెనక్కి తోసివేయడమే కాకుండా, దారుణంగా లాగి అవతలకు పడేశారు. "మర్యాదగా ఇక్కడి నుండి వెళ్లిపోండి.. మీకు ఓటు వేసే హక్కే లేదు.. మీ ఓట్లు మేము ముందే వేసేసుకున్నాం" అంటూ డీఎస్పీ మురళీ నాయక్ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు.
ఈ అరాచకాలపై సాక్షి ప్రతినిధి ఇస్మాయిల్, మహిళా ఓటర్లు ఒక్కసారిగా డీఎస్పీని నిలదీయడంతో ఆయన సమాధానం చెప్పలేక పరారయ్యారు. అక్కడ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లే స్వయంగా కట్టెలను సమకూర్చుకుని ఓటర్లను బెదిరిస్తున్నారని మహిళలు ఆధారాలు బయటపెట్టారు. 27వ వార్డులో ఒక వృద్ధురాలి బ్యాలెట్ పేపర్లను లాక్కుని టీడీపీ ఏజెంటే స్వయంగా ఓటు వేసేశాడు. ఈ అన్యాయాలపై పులివెందుల బాయ్స్ జూనియర్ కాలేజీ వద్ద సుమారు 400 మందికి పైగా సామాన్య ఓటర్లు రోడ్డుపైనే బైఠాయించి తీవ్ర నిరసనకు దిగారు.

మీడియా గొంతు నొక్కిన పచ్చమూకలు!
పులివెందులలో జరుగుతున్న ఈ మాస్ రిగ్గింగ్, దొంగ ఓట్ల బాగోతాన్ని ప్రపంచానికి చూపిస్తున్న మీడియా ప్రతినిధులపై పచ్చ రౌడీలు రాక్షసానందం ప్రదర్శించారు. జాతీయ మీడియా సంస్థ 'ఇండియా టుడే' రిపోర్టర్ బషీర్, విజయ్‌లపై భౌతిక దాడి చేసి వారి వద్ద ఉన్న వీడియో ఫుటేజ్‌ను డిలీట్ చేశారు. అలాగే 'ఇండియా టీవీ' కెమెరాను, ప్రాంతీయ ఛానల్ ఎన్టీవీ' రిపోర్టర్ ప్రొఫెషనల్ కెమెరాను మరియు సెల్ ఫోన్లను పూర్తిగా పగలగొట్టి ధ్వంసం చేశారు. ఇస్లాంపురంలో సాక్ష్యాలు బయటకు రాకుండా పోలీసులే దగ్గరుండి మొబైల్స్ లోని వీడియోలను డిలీట్ చేయించడం గమనార్హం.
మొత్తంగా, పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. అధికార పార్టీ నేతల అరాచకాలకు, ఖాకీల జులంకు వ్యతిరేకంగా అటు సామాన్య ఓటర్లు, ఇటు వైఎస్సార్‌సీపీ శ్రేణులు... రణరంగాన్ని తలపిస్తున్న వీధుల్లో న్యాయం కోసం పోరాడుతున్నాయి.
ఇదీ చదవండి: నేను ఓటు వేయను : వైఎస్ జగన్


