‘సైబర్‌’ సొమ్ముతో కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టులు..విల్లాలు | Fraud Against Ashrita Company: Telangana | Sakshi
Sakshi News home page

‘సైబర్‌’ సొమ్ముతో కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టులు..విల్లాలు

Nov 1 2026 4:48 AM | Updated on Nov 1 2026 4:48 AM

Fraud Against Ashrita Company: Telangana

స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ పేరుతో ‘ఆశ్రిత’ కంపెనీ మోసం 

ఎర్నాకుళంలో సైబర్‌ నేరం, హైదరాబాద్‌కు లింకులపై ఈడీ ఆరా 

కుత్బుల్లాపూర్, శంషాబాద్‌లో కొచ్చి ఈడీ అధికారుల సోదాలు

ఏయే ఖాతాల్లోకి మళ్లించారన్న అంశాలపై ఈడీ అధికారుల ఫోకస్‌

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరాల్లో కొట్టేసిన సొమ్ముతో కన్‌­స్ట్రక్షన్‌ ప్రాజెక్టులు..హైదరాబాద్‌లో విల్లాలు నిర్మిస్తున్న ఓ రి­య­ల్‌ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ గుట్టురట్టు చేశారు ఈడీ అధి­కా­రులు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామంటూ ఆశచూపి రూ.కోట్లు వసూలు చేసిన ఆరోపణలపై ఆశ్రిత మెగా సొల్యూషన్స్, ఆశ్రిత ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌­కు చెందిన అల్లంరాజు సత్యనారాయణమూర్తిపై ఎన్‌ఫోర్స్‌­మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కొచ్చి జోనల్‌ కార్యాలయం కేసు నమోదు చేసింది.

దర్యాప్తులో భాగంగా అక్టోబర్‌ 28న హైద­రా­బాద్‌లోని సత్యనారాయణమూర్తి ఇంటితో పాటు కుత్బుల్లా­పూర్, శంషాబాద్‌లోని శాతంరాయి సహా మూడు ప్రాంతాల­లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. డిజిటల్‌ ఆధా­రాలతో పాటు రూ.6.40 లక్షల నగదును స్వాధీనం చేసు­కు­న్నారు. రూ.14 లక్షలు నిల్వలు ఉన్న 11 బ్యాంకు ఖాతాలను ఈడీ ఫ్రీజ్‌ చేసింది. ప్లాట్లు, విల్లాలతో కలిపి సుమారు రూ.5 కోట్ల విలువైన స్థిరాస్తులను గుర్తించింది. 

ఈడీ కొచ్చి జోనల్‌ కార్యాలయం ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అందులో పేర్కొన్న ప్రకారం వివరాలు ఇలా.. కేరళ ఎర్నాకుళానికి చెందిన ఫార్మా కంపెనీ నిర్వాహకుడు నిమేష్‌ (49)కి 2023 మార్చి నెలలో టెలిగ్రామ్, సోషల్‌మీడియాలో స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌తో కూడిన సమా­చారం వచ్చింది. ఫోన్‌ కాల్స్, టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా చాట్‌ సందేశాలు పంపుతూ అధిక లాభాలు వస్తాయని నమ్మించా­రు. 

ఈ క్రమంలోనే www.capitalix.com వెబ్‌సైట్‌ ద్వారా ట్రేడింగ్‌ చేస్తే భారీ రాబడులు పొందవచ్చని ఆశ చూపారు. దీంతో నిమేష్‌ 2023 మే 23– 2025 ఆగస్ట్‌ 29 వరకు రూ.26.02 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాడు. ఇలా వసూలు చేసిన డబ్బుకు హామీ ఇచ్చిన ప్రకారం లాభాలు, అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు నిమేష్‌ గతేడాది సెప్టెంబర్‌లో ఎర్నాకుళం సైబర్‌ క్రైమ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎర్నాకుళం సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ కొచ్చి జోనల్‌ కార్యాలయం ఈసీఐఆర్‌ రిజిస్టర్‌ చేసి దర్యాప్తు ప్రారంభించింది. 

సొమ్ము మళ్లింపులపై ఆరా..
బాధితుడి నుంచి కొల్లగొట్టిన డబ్బు ఏయే ఖాతాల్లోకి మళ్లించారన్న అంశాలపై ఈడీ అధికారులు ఫోకస్‌ పెట్టారు. అల్లంరాజు సత్యనారాయణమూర్తి ఈ సొమ్మును తన కుటుంబ సభ్యులు, ఇతర ఉద్యోగుల పేరిట కంపెనీలు సృష్టించి వాటిని అందులోకి మళ్లించినట్టు గుర్తించారు. ఇలా ఆ సొమ్మును హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీటీఆర్‌ ఇండస్ట్రీస్, మెలుగు ట్రేడింగ్‌ కంపెనీ, ఆశ్రిత మెగా సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఆశ్రిత ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, ఆశ్రిత ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అకౌంట్ల పేరిట మనీలాండరింగ్‌ జరిగినట్లు గుర్తించింది.

సైబర్‌ నేరాలతో కొట్టేసిన సొమ్ముతో హైదరాబాద్‌లో ఆశ్రిత ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, ఆశ్రిత ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రై.లిమిటెడ్‌ పేరిట ఒక విల్లా ప్రాజెక్టును కూడా ప్రారంభించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. నేరపూరిత ఆదాయంతో పలు స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లు గుర్తించింది. 11 అకౌంట్లలోని రూ.14 లక్షలు ఫ్రీజ్‌ చేసింది. సైబర్‌ నేరాల ద్వారా వచ్చిన డబ్బును రియల్‌ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు గుర్తించింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement