ప్రస్తుతం విజయ్-రష్మిక జంటపై వస్తోన్న ట్రోల్స్ టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. కాఫీ విత్ కరణ్ షో తర్వాత వీరిద్దరిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. దీంతో ఈ వివాదంపై రష్మిక, విజయ్ కూడా స్పందించారు. తన వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు విరోష్ జంట. తాజాగా తమపై ట్రోల్స్ చేసినవారిపై ఫిర్యాదు చేశారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో తప్పుదోవ పట్టించే కంటెంట్ ప్రచారం జరుగుతోందని విరోష్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరపాలని కోరుతూ విజయ్ తరఫున మేనేజర్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. వీరికి సంబంధించిన కల్పిత కంటెంట్, మార్ఫింగ్ చేసిన స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. ట్రోల్స్‌కు సంబంధించిన లింక్స్, సాక్ష్యాలను సైబర్ క్రైమ్ పోలీసులకు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


