జనతంత్రం
మొన్నటి సాధారణ ఎన్నికల్లో జరిగిన ఓట్ చోరీ గురించి దేశమంతటా చర్చ జరుగుతున్న సమయమిది. జరిగిన చౌర్యా నికి కొనసాగింపుగా, మరింత నైపుణ్యాన్ని జోడించి ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ‘సర్’ క్రతువుపై ప్రజాస్వామ్య శక్తులు కన్నెర్ర చేస్తున్న కాలమిది. ఎన్నికల సంఘం పాలక కూటమి తొత్తుగా మారి రాజ్యాంగ ధర్మాన్ని అపహాస్యం చేస్తున్న వికృత కేళిపై యువతరం యుద్ధ ప్రకటన చేసిన సందర్భం. ఈ సమ యంలోనే ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు ముందు కొచ్చాయి. ఇక్కడ కూడా కేంద్రంలో ఉన్నట్టే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నది. కాకపోతే ఈ బ్రాంచి ఆఫీసుకు బాస్ చంద్రబాబు. తానొక గొప్ప విజినరీనని బలంగా విశ్వసించే బాబు ఏపీ స్థానిక ఎన్నికలను కూడా కొత్త పుంతలు తొక్కించారు. జరిగిపోయిన ఓట్ చోరీ వ్యవహారాన్ని ఇంటికి కన్నం వేసి చేసే దొంగతనంతో పోల్చితే, ప్రస్తుత ఏపీ పరిణామాల్ని పిండారీ ముఠాల దండుయాత్రలతో పోల్చవచ్చు.
రెండొందల యేళ్లకు పూర్వం ఈ పిండారీ ముఠాల దాడులకు కోస్తాంధ్ర ప్రాంతం కూడా గురైంది. మిడతల దండులా ఊళ్లమీద పడి సర్వం దోచుకొని హత్యలు, గృహ దహనాలు, మానభంగాలు చేసిన భయానక ముఠాలు పిండారీలు. ఈ ముఠాల బీభత్సానికి గుర్తుగా ఇప్పటికీ కొన్ని తెలుగు సామెతలు ఆ ప్రాంతంలో స్థిరపడి ఉన్నాయి. ‘సింగినాదం జీలకర్ర’ కూడా ఈ కోవలోదే. పిండారీల రాకకు గుర్తుగా కొమ్ముబూరను ఊది గ్రామస్తులను హెచ్చరించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ శబ్దం వినగానే ప్రాణాలు కాపాడుకునేందుకు ఊళ్లను వదిలి జనం పారిపోయేవారు. ఈ కొమ్ముబూరనే సింగినాదం అంటారు. శృంగనాదం అనే మాటకు ఇది వాడుక రూపం. ఆ రోజుల్లో జీలకర్ర అమ్ముకోవడానికి ఒక ఆంధ్ర రేవుకు వచ్చిన వర్తకం ఓడవాళ్లు జనాన్ని పిలవడానికి సింగినాదం చేశారట. పిండారీలు వస్తున్నారనే భయంతో సమీప గ్రామాల ప్రజలు పారిపోయారట. చివరికి ఈ ‘సింగినాదం జీలకర్ర’ది అని తెలిసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారట.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కొమ్ముబూర ఊది ప్రజలను హెచ్చరించవలసిన కాలం దాపురించింది. ఇది జీలకర్ర, మెంతుల గురించిన శబ్దం కాదు. జనజీవన విలువల రక్షణ కోసం ఊపిరితిత్తులు ఉగ్గదీసుకొని బలంగా వినిపించవలసిన సింగినాదం. ప్రజాస్వామిక హక్కులను కాపాడుకోవటం కోసం దిక్కులు పిక్కటిల్లేలా ధ్వనింపజేయవలసిన శృంగనాదం. బందిపోటు, పిండారీ ముఠాల మాదిరిగా పాలకపార్టీ అనుయా యులు బరితెగించి ప్రజాస్వామ్య ప్రక్రియను ఎగతాళి చేస్తున్న దృశ్యాలు వందలు వేల ఫ్రేముల్లో దర్శనమిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే హక్కును తృణీకరిస్తున్నారు. ప్రత్యర్థుల నామినేషన్ పత్రాలను ఊడబెరుక్కొని చించేస్తున్నారు. రక్షకభటులు చోద్యం చూస్తున్నారు. అవసరమైతే రౌడీముఠాలకు మాట సాయం, లాఠీ సాయం చేస్తున్నారు. ధోరణి చూస్తే తూటా సాయానికి కూడా వాళ్లు వెనకాడేట్లు లేరు.
రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కార్యాలయం పాలక కూటమి ఎలక్షన్ వార్‌రూమ్‌లా పనిచేయడం భయం గొలుపుతున్నది. రాష్ట్రంలో ఉన్న ఫోర్త్ ఎస్టేట్ కూటమిలో నాలుగో భాగస్వామిగా తన పాత్రను సిగ్గూ, బిడియం లేకుండా పోషిస్తున్నది. సోషల్ మీడియాలోనే కొన్ని ప్రజాస్వామిక కలాలు కనిపిస్తున్నవి. గళాలు వినిపిస్తున్నవి. రాజ్యాంగ హక్కులకోసం నినదించే గొంతులు బాబు సర్కార్ బరితెగింపును ప్రశ్నిస్తున్నాయి. ఆ ప్రశ్న దేశ రాజధానిలో ప్రతిధ్వనిస్తున్నది. ఫలితం కనబడింది. ప్రతిపక్షనేత శుక్రవారం నాటి మీడియా సమావేశానికి బదులు గానా అన్నట్టు శనివారం నాడు ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చారు. కాకపోతే జగన్ లేవనెత్తిన అంశాలకూ, చంద్రబాబు ఇచ్చిన వివరణకూ ఎక్కడా సాపత్యం కుదరలేదు.
తాటిచెట్టు ఎందుకు ఎక్కావు అనేది ప్రశ్న, దూడగడ్డి కోసం అనేది జవాబు. ఇదో పాత చింతకాయ పచ్చడి సామెత. అరిగి పోయిన గ్రామ్‌ఫోన్ రికార్డు. అదే రికార్డును ముఖ్యమంత్రి మరింత అరగదీసే ప్రయత్నం చేశారు. జగన్, చంద్రబాబుల మీడియా సమావేశాలను చూసినవారికి ఈ విషయం స్పష్టంగా బోధపడుతుంది. జగన్ తన ప్రసంగంలో భాగంగా కూటమి సర్కార్ చేస్తున్న ఎనిమిది రకాల వంచనలను అష్టకుట్రలుగా పేర్కొంటూ వాటిని జనం ముందుంచారు. ఒకటి: నామినేషన్ల ఘట్టానికంటే ముందుగానే వైసీపీ అభిమానులను బెదిరించి ఎవరూ పోటీ చేయకుండా, చేసినవారికి సాయపడకుండా ఉండేలా హెచ్చరించారు. రెండు: నామినేషన్ వేసిన అభ్యర్థుల వెంట నడవకుండా పార్టీ నేతలను ముందుగానే గృహనిర్బంధం చేశారు. మూడు: కూటమి దండు నామినేషన్ కేంద్రాల్లో మోహరించి వైసీపీవాళ్లు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. వారికి అండగా పోలీసులు కొలువుదీరారు. నాలుగు: ఖాకీల కనుసన్నల్లోనే ప్రత్యర్థుల నామినేషన్ పత్రాలను లాగేసుకొని చించి పారేశారు.
కొన్నిచోట్ల ఆర్వోల చేతికి అందిన పత్రాలను కూడా లాక్కున్నారు. చింపేశారు. అధికారులు వినోద కాలక్షేపం చేశారు. ఐదు: వైసీపీ నామినేషన్లకు ముగ్గురిని మించి గేటు దాట కుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. లోపల మాత్రం కూటమి దండు దాడికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఆరు: దాడి చేసినవాళ్లను వదిలేసి దాడికి గురైన వైసీపీ వాళ్ల మీదనే పోలీసులు కేసులు పెడుతున్నారు. ఏడు: స్క్రూటినీ పేరుతో సక్రమంగా ఉన్న వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను ఏదో సాకుతో తిరస్కరిస్తున్నారు. కొన్నిచోట్ల అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేసి విత్‌డ్రా చేసుకున్నట్టు చెబుతున్నారు. ఎనిమిది: అభ్యర్థు లను నయానో భయానో లొంగదీసుకొని విత్‌డ్రా చేయించడం. నామినేషన్ల పరిశీలన ఘట్టం వరకే ఈ ఎనిమిది రకాల కుట్ర లను జగన్ బయటపెట్టారు. పోలింగ్, కౌంటింగ్ దాకా ఇంకా చాలా స్టోరీ మిగిలే ఉన్నది.
జగన్ లేవనెత్తిన ఈ అష్టకుట్రల గురించి ఒక్కమాటైనా చంద్రబాబు మాట్లాడలేదు. పదహారేళ్లుగా ఆయన పార్టీ, యెల్లో మీడియా అమలు చేస్తున్న జగన్ వ్యక్తిత్వ హనన ఎజెండాకే చంద్రబాబు ఈ సందర్భాన్ని కూడా వాడుకున్నారు. ఎనిమిది అంశాలంటూ చంద్రబాబు మాట్లాడలేదుగానీ, ఆయన ప్రసంగ సారాంశంలోని ఎనిమిది అంశాలను అనుకూల మీడియా హైలైట్ చేసి ప్రసారం చేసింది. ఆ అష్టపది ఏమిటో చూడండి. ఒకటి: చదువు కోసం అమెరికా పంపిస్తే జగన్ తిరుగుటపాలో ఇంటికి వచ్చాడు. రెండు: వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్‌ను బెంగళూరుకు పంపించేశారు. మూడు: తల్లితో, చెల్లితో ఆస్తి తగాదాలు పెట్టుకున్నాడు. నాలుగు: పౌరుడిగా తన బాధ్యతల్లో విఫలమయ్యాడు. ఐదు: ముఖ్యమంత్రిగా విఫలమయ్యాడు. ఆరు: అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా విఫలమయ్యాడు. ఏడు: ఎన్నికల్లో విధ్వంసానికి కుట్ర పన్నాడు. ఎనిమిది: బాబాయ్ హత్యకు కుట్ర. ఈ ఆరోపణల్లో నిజాలేమిటీ, నీలాప నిందలేమిటీ అనే విషయాన్నిక్కడ పక్కనబెడదాం. కానీ, ఈ సందర్భమేమిటి? ప్రతిపక్ష నేత ఆందోళన ఏమిటి? ముఖ్యమంత్రి నుడివిన పలుకుల మర్మం ఏమిటి?
చంద్రబాబు మీడియా సమావేశం తర్వాత వైసీపీ ఆరోప ణలు ప్రత్యక్షర సత్యాలని తటస్థులు కూడా విశ్వసించే పరిస్థితి ఏర్పడింది. ఎలక్ట్రానిక్ మీడియా పెద్దగా కవరేజ్ ఇవ్వలేదు గానీ, కూటమి సర్కార్ అరాచకాలను ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా తీవ్రంగానే ఎండగట్టాయి. రెండు పార్టీల రాష్ట్ర కార్య దర్శులు శ్రీనివాసరావు, ఈశ్వరయ్య ఉమ్మడిగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం పాలకపక్షం కొమ్ముకాస్తున్న వైనంపై ధ్వజ మెత్తారు. ప్రతిపక్ష నేత కేవలం ఎనిమిది కుట్రల గురించి వివరించడానికే పరిమితం కాలేదు. రాష్ట్రం రావణకాష్టంగా మారిన వైనాన్ని సోదాహరణంగా ప్రస్తావించారు. తాను చేసిన ప్రతి ఆరోపణకు సాక్ష్యంగా విజువల్స్‌ను ప్రదర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పెడచెవిన పెట్టి ఎన్నికల సంఘం చంద్ర బాబు సేవలో ఎలా తరిస్తున్నదో విడమరిచి చెప్పారు.
నామినేషన్లు వేయలేకపోయిన వారికి మళ్లీ అవకాశం ఇవ్వా లని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అభ్యర్థులకు పోలీసు భద్రత కల్పించాలని చెప్పింది. ఆటంకాలు, దాడుల వల్ల 19 మునిసిపాలిటీల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేక పోయారు. మరో నాలుగు మునిసిపాలిటీల్లో స్క్రూటినీ పేరుతో తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని జగన్ చెప్పారు. కానీ, ఎన్నికల సంఘం మాత్రం ఒక్క మైదుకూరు మునిసిపాలిటీ, మరో నాలుగు మునిసిపాలిటీల్లో పరిమిత సంఖ్యలో వార్డులకు మాత్రమే రీ నామినేషన్లకు అవకాశం ఇచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా జగన్ ఎత్తిచూపారు.
చంద్రబాబు మాత్రం తనకు అలవాటైన జగన్ వ్యక్తిత్వ హనన దండకాన్నే మరోమారు పఠించారు. ఎటువంటి ఆధా రాలు, సాక్ష్యాలు లేని జనరల్ స్టేట్మెంట్లనే వల్లెవేశారు. మేన కోడలి పెళ్లికి జగన్ ఆటంకాలు కల్పిస్తున్నాడని ఓ యెల్లో పత్రిక అచ్చేసిన అభాండాన్ని తీసుకొని ప్రతిపక్ష నేతకు నైతిక విలువ ల్లేవని ఆరోపించారు. ఈ విషయంలో వాస్తవాలను వెలుగులోకి తెస్తూ వైసీపీ విడుదల చేసిన జగన్ లేఖ కుక్కకాటుకు చెప్పు దెబ్బలా యెల్లో మీడియాకు సమాధానమిచ్చింది. ఏపీ ఎన్నికల పరిణామాలు కేవలం రెండు పార్టీలకు సంబంధించిన సమస్య కాదు. యావత్తు ప్రజానీకానికీ, వారి హక్కులకూ సంబంధించిన సమస్య. ప్రజాస్వామ్య మనుగడకూ, రాజ్యాంగబద్ధ పాలన రక్షణకూ సంబంధించిన సమస్య. నియంతృత్వ ధోరణి ప్రజ్వ రిల్లితే పౌరహక్కులకే కాదు, ఆస్తులకూ, ప్రాణాలకూ కూడా రక్షణ ఉండదు. కనుకనే ఇటువంటి ధోరణిపై తిరగబడండి అంటూ జగన్ ఇచ్చిన పిలుపు స్వాగతించదగ్గది. ప్రజాస్వామ్య దోపిడీకి పిండారీల దండు తెగబడితే ప్రజా తిరుగుబాటుకు శృంగనాదం మార్మోగవలసిందే.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


