breaking news
DCSO
-
నిజామాబాద్ డీసీఎస్వో శ్రీకాంత్‌రెడ్డి సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్/సుభాష్‌నగర్ (నిజామాబాద్ అర్బన్): ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం అక్రమ మళ్లింపు, గ్రేడ్–ఏ సన్నధాన్యం నిర్వహణలో అవకతవకలు, బకాయిలున్న రైస్ మిల్లర్లపై పర్యవేక్షణ వైఫల్యానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల అధికారి (డీసీఎస్వో) శ్రీకాంత్‌రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. విజిలెన్స్ నివేదికలో వెల్లడైన అంశాల ఆధారంగా పౌరసరఫరాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎం.స్టీఫెన్ రవీంద్ర శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టడం, గ్రేడ్–ఏ సన్నధాన్యం నిర్వహణలో లోపాలు, బకాయిలున్న మిల్లర్లపై సరైన పర్యవేక్షణ లేకపోవడాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు శాఖ వెల్లడించింది. విధుల్లో భాగంగా నిర్వహించాల్సిన నెలవారీ క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టకపోవడం, పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగా అక్రమాలకు అవకాశం ఏర్పడినట్లు తేల్చారు. ఈ పరిణామాలు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లక్ష్యాలపై ప్రభావం చూపడంతోపాటు ప్రభుత్వానికి ఆర్థిక నష్టాన్ని కలిగించాయని తెలిపింది. ప్రభుత్వానికి సన్నబియ్యంకు బదులు దొడ్డు బియ్యం సరఫరా చేసిన వ్యవహారంలో సీఐడీ పోలీసులు కొన్ని రోజులుగా జిల్లాలో విచారణ జరుపుతున్నారు. గత ఆదివారం నలుగురు రైస్‌మిల్ యజమానులను అరెస్టు చేయగా.. వారిని కస్టడీకి తీసుకొని రెండు రోజులుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో అనేక అక్రమాలు, లోపాలను గుర్తించిన సీఐడీ అధికారులు.. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం సీఐడీ అధికారులు శ్రీకాంత్‌రెడ్డిని అరెస్టు చేశారు. కాగా, సీఐడీ అధికారుల విచారణ నేపథ్యంలో పలువురు రైస్‌మిల్లర్లు పరారీలో ఉండగా, మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్‌రెడ్డితోపాటు బోధన్‌కు చెందిన రైస్‌మిల్ యజమాని కిశోర్‌ను కూడా అరెస్టు చేశారు. శ్రీకాంత్‌రెడ్డి గతంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఓఎస్డీగా పనిచేశారు. -
పౌరసరఫరాల శాఖ అధికారులకు పోస్టింగులు
సాక్షి, హైదరాబాద్: జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల (డీసీఎస్వో)కు పోస్టింగులు ఖరారయ్యాయి. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ శని, ఆదివారాల్లో ఆ శాఖలోని అధికారులు, ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు ఖరారు చేశారు. మంగళవారం నుంచి కొత్త జిల్లాలు ఉనికిలోకి రానున్న నేపథ్యంలో 31 జిల్లాలకు అధికారుల పేర్లను ఖరారు చేశారు. ఖరారైన వారిలో ఎం.కె.రాథోడ్ (హైదరాబాద్), బి.ఎన్.వి.వి.కృష్ణప్రసాద్(నిజామాబాద్), ఎస్.ఉదయ్‌కుమార్(నల్లగొండ), ఎం.గౌరీశంకర్(రంగారెడ్డి/శంషాబాద్), డి.అనురాధ (సూర్యాపేట), పి.బి.సంధ్యారాణి (ఖమ్మం), ఎ.ఉషారాణి (కరీంనగర్), వి.నాగేశ్వర్రావు(మేడ్చల్), ఎస్.అమృతారెడ్డి (కొత్తగూడెం), పి.రాజారావు(జయశంకర్/భూపాలపల్లి), ఎ.వి.ఎస్.వి.ప్రసాద్‌రావు (సంగారెడ్డి), పి.సత్యనారాయణ(జగిత్యాల), వి.వెంకటేశ్వర్లు(సిద్దిపేట), ఐ.శారదాప్రియదర్శిని (మహబూబ్‌నగర్), ఎన్.విజయలక్ష్మి(వరంగల్ అర్బన్), ఎ.రమేశ్(కామారెడ్డి), జి.రేవతి (మెదక్), కె.అబీబ్ ఉర్ రహమాన్(పెద్దపల్లి), ఎ.లక్ష్మణ్ (మహబూబాబాద్), సి.హెచ్.తనూజ(వనపర్తి), సి.పద్మజ(వికారాబాద్), పి.సంధ్యారాణి (యాదాద్రి), జె.యుగంధర్ (మంచిర్యాల), వి.మోహన్‌బాబు (నాగర్‌కర్నూలు), ఎస్.విలియమ్స్ పీటర్(వరంగల్ రూరల్), ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి(గద్వాల), పి.రుక్మిణీదేవి(జనగామ), ఆర్.సుదర్శనమ్(నిర్మల్), సి.పద్మ(సిరిసిల్ల), ఎం.శ్రీకాంత్‌రెడ్డి(ఆదిలాబాద్), టి.సత్యనారాయణ(ఆసిఫాబాద్/కొమురం భీం) ఉన్నారు. 11 మంది అధికారుల డిప్యుటేషన్లు రద్దు... వివిధ జిల్లాల్లో ఏఎస్‌వోలుగా పోస్టింగులు పొంది, అక్కడ పనిచేయకుండా హైదరాబాద్‌లోని కమిషనర్ ఆఫీసు, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ (సీఆర్వో) కార్యాలయాల్లో కదలకుండా ఏళ్లకు ఏళ్లుగా తిష్ట వేసిన పౌరసరఫరాల శాఖ అధికారుల డిప్యుటేషన్లను కమిషనర్ సి.వి.ఆనంద్ రద్దు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఆదేశాలు జారీ చేశారు. వీరిలో చాలామంది వివిధ కారణాలను సాకుగా చూపెట్టి, తమకున్న రాజకీయ పరిచయాలను వాడుకుని డిప్యుటేషన్లపై హైదరాబాద్‌కు వచ్చారు. ఇప్పటిదాకా కమిషనర్ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న పి.సంధ్యారాణి, వి.మాధవి, ఎ.స్వామి కుమార్, ఎ.వి.ఎస్.వి.ప్రసాద్‌రావు, షేక్ నసీరుద్దీన్, జి.బాలసరోజ, టి.అరవింద్‌రెడ్డిలను ఆయా జిల్లాలకు పంపించారు. అలాగే సీఆర్వో ఆఫీసులో పనిచేస్తున్న వి.వెంకటేశ్వర్లు, బి.ఎన్.సరస్వతి, కె.శ్రీనివాస్, రంగారెడ్డి డీఎస్వో ఆఫీసులో పనిచేస్తున్న డి.దీప్తి డిప్యుటేషన్లను రద్దు చేశారు.


