రాజస్థాన్‌లోని కోటాలో ఇద్దరు విద్యార్థుల అనుమానాస్పద మరణం కలకలంరేపింది. ప్రవేశ పరీక్షలకు ప్రిపేరయ్యేందుకు ప్రముఖ కోచింగ్ హబ్‌గా పేరు గాంచిన కోటా నగరంలో, ఒకే రోజు ఇద్దరు విద్యార్థులు మరణించడం కలకలం రేపింది. జేఈఈ విద్యార్థి పీజీలో ఉరి వేసుకుని చనిపోగా, నీట్‌కోసం సిద్ధమవుతున్న విద్యార్థి బాత్రూంలో అపస్మారక స్థితిలో పడి, ఆస్పత్రిలో కన్నుమూసిన ఘటన విద్యార్థులో తీవ్ర ఉద్వేగాన్ని రగిలించింది.
మధ్యప్రదేశ్‌లోని శివపురి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల అజిత్ ధాకడ్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష (JEE) కోసం సిద్ధమయ్యేందుకు ఆరు నెలల క్రితం కోటాకు వచ్చాడు. అజిత్ మరణాన్ని ఆత్మహత్యగా పోలీసులు పేర్కొంటున్నారు. మరో విద్యార్థి మరణంపై విచారణ కొనసాగుతోంది. అజిత్ తండ్రి ఇదివరకే మరణించగా, సోదరుడు శివపురిలో చదువుకుంటున్నాడు.
ఆదివారం ఉదయం 9 గంటలకు కోచింగ్ సెంటర్‌లో జరగాల్సిన పరీక్షకు అజిత్ హాజరుకాలేదు. రాత్రి 9 గంటల సమయంలో అతని రూమ్ తలుపులు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. జవాహర్ నగర్ పోలీసులు లోపలి నుంచి గడియ పెట్టి ఉన్న తలుపులు పగలగొట్టి చూడగా, అజిత్ అప్పటికే మృతి చెందాడు. ఘటనకు ముందు రోజు రాత్రే తల్లితో మాట్లాడానని, అంతా బాగుందని చెప్పాడని అజిత్ బాబాయి సీతారామ్ ధాకడ్ తెలిపారు. మరోవైపు అజిత్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు అనుమానిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాతే అసలు కారణం తెలుస్తుందని తెలిపారు.
గౌతమ్ కుమార్
బిహార్‌లోని లోని దర్భంగాకు చెందిన గౌతమ్ (19) నీట్ కోసం ప్రిపేరవుతున్నాడు. అతనికి ఇది రెండవ ప్రయత్నం కాగా, ఏడాదిన్నరగా కోటాలోని 'శ్రీజీ రెసిడెన్సీ' హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆదివారం రోజంతా గౌతమ్ టిఫిన్‌కు, లే భోజనానికి రాకపోయినా హాస్టల్ యాజమాన్యం గమనించలేదు. రాత్రి 10 గంటల సమయంలో కోటాలోనే ఉంటున్న బంధువుల అబ్బాయి వెళ్లి చూడగా, గౌతమ్ హాస్టల్ రూమ్ బాత్‌రూమ్‌లో స్పృహతప్పి పడిపోయి కనిపించాడు. వెంటనే MBS ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.
ఇదీ చదవండి: 1600 మీటర్లలో గెలుపు : ఉద్యోగం పందెంలో కవితకు ఓటమి
కుటుంబ సభ్యుల ఆరోపణలు
హాస్టల్ యాజమాన్యం, కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీవ్ర నిర్లక్ష్యం వహించాయని, సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రాణాలు దక్కేవని గౌతమ్ బంధువు అఖిలేష్ ఆరోపించారు. హాస్టల్ అడ్మినిస్ట్రేషన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గౌతమ్ మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని, నిర్లక్ష్యం ఆరోపణలను పరిశీలిస్తున్నామని డిఎస్పీ దేవేష్ భరద్వాజ్ తెలిపారు.
ఇదీ చదవండి: ఏడేళ్లకే 12 భాషలు : కుమార్తె పెంపకంలో హీరోయిన్ స్పెషాల్టీ ఇదే!
కాగా దేశవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మంది విద్యార్థులు పోటీ పరీక్షల శిక్షణ కోసం కోటాలో నివసిస్తున్నారు. ఐఐటీ-జేఈఈ (IIT-JEE), నీట్ (NEET) వంటి కఠినమైన పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులలో మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల ఘటనలు తీవ్రం కావడం ఆందోళన రేపుతోంది. ఈ రెండు మరణాలతో కలిపి ఈ ఏడాది (2026లో) కోటాలో నమోదైన ఇలాంటి సంఘటనల సంఖ్య 14కు చేరింది.


