అయిదేళ్లుగా పరస్పరం తలపడుతున్న రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య సామరస్యం కుదర్చటానికి తూర్పు యూరోప్ వైపు వెళ్లకుండా... తన చలవతో అంటుకున్న పశ్చిమాసియా ప్రాంతాన్ని చల్లార్చడానికి పోకుండా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మధ్య ఆసియా దేశాలవైపు దృష్టి సారించారు. దాంతోపాటు మన దేశంలోనూ మూడు రోజులు పర్యటించారు. ఆ రెండు ఘర్షణల్లోనూ ఇంతవరకూ ఎక్కడా రుబియో పేరు వినబడలేదన్నది వాస్తవమే అయినా... ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారుకూడా కనుక, ఆ కోణంలో అమెరికా ఆలోచనేమిటన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. 70వ దశకంలో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ తర్వాత ఆ జోడు పదవుల్ని దక్కించుకున్న ఖ్యాతి రుబియోది. ఆ మాటెలావున్నా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక గత రెండేళ్లుగా భారత్‌పై విరుచుకుపడటమే చూసిన వారందరికీ అమెరికా తాజాగా ప్రేమ ఒలకబోయడం ఆశ్చర్యంగానే ఉంది. నిజానికి భారత్‌లో మంగళవారం అడుగుపెట్టడానికి ముందే ఉజ్బెకిస్తాన్ పర్యటనలో భారత్, అమెరికాలు రెండూ వాణిజ్య ఒప్పందానికి ‘చాలా చేరువ’లో ఉన్నాయని ఆయన ప్రకటించారు.
వచ్చాక కూడా మన దేశంపై ఎంతో సానుకూలంగా మాట్లాడారు. రివాజుకు భిన్నంగా ఆయన ఢిల్లీలో కాక ముంబైలో అడుగుపెట్టారు. అంబానీ, అదానీలతో పాటు టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌ను కలిశారు. విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్‌తో ద్వైపాక్షిక సమావేశం తర్వాత ఇంధన భద్రత, రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు అంశాల్లో మనకున్న అవసరాలేమిటో అర్థం చేసుకున్నట్టు కనబడ్డారు. ఈమధ్య అమెరికా రష్యా, ఇరాన్ ఆంక్షల చట్టాన్ని తెచ్చినప్పుడు మన దేశం గట్టిగానే స్పందించింది. ఇది ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపగలదని చేసిన ప్రకటన అమెరికాపై ‘తగినంత’ ఒత్తిడి కలిగించిందని రుబియో వైఖరి తెలియజేస్తోంది. వాణిజ్య ఒడంబడిక కోసమే ఆ చట్టంనుంచి భారత్‌కు 60 రోజుల మినహాయింపునిచ్చామని కూడా ఉజ్బెకిస్తాన్‌లో ఆయన చెప్పారు. అసలు సంగతేమంటే... ఆ చట్టం వచ్చాక అమెరికాయే రష్యా డీజిల్ కొనాలని నిర్ణయించింది.
పెద్దన్న పద్ధతిలో అందరిపైనా పెత్తనం చలాయించాలని చూడటం, తరచు ఈసడించటం దౌత్యరంగంలో పనికిరాదని ట్రంప్ గ్రహించటంవల్లే రుబియోను భారత్ పంపారా అన్నది చూడాల్సివుంది. అమెరికా సెనేట్‌లో మన దేశానికి అనుకూలంగా వ్యవహరించే రిపబ్లికన్ పార్టీ నేతల్లో రుబియో ఒకరు. తనవల్ల చెడిన ద్వైపాక్షిక సంబంధాలను మరమ్మతు చేయడానికి ఆయనే తగిన వ్యక్తి అని ట్రంప్ అనుకుని ఉండొచ్చు. లేదా అమెరికాలో వచ్చే నెల జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో ఏదోమేర విజయం సాధించాలంటే ‘చాలా బాధ్యతాయుతంగా’ వ్యవహరిస్తున్నట్టు కనబడటం ముఖ్యమని భావించి ఉండొచ్చు. ముంబైలో ఇరు దేశాలమధ్యా ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానంవంటి అంశాల్లో చర్చలు జరిగాయి. జైశంకర్–రుబియో భేటీ
తర్వాత యూఏఈ విదేశాంగమంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌ను కూడా చేర్చుకుని త్రైపాక్షిక సమావేశం నిర్వహించారు.
రుబియో పర్యటన ఆంతర్యం ఏమైనా... మిత్ర దేశంగా ఉంటూ కూడా వివిధ అంశాల్లో అమెరికా తీరుతెన్నుల గురించీ, అందువల్ల మన దేశానికెదురవుతున్న సమస్యల గురించీ ఆయనకు నిష్కర్షగా చెప్పడం అవసరం. హెచ్1బి వీసాల వ్యవహారం కావొచ్చు... ఎడాపెడా వేసే సుంకాలు కావొచ్చు... పాకిస్తాన్‌ను అది దువ్వుతున్న తీరు కావొచ్చు– అన్నీ మన దేశ ప్రయోజనాలను దెబ్బతీసేవే. వీటిని రుబియో దృష్టికి తీసుకొచ్చివుంటే మంచిదే. చాన్నాళ్లుగా అమెరికా క్వాడ్ ఊసెత్తడం మానేసింది. పైగా చైనాకు దగ్గరవుతోంది. ఎందుకో మళ్లీ క్వాడ్‌ను తెరపైకి తెస్తోంది. వచ్చేనెల జరగబోయే ఆగ్నేయాసియా దేశాల (ఆసియాన్) సమావేశంలో దానికి ప్రాణప్రతిష్ఠ చేయాలని చూస్తోంది. ఈ విషయంలో స్వీయ ప్రయోజనాలకే మనం ప్రాధాన్యతనీయాలి. నిలకడ లేకుండా, ఒక విధానమంటూ పాటించకుండా అమెరికా పాటిస్తున్న అరాచక దౌత్యం ఆగేవరకూ మన దేశం జాగ్రత్తగా అడుగులేయటం అత్యవసరం.


