అధికారులూ తప్పుకోండి!  | Serbia students demand resignations in police, judiciary | Sakshi
Sakshi News home page

అధికారులూ తప్పుకోండి! 

Oct 30 2026 4:30 AM | Updated on Oct 30 2026 4:30 AM

Serbia students demand resignations in police, judiciary

సెర్బియా విద్యార్థి నేతల డిమాండ్‌

బెల్‌గ్రేడ్‌: యూరోపియన్‌ దేశం సెర్బియా ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థి నేతలు ‘ప్రక్షాళన’ మొదలు పెట్టారు. త్వరలోనే అధికారం చేపట్టనున్న నేపథ్యంలో వారు గురువారం న్యాయ, పోలీసు, నిఘా వ్యవస్థల్లోని ఉన్నతాధికారుల రాజీనామాకు డిమాండ్‌ చేశారు. ఆదివారం వెలువడ్డ ఎన్నికల ఫలితాలను సెర్బియా ఎన్నికల అధికారులు వెంటనే ప్రకటించాలని, తద్వారా కొత్త పార్లమెంటు, ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశం ఏర్పడుతుందని విద్యార్థి నేతలు విలేకరుల సమావేశంలో కోరారు. 

విద్యార్థి నేతల ఆధ్వర్యంలోని ‘స్టూడెంట్‌ లిస్ట్‌’250 సీట్లున్న సెర్బియా పార్లమెంటులో 140 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫలితంగా దాదాపు 14 ఏళ్లపాటు అధికారంలో ఉన్న సెర్బియన్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ అధ్యక్షుడు అలెక్సాండర్‌ వూచిచ్‌ ఓటమిపాలయ్యారు. అధికార మార్పిడి ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ ప్రభుత్వ అధికారులు అందరూ అలెక్సాండర్‌ వూచిచ్‌ నియంత్రణలో ఉంటారన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే విద్యార్థి నేతల డిమాండ్‌ ఎందుకు అన్నది స్పష్టమవుతుంది. 

సెంట్రల్‌ బెల్‌గ్రేడ్‌ పార్క్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో విద్యార్థి నేత ఫిలిప్‌ ఉబోవిచ్‌ మాట్లాడుతూ ‘‘ప్రజలకు చెందిన వ్యవస్థల్లో మార్పులు మొదలయ్యాయి. చట్టం అందరికీ వర్తిస్తుంది’’అని వ్యాఖ్యానించారు. 2012 నుంచి అలెక్సాండర్‌ వూచిచ్‌ దేశంలోని అన్ని వ్యవస్థలను తన అధీనంలోకి తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆశ్రితపక్షపాతం, అవినీతి, నేర సామ్రాజ్యంతో లింకులు, న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకురావడం వంటి అనేక అక్రమాలకు వూచిచ్‌ పాల్పడ్డారని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశం ఉండటంతోనే తాము అధికారుల రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement