స్థలకాలాలను మనిషి శాసిస్తాడా లేక స్థలకాలాలే మనిషిని శాసిస్తాయా అని అడిగితే ఠక్కున సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే, సాధారణంగా ఆ అనుశాసనం భార్యా భర్తల సంబంధంలా పరస్పరమవుతుంది; మనిషి స్థలకాలాలను శాసిస్తున్నట్టు కనిపి స్తూనే, స్థలకాలాల శాసనానికి లొంగిపోతూ ఉంటాడు. ఈ క్షణాన ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో అదే జరుగుతోంది. ఇంటర్నెట్ వంటి అత్యాధునిక సాంకేతిక సంపత్తి అందుబాటులోకి వచ్చి స్థలకాలాలతో మనిషి సంబంధంలో అనూహ్యమైన వేగమూ, అనేకమైన మార్పులూ తెచ్చి అతణ్ణి అరచేతి బొమ్మలా ఆడిస్తోంది. తను కనిపెట్టిన సాంకేతికత చేతిలో ఒక్కోసారి తనే చిత్తవుతూ మనిషి కళ్ళు తేలేయవలసివస్తోంది.
ఎంతమంది గమనించారో కానీ, ఈ అత్యాధునిక సాంకేతికత పుణ్యమా అని కవి, రచయితలతో సహా ఏదో ఒక రచనారంగానికి చెందిన బుద్ధిజీవులందరూ ఈరోజున స్థలకాలసంబంధమైన ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక రచన ఆక్రమించుకునే జాగాను ఇక్కడ స్థలమనుకుంటే, ఆ రచన పాఠకులు, లేదా శ్రోతలముందుకు రావడానికి పట్టే సమయాన్ని కాలమనుకుందాం. లిపీ, లేఖనం అభివృద్ధి చెందని మౌఖిక సంప్ర దాయపు రోజుల్లో కవీ లేదా కథకుడూ– శ్రోతలూ ఎదురెదురుగా ఉండేవారు కనుక స్థల కాలసంబంధమైన అంతరాలు ఉండేవికావు. లేఖన సంప్రదాయం వచ్చి, తాళపత్రాల దశను కూడా దాటి కాగితం మీద రాయడమూ, ముద్రించడమూ, ఆపైన పత్రికలూ వచ్చాక కాగితం మీద ఆ రచన ఆక్రమించుకునే నిడివి రూపంలో స్థలమూ, పాఠకులకది చేరే వ్యవధి రూపంలో కాలమూ ప్రముఖంగా అడుగుపెట్టాయి.
ఇలాంటి లేఖనసంప్రదాయం తాళపత్రాలతో మొదలుపెట్టి, వందల సంవత్సరాల పాటు కొనసాగిన తర్వాత మళ్ళీ మనం స్థలకాల అంతరాలకు అవకాశం లేని వెనకటి మౌఖిక సంప్రదాయపు రోజులకు చేరుకున్నాం! ఎలాగంటే, ఆ సంప్రదాయంలో కవులూ, కథకులూ తమ రచనను శ్రోతలకు తక్షణమే అందించినట్టుగా ఈరోజున ఇంట ర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాల్లో రచయితలు తమ రచనలను పాఠకులకు తక్షణమే అందించగలుగుతున్నారు; దానికి తోడు, లేఖన, ముద్రణానుభవాలకుభిన్నంగా ఈ మాధ్యమాల్లో స్థలపరిమితులు కూడా పూర్తిగా మాయమవుతున్నాయి. ఈవిధంగా రచనాకాలచక్రం చిత్రంగా తిరిగి బయలు దేరినచోటికే వచ్చింది!
మారిన ఈ పరిస్థితికి అనుగుణంగా తాము మారి, తమ రచనలను ఎలా మలచు కోవాలన్నదే ఈ రోజున ఎంతోమంది రచయితలు అప్రకటితంగా ఎదుర్కొంటున్న సమస్య. ఉదాహరణకే చూడండి, ఆయా రచనాప్రక్రియల్లో చేయి తిరిగినవారిలో అనేకులు నిన్నటివరకూ దిన, వార, మాస పత్రికలు నిర్దేశించిన స్థలకాలపరిమితులకూ, ప్రమాణాలకూ లోబడి రాయడానికి అలవాటుపడినవాళ్ళు; అలాగే తమ రచన పాఠకు లకు చేరేందుకు పట్టే వ్యవధికీ మానసికంగా సిద్ధమై ఉండేవారు. నేరుగా పుస్తకరూపంలో తమ రచనల్ని ముద్రించుకునేవారూ దాదాపు ఈ కోవలోకే వస్తారు.
కానీ ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల వ్యాప్తితో స్థలకాలపరిమితులే కాక, ప్రమాణాలను నిర్దేశించుకుని పరిష్కరణ బాధ్యత వహించే సంపాదకవర్గం కూడా మటుమాయమై ప్రతి రచయితా, కవీ, కథకుడూ తన ‘గోడ’కు తనే యజమానిగా, సంపాదకుడిగా అదనపు బాధ్యతలను మోయవలసివస్తోంది. రచన చేయడానికే తప్ప పాఠకులకు దానిని చేర్చడానికి పట్టే వ్యవధి క్షణాలకు కుదించుకుపోవడం ఒక సానుకూల పరిణామనుకున్నా, స్థలపరి మితులు మాయమైపోయిన స్థితిలో పాఠకుల సహనమే కొలమానంగా పరిమితులను నిర్ణయించుకోవలసిన బాధ్యతా రచనాకారులపైనే పడుతోంది. అంతేకాదు, పత్రికలవంటి మాధ్యమాలు నిర్దేశించిన చట్రంనుంచి రచనలు తప్పుకుని వస్తురూపాలూ, అభివ్యక్తుల పరంగా కొత్తరూపాలు ధరించడమూ జరుగుతోంది.
ఆపైన సామాజిక మాధ్యమాలు నిపుణరచయితలతో ప్రారంభించి, అరకొరగా అక్షరజ్ఞానం ఉన్నవారి వరకూ అందరికీ అందుబాటులోకి రావడంతో తమ స్థాయినీ, ప్రత్యేకతనూ నిలుపు కోవడం చేయి తిరిగిన రచనాకారులకు సవాలుగా మారుతోంది. స్థల, కాలనిర్బంధాలకు అతీతంగా తమవైన అద్భుత సృజనశక్తులను చాటుకుంటూ మహాకవులుగా, కథకులుగా, నవలాకారులుగా చిరకీర్తినందుకున్న చరిత్రా అనేకమంది సాహిత్యకారులకుంది కనుక, ఇప్పుడూ అదే జరగడం తథ్యమే కానీ, దానికి ఎంత వ్యవధి పడుతుందన్నదే ప్రశ్న!


