యువత గొంతును విందాం! | Gen-z Youth Literature Social Change | Sakshi
Sakshi News home page

యువత గొంతును విందాం!

Oct 31 2026 7:47 AM | Updated on Oct 31 2026 7:47 AM

Gen-z Youth Literature Social Change

నేడు హైదరాబాద్‌లో ‘సమూహ’ యువ సాహిత్యోత్సవం

ప్రపంచవ్యాప్తంగా యువత నుంచి వ్యక్తమవుతున్న అసమ్మతి స్వరాలను, నిరసనలను అర్థం చేసుకోవాలంటే వారు జీవిస్తున్న సామాజిక వాస్తవికతను పరిశీలించాలి. జెన్‌ జడ్‌ ఉద్యమాలను తాత్కాలిక ఆవేశంగా కొట్టి పారేయడం ఎంత పొరపాటో, వారి ప్రతి వ్యక్తీకరణను విప్లవాత్మక చైతన్యంగా చూడటం కూడా అంతే పొరపాటు. వారి ప్రశ్నల్లోని అవకాశాలను, పరిమితులను గుర్తించడం అవసరం.

ఉపాధి పోటీకి విద్య ఎందుకు పరిమితమవుతోంది? అవకాశాలు కొందరికే ఎందుకు దక్కుతున్నాయి? సమానత్వం గురించి మాట్లాడే సమాజంలో కుల, వర్గ, లింగ వివక్షలు ఎందుకు కొనసాగుతున్నాయి? ప్రజాస్వామ్యంలో యువత గొంతుకు తగిన విలువ ఎందుకు దక్కడం లేదు? ఈ ప్రశ్నల వెనుక నిరుద్యోగం, ఆర్థిక అసమా నతలు, విద్య ప్రైవేటీకరణ, ప్రజాస్వామిక సంస్థలపై తగ్గుతున్న విశ్వాసం వంటి సమస్యలున్నాయి. ఒక దళిత విద్యార్థి ఎదుర్కొనే కుల అవమానానికి, ఆదివాసీ విద్యార్థి అనుభవించే సాంస్కృతిక దూరానికి, యువతి ఎదుర్కొనే వివక్షకు ప్రత్యేకమైన సామాజిక, చారిత్రక కారణాలున్నాయి. యువతను ఒకే ఆలోచనతో ఉన్న సమూహంగా చూడలేం.

సామాజిక మాధ్యమాలు యువతకు తమ అనుభ వాలను వ్యక్తం చేయడానికి, అధికారిక కథనాలను ప్రశ్నించడానికి కొత్త అవకాశాలను కల్పించాయి. ఈ ప్రయాణంలో సాహిత్యానికి కీలకమైన పాత్ర ఉంది. అణగారిన ప్రజల అనుభవాలకు సాహిత్యంలో స్థానం కల్పించడం అంటే కొత్త పాత్రలను పరిచయం చేయడం మాత్రమే కాదు, సమాజాన్ని చూసే దృష్టిని మార్చడం కూడా. యువ రచయితలకు వేదికలు కల్పించడంతోపాటు వారి రచనలను వినడానికి, చదవడానికి, విమర్శనాత్మకంగా చర్చించడానికి సాహిత్య ప్రపంచం సిద్ధపడాలి.

ఈ నేపథ్యంలో ‘సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరం’ అక్టోబర్‌ 31న హైదరా బాద్‌లోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న రెండవ సమూహ యువ సాహిత్యోత్సవం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘గోడల్ని ఛేదిద్దాం’ అనే నినాదంతో యువతరం సాహిత్యం, విద్యార్థుల ఆకాంక్షలు, డిజిటల్‌ మాధ్యమాలు, ఆధిపత్య వ్యవస్థలు, ప్రదర్శన కళలు వంటి అంశాలపై చర్చకు వేదిక కల్పించడం ఆహ్వానించదగిన ప్రయత్నం. యువత అభిప్రాయాలతో ఏకీభవించకపోయినా వినడం, వాదనల్లోని బలాన్ని గుర్తించడం, అవసరమైతే మన ఆలోచన లను సవరించుకోవడం నిజమైన ప్రజాస్వామిక సంభాషణ.

గోడలు ఇటుకలతోనే నిర్మితమవ్వవు. అవి మన ఆలోచనల్లో, విద్యాసంస్థల్లో, సాంస్కృతిక వ్యవస్థల్లో, మనుషుల మధ్య సంబంధాల్లోనూ ఉంటాయి. వాటిని ఛేదించడానికి ఆవేశంతోపాటు వివేచన, ప్రశ్నించే స్వేచ్ఛతో పాటు బాధ్యత అవసరం. యువత భవిష్యత్తు గురించి మాట్లాడటమంటే వారు రేపు ఏం అవుతారో ఊహించడం మాత్రమే కాదు, ఈ రోజు ఎలాంటి సమాజంలో జీవిస్తున్నారో ప్రశ్నించడం కూడా!
– మెర్సీ మార్గరెట్‌, కవయిత్రి

ఇదీ చదవండి: చెబుతున్నదొకటి చేస్తున్నదొకటి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement