ఇరుగు పొరుగుతో సంబంధాలు చాలా సున్నితమైనవి. సరిహద్దు వివాదం ఉంటే అది అత్యంత సంక్లిష్టమైన వ్యవహారంగా మారుతుంది. పరిష్కారం సాధించదల్చుకున్న ప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలుంటాయి. అందులో కాస్త హెచ్చుతగ్గులుంటే చాలు... విపక్షాలు విరుచుకుపడతాయి. ఇక అవతలి సైన్యం బలవంతంగా చొరబడి ఘర్షణలకు దిగితే చెప్పేదేముంది? అరుణాచల్ ప్రదేశ్‌లోగల వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) పొడవునా చైనాతో గత జూలైనుంచి పలుచోట్ల వివాదాలు తలెత్తుతున్నాయని ఇండో–టిబెటిన్ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ) దళం చీఫ్ శత్రుజిత్ కపూర్ నోరు జారటం తాజా వివాదానికి కారణం.
ఈ నెలాఖరున రిటైర్ కాబోతున్న సందర్భంగా రాజస్థాన్‌లోని ఆళ్వార్‌లో ఐటీబీపీలోని శౌర్య కమాండో దళం సమర్థతను ప్రశంసిస్తూ ఆయన ఈ మాటలన్నారు. అంతే, కాంగ్రెస్ వైపునుంచి విమర్శలు మొదలయ్యాయి. గత నెల 12న ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చారు. 2020నాటి గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత ఆయన మన దేశానికి రావటం ఇదే ప్రథమం. సరిహద్దులు ప్రశాంతంగా ఉంటేనే సాధారణ సంబంధాలు మెరుగుపడతాయనీ, దాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామనీ ప్రధాని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్‌లు అవగాహనకొచ్చారు.
శత్రుజిత్ చెబుతున్న ప్రకారం జూలైనుంచీ సరిహద్దుల్లో అలజడి ఉంటుండగా ఇరు దేశాల అధినేతల మధ్యా ఇంత సుహృద్భావం ఎలా సాధ్యమైందన్న సందేహం ఎవరికైనా వస్తుంది. కనీసం సెప్టెంబర్ తర్వాతైనా పరిస్థితి చక్కబడాలి కదా అనిపిస్తుంది. రక్షణ దళాల చీఫ్ జనరల్ ఎన్‌ఎస్ రాజా సుబ్రమణి, విదేశాంగమంత్రి జైశంకర్ చైనా సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయని వేర్వేరు సందర్భాల్లో చెప్పారు. ఎప్పటికప్పుడు సైన్యాధికారుల స్థాయి భేటీ జరగటంవల్ల ఆందోళన పడేంత అస్థిరత లేదని జనరల్ సుబ్రమణి తెలిపారు. జైశంకర్ అయితే 2024 ముందుకన్నా పరిస్థితి మెరుగ్గా ఉన్నదన్నారు.
ఈ నేపథ్యంలో సహజంగానే శత్రుజిత్ మాటల్ని కాంగ్రెస్ అందిపుచ్చుకుంది. ఎల్‌ఏసీలో ఏం జరుగుతున్నదో దేశ ప్రజలకు తెలియాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంటే... ఐటీబీపీ చీఫ్ చేసిన ఈ ప్రకటన ఎంత దుమారం రేపేదో ఊహించటం కష్టమేమీ కాదు. 1962 చైనా యుద్ధంలో అప్పటి ప్రధాని నెహ్రూ వ్యవహరించిన తీరువల్ల దేశానికి కలిగిన నష్టం గురించి ఇప్పటికీ తరచు బీజేపీ నేతలు చెబుతుంటారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు పొంతన లేకుండా మాట్లాడిన సందర్భం ఏర్పడితే బీజేపీ దాన్ని మామూలుగా వదిలేది కాదు. కాంగ్రెస్‌కున్న పరిమితులవల్ల అది ఆ స్థాయిలో స్పందించలేకపోతోందని చెప్పాలి.
ఐటీబీపీ సేవలు నిరుపమానమైనవి. లద్దాఖ్‌లోని కారకోరం మొదలుకొని హిమాచల్‌లోని జరేప్ లా వరకూ గల 3,488 కిలోమీటర్ల నిడివుండే ఎల్‌ఏసీ అత్యంత ప్రమాద కరమైనది. అక్కడ ఆక్సిజెన్ లభ్యత అంతంతమాత్రం. శరీరం గడ్డకట్టేంత చలి. ఎత్తయిన కొండలు, చుట్టూ లోయలుండే ఆ ప్రాంతంలో ఏమాత్రం అప్రమత్తత కొరవడినా ప్రాణాలు మిగలవు. చైనా సైనికులు ఏదో చోట లోపలకి చొచ్చుకొచ్చి ఇదంతా తమదే ననటం, కవ్వింపునకు దిగటం నిత్యకృత్యం. స్వల్ప తగాదా కూడా క్షణంలోనే ఉద్రిక్తంగా మారుతుంది. గస్తీ బాధ్యతల్లో ఉండే ఐటీబీపీ దళానికి ఓర్పు, సహనం, అవతలిపక్షానికి నచ్చజెప్పే నేర్పు, ఆ ఘర్షణను అక్కడికే పరిమితం చేయగలిగే వ్యూహం ఉంటేనే రోజు గడుస్తుంది. లేదంటే ఆ వివాదం విస్తరిస్తుంది. అందుకు గల్వాన్ లోయ ఘర్షణలే ఉదాహరణ. అక్కడ మన దళాలు చైనాకు గణనీయంగానే నష్టం కలిగించినా... మనవైపు 20మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
మొత్తానికి ఐటీబీపీ చీఫ్ ప్రసంగం చూస్తే చైనా తన వెనకటి గుణం మానుకోలేదని అర్థమవుతుంది. అధినేతల స్థాయి సమావేశాల్లో పెద్ద మనిషి తరహాగా ఉండటం, క్షేత్రస్థాయిలో గిల్లికజ్జాలకు దిగటం మొదటినుంచీ దానికి అలవాటు. వాణిజ్యం, సరిహద్దు వివాదం– దేనిదారి దానిదేననే చైనా వాదనను ఇకపై అంగీకరించకూడదు. చిత్తశుద్ధి లోపిస్తే సామరస్యత సాధ్యంకాదనీ, కవ్వింపు చర్యలకు స్వస్తి పలకాలనీ నిక్కచ్చిగా చెప్పాలి.


