వికారాబాద్: ఆ తల్లి మనసు పాషాణమైంది.. తాను లేకుంటే కన్న కొడుకులు నిరాదరణకు గురవుతారన్న వేదనతో ఉరి వేసి ఇద్దరినీ కడతేర్చింది. తర్వాత తానూ ఉరి వేసుకుని తనువు చాలించింది. ఈ హృదయ విదారక సంఘటన శనివారం మధ్యాహ్నం వికారాబాద్ జిల్లా ధారూరు మండలం చింతకుంటలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పట్లోళ్ల భూపతిరెడ్డి తొమ్మిదేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మడికట్టు గ్రామానికి చెందిన వాసవి (28)ని వివాహం చేసుకున్నాడు.
వీరికి సహర్షరెడ్డి (8), వేదార్షరెడ్డి (4) కుమారులు. భార్యాభర్తలు నాలుగేళ్లుగా వికారాబాద్‌లో ఉంటున్నారు. భర్త తాండూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా, భార్య వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల లో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నారు. శనివారం ఉదయం భార్యాభర్తలు పిల్లలతో కలిసి చింతకుంట గ్రామానికి వచ్చారు. భార్య, పిల్లలను ఇంట్లో వదిలిపెట్టిన భూపతిరెడ్డి తిరిగి వికారాబాద్ వెళ్లిపోయాడు. ఇంట్లో ఉన్న అత్తామామలు పొలం పనులకు వెళ్లారు.
పిల్లలతో ఒంటరిగా ఉన్న వాసవి తొలుత కుమారు లిద్దరినీ ఉరివేసి చంపింది. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘట న స్థలానికి చేరుకున్న ధారూరు సీఐ రఘురామ్, ఎస్‌ఐ సురేశ్ మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


