విజిలెన్స్ నివేదిక ఆధారంగా సివిల్ సప్లయ్స్ కమిషనర్ చర్యలు
ప్రభుత్వ ధాన్యం అక్రమ మళ్లింపుపై రాష్ట్రవ్యాప్తంగా నిఘా
సాక్షి, హైదరాబాద్/సుభాష్‌నగర్ (నిజామాబాద్ అర్బన్): ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం అక్రమ మళ్లింపు, గ్రేడ్–ఏ సన్నధాన్యం నిర్వహణలో అవకతవకలు, బకాయిలున్న రైస్ మిల్లర్లపై పర్యవేక్షణ వైఫల్యానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల అధికారి (డీసీఎస్‌వో) శ్రీకాంత్‌రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. విజిలెన్స్ నివేదికలో వెల్లడైన అంశాల ఆధారంగా పౌరసరఫరాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎం.స్టీఫెన్ రవీంద్ర శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టడం, గ్రేడ్–ఏ సన్నధాన్యం నిర్వహణలో లోపాలు, బకాయిలున్న మిల్లర్లపై సరైన పర్యవేక్షణ లేకపోవడాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు శాఖ వెల్లడించింది. విధుల్లో భాగంగా నిర్వహించాల్సిన నెలవారీ క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టకపోవడం, పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగా అక్రమాలకు అవకాశం ఏర్పడినట్లు తేల్చారు. ఈ పరిణామాలు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లక్ష్యాలపై ప్రభావం చూపడంతోపాటు ప్రభుత్వానికి ఆర్థిక నష్టాన్ని కలిగించాయని తెలిపింది.
ప్రభుత్వానికి సన్నబియ్యంకు బదులు దొడ్డు బియ్యం సరఫరా చేసిన వ్యవహారంలో సీఐడీ పోలీసులు కొన్ని రోజులుగా జిల్లాలో విచారణ జరుపుతున్నారు. గత ఆదివారం నలుగురు రైస్‌మిల్ యజమానులను అరెస్టు చేయగా.. వారిని కస్టడీకి తీసుకొని రెండు రోజులుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో అనేక అక్రమాలు, లోపాలను గుర్తించిన సీఐడీ అధికారులు.. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్లు గుర్తించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో శనివారం సీఐడీ అధికారులు శ్రీకాంత్‌రెడ్డిని అరెస్టు చేశారు. కాగా, సీఐడీ అధికారుల విచారణ నేపథ్యంలో పలువురు రైస్‌మిల్లర్లు పరారీలో ఉండగా, మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్‌రెడ్డితోపాటు బోధన్‌కు చెందిన రైస్‌మిల్ యజమాని కిశోర్‌ను కూడా అరెస్టు చేశారు. శ్రీకాంత్‌రెడ్డి గతంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఓఎస్‌డీగా పనిచేశారు.


