● ప్రజోపయోగ పనులను పూర్తి చేయాలి
● దిశ సమావేశంలో ఎంపీ
ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ అర్బన్: అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వాడుకునేలా ప్రజలు, రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అధికారులకు సూచించా రు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీటి పొదుపును పాటించాలని పేర్కొన్నారు. ఎంపీ అర్వింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆయా శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమావేశంలో చర్చించారు. అంతకుముందు గత సమావేశంలో చేసిన తీర్మానాలు, చేపట్టిన చర్యలను అధికారులు ఎంపీ దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. మాధవనగర్, అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనుల్లో తాత్సారంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయించాలని, రానున్న నాలుగైదు నెలల్లో అందుబాటులోకి తేవా లని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరంలో భూగర్భ డ్రెయినేజీ పనులను వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు. కేంద్రం నుంచి కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగిస్తూ.. నిర్దేశిత గడువులోగా ప్రజోపయోగ పనులు పూర్తయ్యేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల నిధులను విద్యార్థులకు అందించారా అని ఎంపీ సంబంధిత అధికారులను ప్రశ్నించగా.. ఇప్పటికే విద్యార్థుల బ్యాంకు ఖాతాలలో నేరుగా ఉపకార వేతనాలను జమ చేయించామని సంక్షేమ శాఖల అధికారులు తెలిపారు. డిసెంబర్‌లో నిర్వహించనున్న ఖేలో ఇండియా జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలకు జిల్లా యంత్రాంగం చొరవతో ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాను వేదికగా ఎంపిక చేయడంపై ఎంపీ అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, మేయర్ ఉమారాణి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, అడిషనల్ కలెక్టర్లు రాజాగౌడ్, భు జంగరావు, డీఆర్‌వో గీత, డీఆర్డీవో సాయన్న, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఆయా శాఖల అధికారులు, దిశ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సమావేశానికి హాజరైన ఆయా శాఖల అధికారులు
మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్.. పక్కన ఎమ్మెల్యేలు ధన్‌పాల్, రాకేశ్‌రెడ్డి


