బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా ఆదివారంనాటి అధ్యక్ష ఎన్నికల్లో సాధించిన విజయంతో నిండా షాక్‌లో మునిగిపోయిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... 120 మంది సభ్యులుండే ఇజ్రాయెల్ పార్లమెంటు కెనెసెట్‌కు మంగళవారం జరిగే ఎన్నికల్లో తన ఆప్తమిత్రుడు ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ పరిస్థితి ఏమవుతుందోనని బెంగటిల్లి ఉంటారు. మూడేళ్ల క్రితమైతే నెతన్యాహూ ఓటమి ఖాయమని అందరూ ఘంటాపథంగా చెప్పేవారు. ఎందుకంటే న్యాయసంస్కరణల పేరుతో సుప్రీంకోర్టు అధికారాలకు కోత పెడుతూ ఆయన ప్రభుత్వం 2023లో చట్టం తెచ్చాక దేశంలో ఉద్యమాలు పెల్లుబికాయి. తనపై ఉన్న అవినీతి కేసుల్ని తప్పించుకోవటానికే ఆ చట్టం తెచ్చారని అన్ని వర్గాలూ విరుచుకుపడ్డాయి.
న్యాయమూర్తుల నియామకాన్ని ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చు కోవటంతో పాటు... పార్లమెంటు తెచ్చే ఏ చట్టాన్నయినా రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించటానికి దానికుండే అధికారాన్ని కూడా ఆ చట్టం రద్దు చేసింది. సుప్రీంకోర్టు తీర్పును సాధారణ మెజారిటీతో పార్లమెంటు తోసిపుచ్చడానికి కూడా అది వీలుకల్పించింది. రెండేళ్ల క్రితం ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు 8–7 మెజారిటీతో కొట్టేసింది. పర్యవసానంగా అవినీతి కేసుల కత్తి నెతన్యాహూపై వేలాడుతోంది. 2023 అక్టోబర్‌లో ఉగ్రవాద సంస్థ హమాస్ పలువురు ఇజ్రాయెల్ పౌరుల్ని హతమార్చి, అనేకమందిని కిడ్నాప్ చేశాక పరిస్థితి మారింది. గాజాపై నెతన్యాహూ సైన్యాన్ని నడిపించి వేలాదిమంది పౌరుల్ని ఊచకోత కోయించారు. గ్రామాలకు గ్రామాలు నేలమట్టం అయ్యాయి. తాను తప్ప ఎవరూ దేశాన్ని రక్షించలేరన్న అభిప్రాయం కలగజేయటానికి ఆయన మూడేళ్లుగా ఆ నరమేథాన్ని సాగిస్తూనే ఉన్నారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా నెతన్యాహూ దేశ రాజకీయాలను శాసిస్తున్నారు. అన్ని సర్వేలూ అధికార కూటమి లేదా విపక్ష కూటమి పూర్తి స్థాయి మెజారిటీ తెచ్చుకునే అవకాశం లేదని చెబుతున్నాయి. ఈ అనిశ్చితి కూడా నెతన్యాహూకే తోడ్పడుతుంది. ఇజ్రాయెల్‌లో మితవాద పక్షాలదే ఎప్పుడూ పైచేయి. అయితే గత ఎన్నికల్లో నెతన్యాహూ నెలకొల్పినలాంటి అతి మితవాద ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. అందరూ దూరంపెట్టిన అతి తీవ్ర మతవాద పక్షాలను అధికారాన్ని నిలుపుకోవటం కోసం, జైలుశిక్ష తప్పించుకోవటం కోసం ఆయన చేరదీశారు. ఆ పక్షాలకు ఉదారవాద విధానాలు ప్రబల శత్రువులు. దౌత్యంకన్నా యుద్ధమే మేలైనదని వారి దృఢవిశ్వాసం.
పాలస్తీనా భూభాగాన్ని మొత్తం స్వాధీనం చేసుకుని విశాల ఇజ్రాయెల్ నెలకొల్పటం వారి ధ్యేయం. ఆ సిద్ధాంతాన్ని సాకారం చేసి, దేశంలో తిరుగులేని నేతగా నిలిచిపోవాలని నెతన్యాహూ వాంఛించారు. హమాస్ దాడి ఆయనకు ఈ అవకాశాన్నిచ్చింది. అయితే మూడేళ్లుగా నిరాయుధ గాజా పౌరులపై సాగిస్తున్న ఊచకోత కొంతమేర విజయాన్నిచ్చి నట్టు కనబడ్డా, ప్రతిఘటన మాత్రం చల్లారలేదు. దేశం మొత్తం యుద్ధంలో చిక్కుకుంది. పాలస్తీనా పౌరుల వరకూ ఇజ్రాయెల్‌లో ఎవరొచ్చినా ఒకటే. సిద్ధాంతాలు వేరైనట్టు కనబడినా, ఆ పార్టీలన్నీ పాలస్తీనా స్వతంత్ర ప్రతిపత్తికి వ్యతిరేకం. హమాస్ దాడి, గాజా ఊచకోత అనంతరం ఇజ్రాయెల్ సమాజం మరింత పిడివాదంలోకి జారుకుంది. అందుకే విపక్షాలు గాజాకు భిన్నమైన పరిష్కారం చెప్పడంలేదు. న్యాయసంస్కరణలు రద్దు చేస్తామని మాత్రమే అంటున్నాయి.
నెతన్యాహూ కోసం ట్రంప్ తన వంతుగా సాయం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటేయటానికి అమెరికాలో స్థిరపడిన ఇజ్రాయెలీ పౌరులు మందలుగా పోవటం ఆయన చలవే. అటు బ్రెజిల్‌లో లూలా ఓటమికి ప్రయత్నించినట్టే ఇక్కడా చేతనైనంత చేస్తున్నారు. కానీ జైలుశిక్ష అనుభవిస్తున్న బోల్సొనారో కుమారుడు ఫ్లేవియో ఓటమి పాలు కాకతప్పలేదు. ఇప్పుడు నెతన్యాహూ భవితవ్యం ఏమిటన్న ఉత్కంఠ అందరిలో ఉంది. నెతన్యాహూ ఏలుబడిలో ఇజ్రాయెల్ తెంపరితనం పెరిగింది. అది మిత్రుల సలహాలను కూడా బేఖాతరు చేస్తుందనీ, తమకు వీసమెత్తు విలువీయదనీ పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. నెతన్యాహూ చిత్తుగా ఓడిపోవాలని ఆ దేశాల జనం కూడా కోరుకుంటున్నారు. దారీతెన్నూ లేని ఈ నిరంతర యుద్ధం అంతిమంగా దేశ భవిష్యత్తుకు చేటు తెస్తుందని ఇజ్రాయెల్ పౌరులు గ్రహిస్తారా లేదా అన్నది ఈ ఎన్నికల ఫలితాలు తేలుస్తాయి.


