బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సంబంధించిన స్టింగ్ వీడియో కేసులో దర్యాప్తు సందర్భంగా మహిళా పోలీసు అధికారిపై దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో అతడి భార్య, ఆమె స్నేహితురాలు తనపై దాడి చేశారని బైడరహళ్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా పోలీసు అధికారి కవిత జి.ఎం. ఫిర్యాదు చేశారు. ఈ ఘటన అక్టోబర్ 23న బెంగళూరులోని యశ్వంత్‌పురలో చోటుచేసుకుంది.
కవిత అక్టోబర్ 24న ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. భరత్ నగర్‌లోని లక్ష్య రాయల్ మేనర్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మోహన్ గౌడ ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు ఆమె తన పోలీసు బృందంతో కలిసి వెళ్లారు.
సోదాల సమయంలో మోహన్ గౌడ భార్య పవిత్ర సహకరించలేదని, తన మొబైల్ ఫోన్‌ను అప్పగించేందుకు నిరాకరించారని కవిత ఆరోపించారు. ఈ క్రమంలో పవిత్ర, ఆమె స్నేహితురాలు తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘర్షణలో తన బంగారు బ్రాస్‌లెట్ కనిపించకుండా పోయిందని కవిత తెలిపారు. అయితే, పోలీస్ స్టేషన్‌కు తిరిగి వచ్చిన తర్వాతే ఈ విషయం గుర్తించినట్లు చెప్పారు. దీంతో సోదాల సమయంలో చిత్రీకరించిన వీడియోను పరిశీలించారు. నిందితుడి గదిలోని మంచంపై తన బ్రాస్‌లెట్ పడిపోయినట్లు ఆ వీడియోలో గుర్తించారు.
ఈ ఘటనపై పోలీసులు పవిత్రతో పాటు ఆమె స్నేహితురాలిపై కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకునేందుకు దాడి చేయడం లేదా నేరపూరిత బలప్రయోగానికి పాల్పడినట్లు భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్ 132 కింద అభియోగాలు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా, సిద్ధరామయ్యకు సంబంధించిన స్టింగ్ వీడియోను పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోహన్ గౌడ, ఇతరుల ఆచూకీ గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో వీడియో పంపిణీకి సంబంధించిన దర్యాప్తుతో పాటు, సోదాల సమయంలో పోలీసు అధికారిపై దాడి జరిగిందన్న ఆరోపణలపై తదుపరి చర్యలు కీలకంగా మారాయి.
ఇదీ చదవండి: మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌పై టీడీపీ గూండాలు దాడికి యత్నం


