ప్రముఖ నటుడు అలీ సతీమణి జుబేదా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసి అలీ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు అలీ. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత హీరోగా, హాస్యనటుడిగా వందలాది సినిమాల్లో నటించారు. నటుడిగానే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ తనదైన ముద్ర వేశారు
సతీమణి జుబేదా సుపరిచితమే
అయితే అలీ సతీమణి జుబేదా కూడా ప్రేక్షకులకు సుపరిచితమే. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె.. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వంటల వీడియోలతో పాటు కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె వెల్లడించారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన యూట్యుబ్ ఛానెల్‌లో ప్రత్యేక వీడియో పంచుకుంది. ఈ దృశ్యాలు చూసిన అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, అలీ, జుబేదా దంపతులకు 1994 జనవరి 23న వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఫాతిమా రమీజున్, జువేరియా మీథీతో పాటు ఒక కుమారుడు మహమ్మద్ అబ్దుల్ సుభాన్ ఉన్నారు.

(ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. విరోష్ జంటకు అండగా ఫ్యాన్స్..)


