ఇజ్రాయెల్‌ అధ్యక్షుడి నిర్ణయంపై ఉత్కంఠ! | Hung in Israel: Anticipation surrounds next political developments | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ అధ్యక్షుడి నిర్ణయంపై ఉత్కంఠ!

Oct 30 2026 7:36 PM | Updated on Oct 30 2026 7:51 PM

Hung in Israel: Anticipation surrounds next political developments

ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ అనిశ్చితికి దారితీశాయి. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూటమికి, ప్రతిపక్ష నేత గాడి ఐసెన్‌కాట్ నేతృత్వంలోని కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లభించలేదు. దీంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటులో అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ నిర్ణయం కీలకంగా మారింది.

120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్‌)లో నెతన్యాహు కూటమికి 53 సీట్లు రాగా, ఐసెన్‌కాట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 48 స్థానాలు వచ్చాయి. అరబ్ పార్టీలకు మరో 19 సీట్లు దక్కాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం.

ఎన్నికల ఫలితాలు అధికారికంగా అందిన తర్వాత అధ్యక్షుడు హెర్జోగ్ అన్ని పార్టీల నేతలతో చర్చలు జరపనున్నారు. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరని భావించే నాయకుడికి మొదటి అవకాశం ఇవ్వనున్నారు. అందులో ఎంపికైన నేతకు సాధారణంగా 28 రోజుల గడువు ఉంటుంది. ఒకవేళ అవసరమైతే మరో 14 రోజులు కూడా ఆ గడువును పొడిగించవచ్చు.

అయితే అరబ్ పార్టీల మద్దతుతో ఐసెన్‌కాట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైతే నెతన్యాహుకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అసలు ఆ ఇద్దరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే జాతీయ ఐక్య ప్రభుత్వ ఏర్పాటుకు హెర్జోగ్ ప్రయత్నించే అవకాశం కూడా ఉంది.

ఇక మరోవైపు నెతన్యాహుపై కొనసాగుతున్న అవినీతి కేసుల నేపథ్యంలో ఆయనకు క్షమాభిక్ష ఇవ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే తన నిర్ణయంపై అమెరికా సహా బయటి శక్తుల ప్రభావం ఉండబోదని హెర్జోగ్ ఇప్పటికే స్పష్టం చేశారు. జరుగుతున్న తాజా పరిణామాలతో ఇజ్రాయెల్ తదుపరి రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చదవండి: శాకాహారులైన టెక్ దిగ్గజాలు.. నా బ్రేక్‌ఫాస్ట్ స్టీక్, ఎగ్స్: ఎలాన్ మస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement