స్వామి ప్రసాద సరుకులు సిబ్బందికి నైవేద్యం | Theft of Temple Property | Sakshi
Sakshi News home page

స్వామి ప్రసాద సరుకులు సిబ్బందికి నైవేద్యం

Nov 1 2026 6:09 AM | Updated on Nov 1 2026 6:09 AM

Theft of Temple Property

దేవాలయాల్లో కొన్నిచోట్ల స్టోర్‌ ఇన్‌చార్జీలే దొంగలు 

ప్రసాద సరుకులు ఎత్తుకెళ్లి విక్రయం... తాజాగా  బాసరలో దొరికిన ఉద్యోగి 

ఇటీవలే వేములవాడ,  యాదగిరిగుట్ట,  కొండగట్టుల్లో ఉదంతాలు 

సస్పెన్షన్‌.. ఆ తర్వాత తిరిగి పోస్టింగ్‌తో సహకరిస్తున్న అధికారులు

కొండగట్టు అంజన్నకు నివేదించేందుకు తెప్పించిన ప్రసాద సరుకుల్లో కొంత నిల్వను ఓ ఉద్యోగి అక్రమంగా బయటకు తరలించి సొమ్ము చేసుకుంటూ దొరికాడు. అతడిని తాత్కాలికంగా సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారులు ఆ తర్వాత విధుల్లోకి తీసుకోవటమే కాకుండా, సస్పెన్షన్‌ కాలపు వేతనాన్ని కూడా చెల్లించారు.  

నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సరుకుల గోల్‌మాల్‌కు కారణమైన ఉద్యోగిని వేరే చోటకు బదిలీ చేసి, ఆ గొడవ సద్దుమణిగాక మళ్లీ అదే దేవాలయానికి బదిలీ చేశారు.  

సాక్షి, హైదరాబాద్‌: దేవుడి ప్రసాదాల సరుకులను స్వయంగా దేవాలయ అధికారుల్లో కొందరు స్వాహా చేస్తున్నారు. ప్రసాదాల తయారీకి ఉండే స్టోర్‌లకు ఇన్‌చార్జులుగా ఉంటున్నవారు దర్జాగా ఆ సరుకులను చోరీ చేస్తున్నారు. అక్రమంగా బయటకు తరలించేస్తున్నారు. జీడిపప్పు, కిస్మిస్, బాదంపప్పు, నూనె డబ్బాలు, బియ్యం బస్తాలు ఒకటేమిటి... ఉప్పు కారం సహా సర్వం స్వాహా చేస్తున్నారు. 

తాజాగా బాసర సరస్వతీ దేవాలయంలో ఓ ఉద్యోగి అటెండరు ద్వారా ఇలా చేతివాటం ప్రదర్శిస్తూ స్వయంగా ఆలయ కార్యనిర్వహణాధికారికి దొరికిపోయాడు. కొద్ది రోజుల క్రితం వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో ఓ ఉద్యోగి ఇలాగే సరుకులు తరలిస్తుండగా కొందరు దాన్ని వెలుగులోకి తెచ్చారు. అంతకుముందు కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో స్వాహాపర్వంలో ఉన్న ఉద్యోగిని సస్పెండ్‌ చేశారు. ఇలా వెలుగుచూస్తున్నవి కొన్నే, కానీ, చాలా దేవాలయాల్లో నైవేద్యం కాకుండానే ఉద్యోగులు సరుకులు ఆరగించేస్తున్నారు.  

ఆ సిఫారసు బుట్టదాఖలు... 
దేవాలయాల్లో పర్యవేక్షణ సరిగా లేకపోవటం, పలు దేవాలయాలకు ఈఓలను ఇన్‌చార్జులుగా నియమించటంతో వారు పూర్తి సమయం అందుబాటులో లేకపోవటంతో ఉద్యోగుల్లో ఎలాంటి జంకు లేకుండా పో యింది. దీంతో చాలా దేవాలయాల్లో స్టోర్‌ల కు ఇన్‌చార్జులుగా ఉన్నవారు సరుకులు తరలించేస్తున్నారు. ఇలాంటి వారిమీద కఠిన చర్యలు తీసుకుంటేనే మిగతా ఉద్యోగుల్లో భయం కలుగుతుందని ప్రభుత్వానికి సిఫారసులు అందాయి. వారిని విధుల నుంచి డిస్మిస్‌ చేయటంతోపాటు వారి ఇంక్రిమెంట్లను పూర్తిగా నిలిపివేయటం లాంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. కానీ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు దీన్ని అమలులోకి తీసుకురావటం లేదు.  

⇒ ఉన్నతాధికారులకు అడుగడుగునా రాజకీయ నాయకులు అడ్డుతగులుతున్నారు. దీనికి కొండగట్టు ఉదంతమే తాజా ఉదాహరణ. చోరీ చేస్తూ దొరికిపోయిన ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకునేలా స్థానిక రాజకీయ ప్రముఖులు గట్టిగా ఒత్తిడి తెచ్చారు.  
⇒ ఇప్పుడు బాసరలో దొరికిన ఉద్యోగిపై కూడా చర్యలు తీసుకోకుండా కొందరు నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు వినిపిస్తోంది. 
⇒ గతంలో యాదగిరిగుట్ట గోదాములోనే పెద్ద అవినీతి వ్యవహారం కొంతకాలంపాటు నిరాటంకంగా సాగింది. స్వామివారి ప్రసాదాల కోసం తెచ్చిన జీడిపప్పు ఇతర సరుకులతో కాజు పకోడి లాంటి పదార్థాలను తయారు చేసి మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇటీవల చింతపండు బస్తాలు తరలిస్తూ కొందరు ఉద్యోగులు దొరికిపోతే ఈ ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది.  

⇒ భద్రాచలంలో చక్కరపొంగలి ప్రసాదా న్ని అవసరానికి మించి ఎక్కువ తయారు చేయించి బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముకుంటున్న ఉదంతం కూడా వెలుగుచూసింది.  
⇒   వేములవాడలో ఓ ఉద్యోగి సరుకులు తరలిస్తూ కొంతమందికి చిక్కగా, దాన్ని తొక్కిపెట్టేందుకు ఉన్నతాధికారులే ప్రయత్నించటం విశేషం.  
⇒ హైదరాబాద్‌లోని ఓ ప్రధాన వెంకటేశ్వరస్వామి దేవాలయంలో స్టోర్‌ రూమ్‌ నుంచి ఓ ప్రైవేటు ఇంటికి తలుపు పెట్టించి మరీ స్టోర్‌ సరుకులను తరలించిన తీరు గతంలో సంచలనంగా మారింది. కానీ, దానిమీద ఎలాంటి చర్యలు లేకుండా ఉన్నతాధికారులే తొక్కేశారు.  

లెక్కల్లో తేడాలు చూపి... 
కొనుగోలు చేసిన సరుకులకు సంబంధించి లెక్కల్లో తేడాలు చూపి మరీ సిబ్బంది కొట్టేస్తున్నారు. లడ్డూ పరిమాణాన్ని తగ్గించి ఆ మిగులుబాటును తమ చోరీకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. చిన్న లడ్డూలకు పెద్ద లడ్డూ ఖర్చు చూపి ఆ సరుకులను పక్కదారి పట్టిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement