న్యూఢిల్లీ: బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా మరోసారి విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. అక్టోబర్ 25న జరిగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో కుమారుడు ఫ్లావియో బోల్సొనారోను ఓడించారు. దీంతో 80 ఏళ్ల లూలా నాలుగోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విజయం బ్రెజిల్‌తో భారత్ సంబంధాలకే కాకుండా అంతర్జాతీయ రాజకీయాలపైనా ప్రభావం చూపనుంది. లాటిన్ అమెరికాలో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న బ్రెజిల్.. బ్రిక్స్‌లోనూ కీలక సభ్యదేశం. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, కీలక ఖనిజాలు, అంతర్జాతీయ పాలన వంటి రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత విస్తరించేందుకు లూలా విజయం అవకాశాన్ని కల్పిస్తోంది.
వాణిజ్యానికి మరింత ఊతం
భారత్, బ్రెజిల్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2025లో 25 శాతానికిపైగా పెరిగి 15.21 బిలియన్ డాలర్లకు చేరింది. 2024లో ఇది 12.20 బిలియన్ డాలర్లుగా ఉంది. 2026 తొలి ఆరు నెలల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం సుమారు 8.77 బిలియన్ డాలర్లకు చేరి, అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 37 శాతం వృద్ధి నమోదైంది. 2025 జులైలో ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ పర్యటన సందర్భంగా ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఎగుమతులు, దిగుమతుల్లో..
భారత్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధాలు, రసాయనాలు, వ్యవసాయ రసాయనాలు, ఇంజినీరింగ్ వస్తువులు, వస్త్రాలు బ్రెజిల్‌కు ఎగుమతి అవుతున్నాయి. బ్రెజిల్ నుంచి ముడి చమురు, సోయాబీన్ నూనె, చక్కెర, పత్తి, ఇనుప ఖనిజం భారత్‌కు వస్తున్నాయి. ఔషధాలు, వ్యవసాయం వంటి రంగాల్లో మార్కెట్ అవకాశాలను విస్తరించడంతోపాటు భారత్-మెర్కోసర్ వాణిజ్య ఒప్పందాన్ని మరింత బలోపేతం చేయడానికి అవకాశం ఉంది. అయితే సుంకాలు, నియంత్రణ నిబంధనలు, రవాణా వ్యయాలు, మార్కెట్ ప్రవేశానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది.
బ్రిక్స్‌లో ఉమ్మడి ప్రయోజనాలు
బ్రిక్స్ కూటమిలో భారత్, బ్రెజిల్ కలిసి పనిచేయడం అంతర్జాతీయ వేదికలపై కీలకంగా మారనుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాలని ఇరు దేశాలు కోరుతున్నాయి. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక, రాజకీయ వాస్తవాలకు అనుగుణంగా ఈ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్నది వాటి అభిప్రాయం. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది ప్రాధాన్యం కలిగిన అంశం.
స్థానిక కరెన్సీల వినియోగం
అంతర్జాతీయ వాణిజ్యంలో స్థానిక కరెన్సీల వినియోగాన్ని పెంచాలని లూలా గతంలో ప్రతిపాదించారు. భారత్-బ్రెజిల్ వాణిజ్య లావాదేవీలను అమెరికా డాలర్లకు బదులుగా రూపాయి, బ్రెజిలియన్ రియల్ కరెన్సీల్లో నిర్వహించే అవకాశాన్ని పరిశీలించవచ్చని పేర్కొన్నారు. అయితే బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీని రూపొందించే ప్రయత్నం చేయడం లేదని కూడా స్పష్టం చేశారు. స్థానిక కరెన్సీల్లో చెల్లింపులు సాధ్యమైతే మారకపు ఖర్చులను తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ, మారకపు రేట్లలో మార్పులు, చెల్లింపుల వ్యవస్థలు, వాణిజ్య అసమతుల్యత వంటి అంశాలను పరిష్కరించాల్సి ఉంటుంది. దీనివల్ల డాలర్ ఆధారిత లావాదేవీలు వెంటనే ముగిసిపోతాయని భావించకూడదు.
ఇంధనం, సాంకేతికతలో కొత్త అవకాశాలు
లూలా 2026 ఫిబ్రవరిలో భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా డిజిటల్ భాగస్వామ్యం, కీలక ఖనిజాలు, అరుదైన భూ మూలకాలు, ఔషధ రంగ సహకారం, గనుల సరఫరా వ్యవస్థలకు సంబంధించిన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. తయారీ రంగాన్ని విస్తరించడంతోపాటు దిగుమతి చేసుకునే కీలక ముడి పదార్థాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్న భారత్ లక్ష్యాలకు ఈ సహకారం ఉపయోగపడనుంది. వ్యవసాయం, జీవ ఇంధనాలు, ఇంధన రంగాల్లో బ్రెజిల్‌కు ఉన్న అనుభవం.. డిజిటల్ మౌలిక సదుపాయాలు, సమాచార సాంకేతికత, ఔషధాలు, ఇంజినీరింగ్‌లో భారత్ సామర్థ్యాలతో కలిస్తే ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరుతుంది.
ప్రధాని మోదీ ఏమన్నారంటే..
పునరుత్పాదక ఇంధనం, ఇథనాల్ మిశ్రమం, స్థిరమైన విమాన ఇంధనాల రంగాల్లోనూ సహకారానికి అవకాశాలున్నాయి. పరిశోధన, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీపై దృష్టి సారిస్తే సంబంధాలు కేవలం వస్తువుల కొనుగోలు, అమ్మకాలకే పరిమితం కావు. భారత్-బ్రెజిల్ సంబంధాల బలోపేతం ద్వారా లాటిన్ అమెరికాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించవచ్చు. ప్రధాని మోదీ 2026 ఫిబ్రవరిలో లూలా భారత పర్యటన సందర్భంగా మాట్లాడుతూ.. భారత్, బ్రెజిల్ కలిసి పనిచేస్తే గ్లోబల్ సౌత్ గొంతుక మరింత బలంగా, ఆత్మవిశ్వాసంతో వినిపిస్తుందని పేర్కొన్నారు. ఈ దౌత్యపరమైన అవగాహనను ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలుగా మార్చుకోవడమే ఇప్పుడు ఇరు దేశాల ముందున్న ప్రధాన సవాలు.
ఇదీ చదవండి: బ్రెజిల్ అధ్యక్షుడిగా లూసియో ఇనాసియో లులా డా సిల్వా


