యుద్ధభూమిలో 491 రోజుల పాటు మృత్యువుతో పోరాడాడు.. రష్యా డ్రోన్ల నిఘా మధ్య బిక్కుబిక్కుమంటూ బతికాడు.. తోటి సైనికుడు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు. గాయాలతో కదల్లేని స్థితికి చేరుకున్నాడు. చివరకు బతకడం కోసం తన కాలును తానే కత్తితో కోసుకున్నాడు. ఉక్రెయిన్‌కు చెందిన 49 ఏళ్ల సైనికుడు కొస్త్యాంటిన్ వ్లాసెంకో కథ వింటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది.
దాదాపు ఎనిమిది నెలల పాటు శిథిలమైన పాఠశాలలోని బాయిలర్ కింద చిన్న గుహలాంటి ప్రదేశంలో ఒంటరిగా గడిపిన అతడిని.. చివరకు ఓ భారీ డ్రోన్ సురక్షిత ప్రాంతానికి చేర్చింది. ఉక్రెయిన్‌లోని క్రివీ రిహ్‌కు చెందిన వ్లాసెంకో 30వ మెకనైజ్డ్ బ్రిగేడ్‌లో సైనికుడిగా పనిచేస్తున్నాడు. యుద్ధానికి ముందు భారీ ట్రక్కులను నడిపే ఉద్యోగం చేసేవాడు. యుద్ధం ప్రారంభమైన తర్వాత స్వచ్ఛందంగా సైన్యంలో చేరాడు. గతేడాది అతడిని వెర్టున్ అనే ఫ్రంట్‌లైన్ ప్రాంతానికి పంపించారు. అక్కడ బాస్కీ అనే కాల్‌సైన్ ఉన్న మరో సైనికుడితో కలిసి విధులు నిర్వహించేవాడు. వారి నివాసం ఓ కాంక్రీట్ డ్రైనేజీ పైపు, దాని పక్కన తవ్విన ఒక షెల్టర్ ఉండేది.
డ్రోన్ల ద్వారా ఆహారం, ఇతర అవసరాలను అందించేవారు. అయితే, ఆ ప్రాంతంలో రష్యా డ్రోన్ల దాడులు పెరిగిపోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమ చుట్టూ ఎక్కడ చూసినా డ్రోన్లే కనిపించేవని వ్లాసెంకో గుర్తుచేసుకున్నాడు. ఫిబ్రవరి మధ్యలో వారు ఉంటున్న గుంతలోకి నీరు చేరడంతో ఇద్దరూ సమీపంలోని శిథిలమైన పాఠశాలలోకి వెళ్లారు. అక్కడి నుంచి పొడి దుస్తులు, ఆహార పొట్లాలు తెచ్చుకునేందుకు బయటకు వెళ్లిన సమయంలో రష్యా నిఘా డ్రోన్ వారిని గుర్తించింది. ఆ తర్వాత మరో డ్రోన్ దాడి చేసింది. ఫిబ్రవరి 16న జరిగిన ఈ దాడిలో బాస్కీ ప్రాణాలు కోల్పోయాడు. అదే రోజు అతడి 50వ పుట్టినరోజు కావడం గమనార్హం.
ఈ దాడిలో వ్లాసెంకో ఎడమ పాదానికి తీవ్ర గాయమైంది. కుడి కాలుకు కూడా బలమైన దెబ్బ తగిలింది. కాలక్రమంలో ఎడమ పాదం కుళ్లిపోయింది. కుడి కాలు పరిస్థితి కూడా మరింత దిగజారింది. నడవలేని స్థితిలో పాకుతూ వెళ్లి.. పాఠశాలలోని బాయిలర్ కింద ఉన్న చిన్న ప్రదేశంలో తలదాచుకున్నాడు.
వ్లాసెంకోను లొంగదీసుకునేందుకు రష్యా సైన్యం మరో ప్రయత్నం చేసింది. అతడు దాక్కున్న ప్రాంతానికి ఓ డ్రోన్ ద్వారా లౌడ్‌స్పీకర్‌ను జారవిడిచింది. అందులో రికార్డు చేసిన ఓ గొంతు వినిపించింది. నువ్వు ఇక్కడే ఉన్నావని మాకు తెలుసు. నమ్ము.. నీ సహచరులు నిన్ను కాపాడలేరంటూ ఆ సందేశం వినిపించింది. అయినా వ్లాసెంకో ధైర్యం కోల్పోలేదు. ప్రతి నాలుగు నుంచి ఐదు రోజులకు ఒకసారి డ్రోన్ల ద్వారా ఆహారం, మందులు, సిగరెట్లు, స్వీట్లు అందేవి. రేడియో ద్వారా తనపై అధికారులతో మాట్లాడేవాడు. ఎవరితోనైనా మాట్లాడగలగడమే తనకు ఎంతో సంతోషాన్నిచ్చేదని చెప్పాడు.
అతడి భార్య స్టీఫెన్ కింగ్ రాసిన పుస్తకాన్ని కూడా పంపించింది. నెలల తరబడి ఒంటరిగా గడిపిన అతడు ఆ పుస్తకాన్ని చదువుతూ కాలం వెళ్లదీశాడు. బతకడం కోసం కత్తితో తన కాలును తానే కోసుకున్నాడు. కుడి కాలి గాయం రోజురోజుకూ తీవ్రమైంది. ఎముక చర్మం నుంచి బయటకు పొడుచుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. ఆహారం కోసం పాకుతూ వెళ్లిన ప్రతిసారీ గాయం మరింత పెద్దదయ్యేది. చివరకు ఆ కాలును తొలగించుకోవడం తప్ప మరో మార్గం లేదని భావించాడు. ఓ ఇటుకపై కాలును ఉంచి, కత్తి తీసుకుని తానే కోసుకున్నాడు. రక్తస్రావాన్ని ఆపేందుకు టోర్నికెట్ కట్టుకున్నాడు. కత్తితో కోస్తున్నప్పుడు కన్నీళ్లు వచ్చాయి. అయినా తప్పలేదని వ్లాసెంకో తెలిపాడు.
వ్లాసెంకోను అక్కడి నుంచి బయటకు తీసుకురావడం సైన్యానికి పెద్ద సవాలుగా మారింది. రహదారులన్నీ రష్యా డ్రోన్ల నిఘాలో ఉండటంతో ట్రక్కులు, సాయుధ వాహనాలు వెళ్లలేని పరిస్థితి. అతడిని చేరుకోవడానికి పంపిన రెండు గ్రౌండ్ రోబోలను కూడా ధ్వంసం చేశారు. దీంతో బెటాలియన్‌లో డ్రోన్ కార్యకలాపాలను పర్యవేక్షించే అలెక్స్ అనే అధికారి వినూత్న ఆలోచన చేశాడు.
ఉక్రెయిన్‌కు చెందిన గుర్జుఫ్ డిఫెన్స్ తయారు చేసిన ఆరు రోటర్లు ఉన్న భారీ డ్రోన్‌తో అతడిని బయటకు తీసుకురావాలని నిర్ణయించారు. ఈ ఆలోచన నుంచి ఆపరేషన్ కార్యరూపం దాల్చే వరకు దాదాపు ఆరు నెలలు పట్టింది. రెస్క్యూ కోసం ప్రత్యేకమైన హార్నెస్, సూచనల వీడియోలు ఉన్న ఫోన్‌ను డ్రోన్ ద్వారా వ్లాసెంకోకు పంపించారు. వాటిని ఉపయోగించడం ఎలా అనేది అతడికి వివరించారు. 70 మీటర్ల ఎత్తులో గాల్లో ప్రయాణం. అక్టోబర్ 4న అసలు ఆపరేషన్ ప్రారంభమైంది. భారీ డ్రోన్ వద్దకు చేరుకున్న వ్లాసెంకో ప్రత్యేక హార్నెస్‌ను దానికి అమర్చిన విన్చ్ హుక్‌కు తగిలించుకున్నాడు. అనంతరం డ్రోన్ అతడిని దాదాపు 70 మీటర్ల ఎత్తుకు పైకి లేపింది. అలా గాల్లోనే సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణించి.. యుద్ధభూమి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది.
ఇదీ చదవండి: టైగర్ ష్రాఫ్ రోజూ తాగే నీరు ఖర్చు రూ.3,600


