● 24 మండలాలకు సరఫరా
● తెలుగు, ఉర్దూ మీడియం
విద్యార్థులకు పంపిణీ
ఖలీల్‌వాడి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పార్ట్–2 పాఠ్య పుస్తకాలు అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని గోదాములకు పుస్తకాలు చేరగా.. వాటిని 24 మండలాల్లోని ఎమ్మార్సీలకు విద్యా శాఖ సరఫరా చేసింది. మరికొన్ని పుస్తకాలను పాఠశాలలకు పూర్తిస్థాయిలో సరఫరా చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పార్ట్–1 పుస్తకాల్లో సెప్టెంబర్ వరకు సిలబస్ ఉంది. అక్టోబర్ నుంచి పార్ట్–2 సిలబస్ ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. పుస్తకాల సరఫరా నెల ఆలస్యమైంది. ప్రస్తుతం జిల్లాకు చేరుకున్న పుస్తకాలను తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులకు పంపిణీ చేసి పాఠ్యాంశాలను బోధించనున్నారు.
24 మండలాలకు పుస్తకాలు
జిల్లాలో మొత్తం 1,156 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో పార్ట్–1కు సంబంధించి జిల్లాకు 6,05,950 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు వీటిని సరఫరా చేశారు. తాజాగా తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం అన్ని ఆప్షనల్ సబ్జెక్టుల పార్ట్–2 పుస్తకాలు 2,30,800 గోదాములకు చేరాయి. జిల్లాలోని 24 మండలాలకు లక్షా 64 వేల 609 పుస్తకాలు సరఫరా చేశారు.
విద్యార్థులకు సులువుగా..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేయడంతో పాఠ్యపుస్తకాల్లో బైలింగ్వల్ ముద్రిస్తున్నారు. తెలుగు మీడియం విద్యార్థులకు ఓ వైపు తెలుగు, మరోవైపు అదే పాఠ్యాంశాన్ని ఆంగ్లంలో ముద్రించారు. ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉర్దూతోపాటు ఇంగ్లిష్ పాఠ్యాంశాలను ముద్రించారు. విద్యార్థులు పాఠ్యాంశాన్ని సులువుగా అర్ధం చేసుకునేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.


