శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తర్వాత మరో దేశమైన సెర్బియాలో సైతం యువతరం తడాఖా చూపింది. ఆగ్నేయ యూరోప్‌లో డాన్యూబ్, సావా నదుల సంగమస్థలమైన దాని రాజధాని నగరం బెల్‌గ్రేడ్ సోమవారం లక్షలమంది జనంతో ఉప్పొంగిపోయింది. ఒక నాయకుడంటూ లేకుండా, నిర్దిష్టమైన విధివిధానాలు రూపొందించుకోకుండా విద్యార్థులు ఏకమై నెలకొల్పిన స్టూడెంట్ లిస్ట్ పార్టీ 53.3 శాతం ఓట్లతో, 140 స్థానాల్లో జయభేరి మోగించటం ఆ విజయోత్సవానికి కారణం. 250 స్థానాలున్న పార్లమెంటుకు పన్నెండేళ్ల క్రితం అధికారంలోకొచ్చిన ప్రస్తుత అధ్యక్షుడు అలెక్సాండర్ వూచిచ్ ఆ పక్కనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆదర్శంగా తీసుకుని రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసి, మూడోసారికి కుదరదు గనుక ప్రధానిగా తిరిగొద్దామని ఎత్తుగడ వేశారు. కానీ తన పొరుగునున్న హంగేరీ అధ్యక్షుడు విక్టర్ ఒర్బాన్‌కు ఏమైందో గమనించుకోలేదు. తన మాదిరే ఎన్నికల సంఘం మొదలుకొని న్యాయవ్యవస్థ, మీడియా, పారిశ్రామికరంగం వరకూ అన్నిటినీ అధీనంలోకి తెచ్చుకుని తిరుగులేని అధికారం చలాయించిన ఒర్బాన్ పదహారేళ్ల అనంతరం మొన్న మే నెలలో పదవీచ్యుతుడయ్యారు. దాన్నుంచి వూచిచ్ ఏమీ నేర్చుకోలేదు సరిగదా... అవినీతి భూతాన్ని అదుపు చేద్దామన్న స్పృహ కూడా కొరవడింది.
శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో యువతరం హింసామార్గానికి మళ్లింది. అధికార సౌధాలపై దాడులకు దిగింది. పాలకుల్ని తరిమికొట్టింది. కానీ సెర్బియా యువతరం ఇందుకు భిన్నం. ప్రభుత్వం ఎంత రెచ్చగొట్టినా శాంతియుత మార్గాన్ని వీడలేదు. అందుకే రెండేళ్లనుంచి ఉద్యమం నిలకడగా సాగింది. దాన్ని అణిచేయటానికి వూచిచ్ చేయని ప్రయత్నమంటూ లేదు. తుపాకుల ప్రయోగం మినహా చేయాల్సిందంతా చేశారు. రాత్రి వేళల్లో అరెస్టులు, లాఠీచార్జిలు, పెప్పర్ స్ప్రే ప్రయోగాలు, ఉద్యమవేదికల్ని హఠాత్తుగా నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించటం వగైరాలన్నీ ఉపయోగించారు. మాఫియా ముఠాలను రంగంలోకి దించారు. చురుగ్గా పనిచేసే నేతల్ని బెదిరించటం, దౌర్జన్యానికి దిగటం, ప్రధాన నగరాల్లో ప్రభుత్వ భవనాల దరిదాపుల్లోకొచ్చే యువకుల్ని బెదర గొట్టడం, ఇళ్లకు వెళ్లి చంపేస్తామని బెదిరించటం ఈ ముఠాల పని. ఉద్యమ నేతలను విదేశీ శక్తుల కిరాయిమనుషులుగా అనుకూల మీడియా సాగించిన ప్రచారం... ఉద్యమ కారుల బంధుమిత్ర గణం ద్వారా జనానికి చేరే సమాచారం ముందు వీగిపోయింది.
విద్యార్థులు స్టూడెంట్ లిస్ట్ నేతలుగా వెలిగిపోవాలనుకోలేదు. నిజానికి 250 మంది జాబితాలో ఒక్క విద్యార్థి కూడా లేడు. రైతుల్ని, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లను, నటుల్ని, ఒపేరా గాయకుల్ని, క్రీడాకారుల్ని, వైద్యరంగ నిపుణుల్ని అభ్యర్థులుగా ఎంపిక చేసు కున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో పార్టీ నెలకొల్పాలా వద్దా అని ఊగిసలాడినా చివరకు వివిధ నగరాలు, పట్టణాల్లోని కూడళ్లలో తరచు చర్చావేదికలు నిర్వహిస్తూ వచ్చారు. అక్కడే విధానాలు ఖరారయ్యేవి. ఆ విధానాలే ఇప్పుడు విజయాన్నిచ్చాయి. అయితే వూచిచ్ ఇంత త్వరగా పదవినుంచి తప్పుకుంటారని వారనుకోలేదు. బహుశా ఇదే బెల్‌గ్రేడ్‌లో 1903లో తన పేరేగల రాజుపై సైన్యం తిరుగుబాటుచేసి ఆయన్ని కిటికీ నుంచి విసిరేయడం గుర్తొచ్చి ఉండాలి. సైన్యం బలంతో అధికారానికి అంటిపెట్టుకుంటే కష్టాలు చవిచూడాల్సి వస్తుందని వూచిచ్ సరిగానే అంచనా వేసుకున్నారు.
ఇంతకూ ఓడింది బ్రెజిల్‌లో మాదిరే మితవాద, జాతీయవాద పక్షమైనా... నెగ్గిందెవరో చెప్పటం అంత సులభం కాదు. వారు ఉదారవాదులనీ, అమెరికా డీప్ స్టేట్ ఏజెంట్లనీ వూచిచ్ ప్రచారం చేశారు. అటు ట్రంప్‌కు సైతం అలాంటి ఆశ ఉంది. బెల్‌గ్రేడ్‌లో ట్రంప్ టవర్‌కు వూచిచ్ అనుమతించకపోవడం ఆయనకు ఆగ్రహం కలిగించింది. కానీ స్టూడెంట్ లిస్ట్ అంత తేలిగ్గా అమెరికాను అక్కున చేర్చుకునే రకం కాదు. వారు మౌలికంగా ప్రజాస్వామికవాదులు. జాతీయవాదం తమలో ఏం తక్కువలేదని ఉద్యమ సందర్భంలో చాటారు. యూరోప్ యూనియన్(ఈయూ)లో చేరతామంటూనే సెర్బియా రష్యా వైపు మొగ్గడం ఆ సంస్థకు నచ్చలేదు. స్టూడెంట్ లిస్ట్ పార్టీకి ఈయూపై ఆసక్తే లేదు. మొత్తానికి నిలకడగా, సూత్రబద్ధంగా పోరాడి సాధించిన విజయం పాలనలో ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.


