దివినుంచి భువికి దిగివస్తున్న పితృదేవతలు | Sakshi Special Story On Wedding Invite Program | Sakshi
Sakshi News home page

దివినుంచి భువికి దిగివస్తున్న పితృదేవతలు

Nov 1 2026 10:09 AM | Updated on Nov 1 2026 10:13 AM

Sakshi Special Story On Wedding Invite Program

ఏ శుభకార్యంలోనైనా జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, తోబుట్టువులు, ఇతర బంధుమిత్రులంతా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే అందులో ఎవరైనా భౌతికంగా లేకపోతే ఆ వెలితి పూడ్చలేనిది. వేడుకలో వారు ఉండుంటే బాగుండేదని, ఎంతో సంతోషించేవారని గుర్తు చేసుకుంటుంటారు. ఆధునిక టెక్నాలజీ ఆ లోటును కొంత తీరుస్తోంది. చనిపోయినవారు దివినుంచి భువికి దిగివచ్చి వధూవరులను ఆశీర్వదిస్తున్నట్లుగా ఏఐ సాయంతో వీడియోలు రూపొందించి స్క్రీన్లపై ప్రదర్శిస్తున్నారు. మృత్యువు దూరం చేసిన ఆత్మీయులు తిరిగివచ్చి దీవిస్తున్నట్లుగా ఉంటున్న ఆ చిత్రాలు కుటుంబ సభ్యులనేకాదు ఆహూతులనూ భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. శుభకార్యాల్లో కొత్త ట్రెండ్‌పై సండే స్పెషల్‌..

పెళ్లి మండపంలో మంగళవాయిద్యాలు మో గుతున్నాయి. బంధువులు, స్నేహితుల రాకతో ఆవరణంతా సందడిగా మారింది. కూతురు పెళ్లి అవుతోందన్న సంతోషం ఓవైపు.. చనిపోయిన తన తండ్రి ఉండి ఉంటే ఎంత సంతోషించే వాడోనన్న అంశం మరోవైపు.. ఆ తండ్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాళి కట్టడం పూర్తయిన మరుక్షణమే అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్‌ మీద ఓ వీడియో ప్రదర్శన మొదలైంది. పెళ్లి కూతురు తండ్రి ఆ వీడియో చూస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. దివికేగిన తన తండ్రి నడుచుకుంటూ వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తున్నట్లున్న ఆ వీడియోతో ఆనందబాష్పాలు ధారగా కారసాగాయి. ఆ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులతోపాటు ఆయనతో అనుబంధం ఉన్నవారు సైతం భావోద్వేగానికి గురయ్యారు.  

తన కొడుకు నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాడో యువకుడు. అయితే అప్పటికే తండ్రిని కోల్పోయిన ఆ యువకుడు.. తొట్లె ఫంక్షన్‌కు తన తండ్రి వచ్చి ఆశీర్వదిస్తున్నట్లుగా వీడియో తయారు చేయాలని ఓ వీడియోగ్రాఫర్‌ను కోరుతూ తన పెళ్లినాటి వీడియోలు, ఫొటోలు అందించాడు. వాటితో వీడియో రూపొందించిన వీడియోగ్రాఫర్‌.. తొట్లె పండుగ రోజున బంధుమిత్రుల సమక్షంలో ప్రదర్శించాడు. దివికేగిన పెద్దాయన వచ్చి మనవడిని ఎత్తుకుని నామకరణం చేస్తున్నట్టుగా రూపొందించిన వీడియోను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తన పేరునే మనవడికి పెడుతున్నట్టు ఆయన గొంతుతో చెప్పడంతో అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. కొందరు కంటతడి పెట్టారు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. దివికేగిన తమ వారిని స్మరించుకోవడం సహజం. ముందుగా వారి ఫొటోలకు దండ వేసి దండం పెడుతుంటాం. వారి ఆశీర్వాదం ఉండాలని మొక్కుకుంటాం. అయితే ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీ పుణ్యమా అని ఆ పాత జ్ఞాపకాలు కేవలం మౌనచిత్రాలుగా మిగిలిపోవడం లేదు. చనిపోయిన తండ్రి/తల్లి, తాత/నాయినమ్మ/అమ్మమ్మల పాత ఫొటోలు, వారి స్వరాన్ని ఆధారంగా చేసుకుని, వారు బతికే ఉన్నట్లుగా, పెళ్లి పీటల మీద కూర్చున్న మనవడు/మనవరాలిని చూసి మురిసిపోతున్నట్లుగా అద్భుతమైన వీడియోలు తయారు చేస్తున్నారు. జంటపై అక్షింతలు చుల్లుతూ ఆశీర్వదిస్తున్నట్టుగా రూపొందిస్తున్నారు. 

అలాగే పిల్లల నామకరణం సందర్భంలో మనవడిని ఎత్తుకుని నామకరణం చేస్తున్న తాత/నాయినమ్మలు, బర్త్‌డే పార్టీల్లో కేక్‌ తినిపిస్తున్నట్టుగా.. ఇలా ఆయా శుభకార్యాలకు అనుగుణంగా వీడియోలు చేయించుకుంటున్నారు. వాటిని ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ప్రదర్శిస్తున్న క్షణంలో అందరూ భావోద్వేగానికి గురవుతున్నారు. కొన్నిచోట్ల వీడియోల్లో వారు తమతో మాట్లాడుతున్నట్టుగానే ‘బాగున్నవా బిడ్డా’ అనడం, ‘అందరూ సంతోషంగా ఉండుండ్రి’ అంటూ తిరిగి వెళ్లిపోతున్న దృశ్యాలు చూసి కంటతడిపెడుతున్నవారూ ఉన్నారు. కొందరు ఫంక్షన్‌ హాల్‌ వద్ద స్వాగతం పలుకుతున్నట్టుగా ఉండే ఫ్లెక్సీల్లో పోయినవాళ్లు కలిసి ఉన్నట్టుగా వారి ఫొటోలను జత చేస్తున్నారు.  

ఏఐ సాయంతో..
చనిపోయిన కుటుంబ సభ్యుల ఫొటోలు ఉంటే చా లు ఏఐ సాయంతో వారి ముఖ కవళికలు, వారి వేషధారణ మారిపోకుండా అద్భుతమైన వీడియో లు రూపొందిస్తున్నారు. గతంలో వీడియోలు త యారు చేయడానికి భారీగా ఖర్చయ్యేది. ఏఐ యా ప్స్‌ అందుబాటులోకి రావడంతో అలాంటి వీడియోలను తయారు చేయడం సులువుగా మారింది. వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, స్మార్ట్‌ ఫోన్లపై ఎక్కువగా అవగాహన ఉన్న యువత ఏఐ ద్వారా సొంతంగానే వీడియోలు తయారు చేసుకుంటున్నారు. చిన్నచిన్న వీడియోలు తయారు చేస్తూ సోషల్‌ మీడియాలో షేరు చేస్తున్నారు. 

చనిపోయినవారు బతికే ఉన్నట్లుగా.. 
చనిపోయిన తమ పెద్దలు శుభకార్యంలో పాల్గొన్నట్లుగా వీడియోలు చేసి ఇవ్వాలని చాలామంది అడుగుతున్నారు. పెళ్లి, రిసెప్షన్‌లలో వాటిని స్క్రీన్‌లపై ప్రదర్శిస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురవుతున్నారు. గ్రూప్‌ ఫొటోలలో చనిపోయిన వారు బతికే ఉన్న అనుభూతి కలిగించేలా ఫొటోలు తయారు చేçస్తున్నాం.  
– నవీన్‌కుమార్, సీనియర్‌ ఫొటోగ్రాఫర్, కామారెడ్డి  

భావోద్వేగానికి లోనవుతున్నారు 
చనిపోయిన కుటుంబ సభ్యులు బతికే ఉండి, తమతోనే ఉన్నట్టుగా పలువురు వీడియోలు చేయించుకుంటున్నారు. ప్రధానంగా శుభకార్యాల సమయంలో తయారు చేసి ఇవ్వాలని కోరుతున్నారు. ఆ వీడియోలు చూస్తూ, నిజంగానే బతికి ఉన్నట్లుగా ఫీలవుతున్నారు. దీనిని నేను ప్రత్యక్షంగా గమనించాను.  
–నవీన్, ఫొటోగ్రాఫర్, చుక్కాపూర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement