యుద్ధంలో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరాన్.. తన ఆయుధ సంపత్తిని రహస్యంగా పెంచుకుంటోంది. అమెరికా ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనాన్ని సైతం తప్పించుకుంటూ భారీగా సైనిక సామగ్రిని దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం ఏకంగా 5 వేలకుపైగా రహస్య సంస్థలతో అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు రాయిటర్స్ తాజాగా ఓ కథనంలో వెల్లడించింది. 2025 జనవరి నుంచి 2026 జూన్ వరకు ఈ వ్యవస్థ ద్వారా 2 బిలియన్ డాలర్లకు పైగా విలువైన సైనిక సామగ్రిని దిగుమతి చేసుకున్నట్లు గుర్తించింది.
ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ (MOD) పేరుతో ప్రారంభమయ్యే 5,000కుపైగా సంస్థలు ఈ నెట్‌వర్క్‌లో ఉన్నట్లు రాయిటర్స్ గుర్తించింది. వీటికి టెహ్రాన్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ చిరునామానే ఉంది. ఈ సంస్థలు విదేశీ కొనుగోళ్లు, ఆర్థిక లావాదేవీలు, సైనిక అవసరాలకు సంబంధించిన దిగుమతులను నిర్వహిస్తున్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)తోనూ వీటికి సంబంధాలున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.
ఒక్క సంస్థ ద్వారానే 2.3 బిలియన్ డాలర్లు
ఈ నెట్‌వర్క్‌లో MOD 346428 అనే సంస్థ కీలకంగా వ్యవహరించింది. 2025 జనవరి నుంచి 2026 జూన్ వరకు ఈ సంస్థ 2.3 బిలియన్ డాలర్ల విలువైన సైనిక సామగ్రిని దిగుమతి చేసుకుంది. రాకెట్ ఇంధనానికి అవసరమైన రసాయనాలు, పేలుడు పదార్థాలు, ఆయుధ విడిభాగాలు, విమాన ఇంజిన్ల భాగాలు, భారీ ట్రక్కులు ఇందులో ఉన్నాయి. చైనా, రష్యా, జర్మనీ తదితర దేశాల నుంచి ఈ సరుకులు వచ్చినట్లు రికార్డులు వెల్లడించాయి. ఇదిలా ఉండగా... విదేశీ కొనుగోళ్ల కోసం ఇరాన్ నేరుగా డబ్బు బదిలీ చేయడం లేదు. విదేశాల్లోని మధ్యవర్తులు, షెల్ కంపెనీల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తోంది. రాయిటర్స్ పరిశీలించిన దిగుమతుల్లో 97 శాతం చెల్లింపులు ఎలాంటి కరెన్సీ బదిలీ లేకుండానే పూర్తయ్యాయి. అక్రమ చమురు విక్రయాల ద్వారా విదేశాల్లో సంపాదించిన డబ్బుతో అక్కడే వస్తువులను కొనుగోలు చేసి ఇరాన్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది.
క్షిపణి లాంచర్లుగా ట్రక్కులు
ఇరాన్ కేవలం ఆయుధ విడిభాగాలనే కాకుండా భారీ వాహనాలను కూడా దిగుమతి చేసుకుంటోంది. 2025 జనవరి నుంచి 2026 జూన్ మధ్య 435 ఐవెకో ట్రక్కులను కొనుగోలు చేసింది. వీటితోపాటు టయోటా హైలక్స్, ల్యాండ్ క్రూయిజర్, టండ్రా వాహనాలను కూడా దిగుమతి చేసుకుంది. సాధారణ ట్రక్కుల మాదిరిగా కనిపించే వాహనాలను క్షిపణి ప్రయోగ వాహనాలుగా మార్చుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2026 ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ క్షిపణి, డ్రోన్ తయారీ కేంద్రాలపై దాడులు చేశాయి. అమెరికా నౌకాదళ దిగ్బంధనం కూడా కొనసాగింది. అయినప్పటికీ ఇరాన్ దిగుమతులు ఆగలేదు. మార్చిలో దిగుమతులు 47 శాతం తగ్గి 5.4 కోట్ల డాలర్లకు పడిపోయినా, మే నాటికి మళ్లీ 7.7 కోట్ల డాలర్లకు పెరిగాయి. రష్యా నుంచి డిటోనేటర్లు, చైనా నుంచి రాకెట్ ఇంధన తయారీకి అవసరమైన రసాయనాలు, టైటానియం వంటి పదార్థాలు వచ్చాయి.
బ్యాంకు రికార్డులతో వెలుగులోకి..
ఇరాన్ ప్రభుత్వ బ్యాంకు సెపాకు చెందిన వేలాది పత్రాలను పరిశీలించిన 240 అనలిటిక్స్ సంస్థ ఈ రహస్య నెట్‌వర్క్‌ను గుర్తించింది. 2024 చివరి నాటికి 36 సంస్థల విదేశీ మారక ఖాతాల్లోనే 1.2 బిలియన్ డాలర్లు ఉన్నట్లు రికార్డులు వెల్లడించాయి. ఈ వివరాలను బ్యాంకు ఖాతాలు, దిగుమతి పత్రాలు, కంపెనీల రిజిస్ట్రేషన్ వివరాలతో సరిపోల్చి రాయిటర్స్ పరిశోధన చేపట్టింది. ఈ నెట్‌వర్క్ ఇరాన్ సైనిక వ్యవస్థకు కీలకమైన ఆర్థిక వెన్నెముకగా పనిచేస్తోందని అమెరికా ట్రెజరీ శాఖ మాజీ అధికారి మియాద్ మాలెకీ అభిప్రాయపడ్డారు. అయితే ఈ పరిశోధనపై ఇరాన్ ప్రభుత్వ సంస్థలు స్పందించలేదు. మొత్తంగా అమెరికా ఆంక్షలు, యుద్ధం, దిగ్బంధనం మధ్య కూడా ఇరాన్ తన క్షిపణి, డ్రోన్ సామర్థ్యాన్ని నిలబెట్టుకునేందుకు రహస్య దిగుమతుల వ్యవస్థను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లో ఓట్ల లెక్కింపు పూర్తి.. నెతన్యాహుకు చుక్కెదురు?


