కాంగ్రెస్‌లో ఆధిక్యానికి అధ్యక్షుడి ప్రయత్నాలు
డెమోక్రాట్లవైపే మొగ్గు అంటున్న సర్వేలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయాలకు అసలు పరీక్ష... మధ్యంతర ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నవంబర్ మూడున జరిగే ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు ఏ మేరకు ఆధిక్యం సాధిస్తారన్న విషయంపై ట్రంప్ మిగిలిన రెండేళ్ల పదవీకాలం తీరుతెన్నులు నిర్ణయం కానున్నాయి. అమెరికా దేశీ రాజకీయాలే కాదు... వాణిజ్యం, సాంకేతికరంగం, వీసాలు, రక్షణ సంబంధాలు, వాతావరణ విధానాల వంటి అనేక అంశాలపై కూడా ఈ మధ్యంతర ఎన్నికల ప్రభావం ఉండనుంది.
అమెరికాలో నాలుగేళ్లకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరిగితే ఆ తరువాత రెండేళ్లకు మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ప్రతినిధుల సభకు 435 మందిని, సెనేట్‌లోని మొత్తం వంద స్థానాల్లో మూడోవంతు (ఈ సారి 35) స్థానాలకు, 36 రాష్ట్రాల గవర్నర్లు, వేల స్థానిక ప్రభుత్వ పదవులకు ప్రతినిధుల ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుతం ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకి ప్రతినిధుల సభలో 218 మంది సభ్యుల బలం ఉండగా, డెమోక్రాట్ పార్టీ సభ్యులు 214 మంది ఉన్నారు.
అలాగే సెనేట్‌లో రిపబ్లికన్లు 53 మంది ఉండగా, డెమోక్రాట్ల సంఖ్య 47గా ఉంది. మధ్యంతర ఎన్నికల్లో ఒకవేళ డెమోక్రాట్లకు ఆధిక్యం లభిస్తే... రానున్న రెండేళ్లలో ట్రంప్ తనకు నచ్చిన విధంగా చట్టాలు చేసే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. రిపబ్లికన్లు ఇరు సభల్లో ప్రస్తుతమున్న స్థానాలను నిలుపుకుంటూ మూడు స్థానాల్లో గెలిస్తే చాలు.. చట్టాలు చేసే కాంగ్రెస్ వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది.
కాంగ్రెస్ అధికార పక్షం చేతుల్లో కాకుండా ప్రతిపక్షమైన రిపబ్లికన్ల చేతుల్లోకి వెళితే ట్రంప్‌కు గడ్డుకాలమే. చట్టాల ఆమోదం మొదలుకొని బడ్జెట్ కేటాయింపులు, న్యాయమూర్తులు, అధికారుల నియామకాలు, పరిపాలన వంటివన్నీ కాంగ్రెస్ ద్వారానే జరుగుతాయి మరి. ఇలా కాకుండా.. డెమోక్రాట్లు ఏదో ఒక సభలో ఆధిక్యం సంపాదిస్తే... గుడ్డి కంటే మెల్ల మేలన్నట్టుగా ఉంటుంది పరిస్థితి.
ఈ ఎన్నికలు అమెరికన్లకు మాత్రమే కాకుండా.. భారత్ దృష్టిలోనూ చాలా ముఖ్యమైనవిగా చెప్పాలి. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రకరకాల టారిఫ్‌లతో ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌పై కఠిన చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు మనకు కూడా ముఖ్యమవుతున్నాయి. హెచ్1–బీ వీసాలపై ఆంక్షలు, అక్రమ వలసదారులపై చర్యల పేరుతో కొనసాగుతున్న ఐస్ వేధింపుల వంటి వాటికి బ్రేకులు పడే అవకాశం ఉంటుంది.
డెమోక్రాట్ల వైపే మొగ్గు?
మధ్యంతర ఎన్నికలపై నిర్వహించిన తాజా పోల్స్‌లో డెమోక్రాట్లకు స్పష్టమైన మొగ్గు కనిపిస్తోంది. పీబీఎస్ న్యూస్, ఎన్‌పీఆర్ మారిస్ట్ సర్వేల్లో డెమోక్రాట్లకు దాదాపు 52 శాతం మంది, రిపబ్లికన్లకు 44 శాతం మంది మద్దతిచ్చినట్టుగా తెలుస్తోంది. రియల్ క్లియర్ పోలింగ్ సర్వేలో ఈ ఫలితాల్లో స్వల్ప తేడా నమోదైంది. ఇందులో డెమోక్రాట్లకు 51.4 శాతం, రిపబ్లికన్లకు 43.2 శాతం మంది సై అన్నారు. ఇన్‌సైడ్ ఎలక్షన్స్ అనే సంస్థ ప్రకారం పరిస్థితి డెమోక్రాట్లకు ఎంతో అనుకూలంగా ఉంది.
ప్రతినిధుల సభలో 45. సెనేట్‌లో తొమ్మిది స్థానాలు ఎక్కువగా సాధించవచ్చునని ఈ సంస్థ అంచనా వేస్తోంది. సెనేట్‌లో ఆధిక్యానికి నికరంగా నాలుగు అదనపు స్థానాలు మాత్రమే అవసరమవుతాయి. రిపబ్లికన్లు మెయిన్, మిచిగాన్, టెక్సాస్, ఐయోవా, కాన్సాస్, నార్త్ కరోలినా, అలాస్కా వంటి రాష్ట్రాల్లో తమ స్థానాలను కాపాడుకోవాల్సి ఉంది. 2026 మధ్యంతర ఎన్నికల్లో ముందస్తు ఓటింగ్ అసాధారణంగా సాగుతోంది.
ఇప్పటివరకూ దాదాపు 4.2 కోట్ల మంది ఓటు వేసినట్లు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా ఎలక్షన్ ల్యాబ్ తెలిపింది. నార్త్ కరోలినాలో బుధవారం సాయంత్రం నాటికి 20 లక్షలకు పైగా ఓట్లు పడ్డాయి. 2022 ఎన్నికలతో పోలిస్తే ఇది 35 శాతం కంటే ఎక్కువ. నల్లజాతీయులు గత ఎన్నికలతో పోలిస్తే యాభై శాతం కంటే ఎక్కువ సంఖ్యలో ఓటు వేసినట్లు తెలిసింది. నల్లజాతీయుల్లో డెమోక్రాట్లకు మద్దతు తెలిపేవారు ఎక్కువ.


