అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధంలోకి దిగడంపై ఆయన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అసంతృప్తిగా ఉన్నట్లు ‘ది అట్లాంటిక్’ కథనం వెల్లడించింది. ఈ యుద్ధంపై తన అభ్యంతరాలను ఆయన తండ్రితో ప్రైవేటు సంభాషణల్లో పలుమార్లు వ్యక్తం చేసినట్లు పేర్కొంది.
2024 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే అమెరికాను మరో మధ్యప్రాచ్య యుద్ధంలోకి తీసుకెళ్లవద్దని డాన్ జూనియర్ తన తండ్రి ట్రంప్‌ని కోరినట్లు సమాచారం. అప్పట్లో ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసిన సందర్భంలో.. ట్రంప్ నాయకత్వం వల్ల అమెరికా ఇరాన్‌తో పూర్తిస్థాయి యుద్ధంలోకి వెళ్లకుండా ఉందని ఆయన సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.
అయితే ప్రస్తుతం ఇరాన్‌తో సుదీర్ఘ సైనిక ఘర్షణలో అమెరికా చిక్కుకోవడంతో ట్రంప్ మద్దతుదారుల్లోనూ విభేదాలు పెరుగుతున్నట్లు సదరు కథనం తెలిపింది. విదేశీ యుద్ధాల కంటే దేశీయ సమస్యలకే ప్రాధాన్యం ఇవ్వాలని కొందరు MAGA మద్దతుదారులు భావిస్తున్నారు. దివంగత కన్జర్వేటివ్ నేత చార్లీ కిర్క్ కూడా ఈ యుద్ధాన్ని వ్యతిరేకించినట్లు కథనం పేర్కొంది.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ యుద్ధంపై ప్రైవేటుగా సందేహాలు వ్యక్తం చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఇరాన్‌లో వైమానిక దాడుల ద్వారా ప్రభుత్వ మార్పు సాధ్యమేనా అనే అంశంపై సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలిపింది.
ఇక మరోవైపు ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం.. ఇరాన్ విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును అమెరికాలోని 65 శాతం మంది ప్రజలు వ్యతిరేకించగా, 33 శాతం మంది మద్దతు తెలిపారు. అంతేకాదు యుద్ధం ఏడాదికి పైగా కొనసాగవచ్చని దాదాపు సగం మంది అంచనా వేస్తున్నట్లు సర్వే వెల్లడించింది. దీంతో ఈ ఘర్షణపై అమెరికాలో ప్రజా వ్యతిరేకత, రాజకీయ విభేదాలు పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: కారుతో ఢీకొట్టడంతో.. తీవ్ర గాయాలతో రెండు కాళ్లు కోల్పోయిన ఎంపీ!


