Delhi: ఆదివారం హైటెన్షన్‌.. రెండు భారీ ర్యాలీలు! | Delhi Braces for BJP-INDIA Bloc Showdown | Sakshi
Sakshi News home page

Delhi: ఆదివారం హైటెన్షన్‌.. రెండు భారీ ర్యాలీలు!

Oct 31 2026 7:14 AM | Updated on Oct 31 2026 7:14 AM

Delhi Braces for BJP-INDIA Bloc Showdown

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఆదివారం(నవంబర్‌ 1) రాజకీయ పోరుకు వేదిక కానుంది. ఒకవైపు ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి రామ్‌లీలా మైదాన్‌లో భారీ ర్యాలీకి సిద్ధమవుతుండగా.. మరోవైపు బీజేపీ అదే రోజు ప్రతిఘటన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. పశ్చిమ ఢిల్లీలోని సిక్కులు అధికంగా నివసించే హరి నగర్‌లో ఉదయం 11 గంటలకు కౌంటర్‌ మార్చ్‌ నిర్వహించనుంది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల వార్షికోత్సవం, పండుగల సమయంలో వ్యాపారులకు ఎదురయ్యే ఇబ్బందులు, కాలుష్య నియంత్రణ నిబంధనలు.. ఈ మూడు అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ బీజేపీ ఈ నిరసనకు సిద్ధమైంది. దీంతో నవంబర్‌ 1న ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొనే అవకాశముంది.

1984 అల్లర్ల వార్షికోత్సవం.. కాంగ్రెస్‌పై బీజేపీ ఆగ్రహం
నవంబర్‌ 1 తేదీని కాంగ్రెస్‌ నిరసనలకు ఎంచుకోవడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 1984 అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 3 వరకు జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని, అనేక ఇళ్లు, వ్యాపార సంస్థలు ధ్వంసమయ్యాయని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం ఈ హింసాకాండ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో బాధిత సిక్కు కుటుంబాల మనోభావాలను కాంగ్రెస్‌ పట్టించుకోవడం లేదని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్ష్‌ మల్హోత్రా విమర్శించారు. రాహుల్‌ గాంధీ రాజకీయ పునరాగమనానికి నవంబర్‌ 1న భారీ సభ నిర్వహించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ సిక్కు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పలువురు సిక్కు సంస్థల ప్రతినిధులు, సామాజిక నేతలు గత పది రోజులుగా బీజేపీ నాయకులను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేసినట్లు ఆయన వెల్లడించారు.

5 వేల మందితో బీజేపీ మార్చ్‌
పంజాబ్‌ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సిక్కు వ్యతిరేక అల్లర్ల వార్షికోత్సవం రోజున కాంగ్రెస్‌ బలప్రదర్శన నిర్వహించడం బాధితుల గాయాలను మళ్లీ గుర్తుచేయడమేనని కేంద్ర మంత్రి చిరాగ్‌ పాస్వాన్‌ విమర్శించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ నేతృత్వంలో సుమారు 5 వేల మంది బీజేపీ కార్యకర్తలు, సిక్కు పౌరులు హరి నగర్‌ మార్చ్‌లో పాల్గొననున్నారు. మరోవైపు పండుగల సమయంలో రాజకీయ సభలతో వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటాయని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామ్‌లీలా మైదాన్‌ సమీపంలో ఉత్తర భారతదేశంలోని ప్రధాన టోకు మార్కెట్లు ఉన్నాయి. నవరాత్రి నుంచి దీపావళి, ఛఠ్‌ పూజ వరకు కొనుగోళ్లు జోరుగా సాగే సమయంలో భారీ ర్యాలీ నిర్వహిస్తే ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తి వ్యాపారాలు దెబ్బతింటాయని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది పేర్కొన్నారు. సభను వాయిదా వేయాలని వ్యాపార సంఘాలు కోరినా కాంగ్రెస్‌ తన నిర్ణయాన్ని మార్చుకోలేదని మల్హోత్రా తెలిపారు.

కాలుష్య నిబంధనలతో మరో వివాదం
నవంబర్‌ 1 నుంచే ఢిల్లీలో శీతాకాల కాలుష్య నియంత్రణ కార్యాచరణ ప్రణాళిక అమల్లోకి రానుంది. బీఎస్‌-6 ప్రమాణాలకు దిగువన ఉన్న వాహనాల ఢిల్లీ ప్రవేశంపై ఆంక్షలు విధించనున్నారు. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి ర్యాలీకి వచ్చే పాత వాహనాలను పోలీసులు అడ్డుకుంటే కాంగ్రెస్‌ నేతలు వివాదం సృష్టించే అవకాశం ఉందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమ ర్యాలీని అడ్డుకుంటోందంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు చేసే అవకాశముందని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు రామ్‌లీలా మైదాన్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహించుకునేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఉదయం 11 గంటలకు ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ సభకు 10 లక్షల మంది వరకు హాజరవుతారని సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ అంచనా వేశారు.

ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా కోరుతూ..
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను రద్దు చేయాలని ఇండియా కూటమి డిమాండ్‌ చేస్తోంది. ఎన్నికల అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిరసన చేపడుతున్నట్లు విపక్ష నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, సీపీఎం నేతలు ఎం.ఎ. బేబీ, వి. శివదాసన్‌, కాంగ్రెస్‌ నాయకుడు ఉదిత్‌ రాజ్‌ తదితరులు పాల్గొననున్నారు. పలు సంస్థల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా, తెలంగాణ, పంజాబ్‌ సహా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కార్యకర్తలను కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసులు అడ్డుకుంటున్నారని రాహుల్‌ గాంధీ, బ్రిట్టాస్‌ ఆరోపించారు. భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాహుల్‌ పేర్కొన్నారు. జంతర్‌మంతర్‌ను తిరిగి ప్రజా నిరసనలకు వేదికగా పునరుద్ధరించాలని కూడా కూటమి కోరనుంది.

ఇదీ చదవండి: ట్రంప్‌కు టాయిలెట్‌ పంచ్‌.. నార్వే దిమ్మతిరిగే కౌంటర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement