ట్రంప్ తెచ్చిన యుద్ధం: అమెరికాకు 3 లక్షల కోట్ల బిల్లు!! ఇకపై ప్రతీ నెలా మరో 25 వేల కోట్లు!
ఇరాన్‌పై యుద్ధానికి దిగినందుకు అమెరికా ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆరు నెలలు ముగిసినా.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇందుకోసం అమెరికా ఇప్పటిదాకా ఎంత ఖర్చు చేసిందో తెలుసా?.. మన కరెన్సీలో 3,00,00,00,00,00,000. అంటే మూడు లక్షల కోట్లు. ఇదే కాకుండా సైన్యానికి భారీగా నష్టం వాటిల్లింది. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా నెలకు రూ.25 వేల కోట్లు చెల్లించుకుంటూనే పోవాలంట!.డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ యుద్ధం మొదలైంది. అయితే ఈ యుద్ధంతో ఇప్పటివరకు అమెరికా రక్షణ శాఖపై పడిన ప్రత్యక్ష వ్యయం ఏకంగా 38 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దాని లెక్క రూ.3.2 లక్షల కోట్లు. యుద్ధం ఇదే స్థాయిలో కొనసాగితే ప్రతి నెలా మరో 2–3 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ (CBO) తాజాగా అంచనా వేసింది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడం, అమెరికా భద్రతకు ముప్పును తొలగించడం లక్ష్యంగా ఈ దాడులకు ఆదేశించినట్లు ట్రంప్ అప్పట్లో ప్రకటించారు. అయితే కొన్ని వారాల్లో ముగుస్తుందని భావించిన ఈ సైనిక చర్య సుదీర్ఘ ఘర్షణగా మారింది. సెప్టెంబర్ నాటికీ పోరాటం పూర్తిగా ఆగలేదు. తాజాగా ట్రంప్ ఈ యుద్ధాన్ని ప్రారంభించిన నిర్ణయంపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని చెప్పారు. నెలకు మరో రూ.25 వేల కోట్లు!యుద్ధం మరింత కొనసాగితే అమెరికా ఖజానాపై భారం ఆగేలా కనిపించడం లేదు. తక్కువ తీవ్రతతో పోరాటం కొనసాగితే నెలకు సుమారు 2 బిలియన్ డాలర్లు, దాడులు మళ్లీ తీవ్రరూపం దాల్చితే దాదాపు 3 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని సీబీవో తెలిపింది. అంటే భారత కరెన్సీలో చూస్తే ఒక్క నెలలోనే దాదాపు రూ.17 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఈ యుద్ధంలో అమెరికా ఖజానాకే కాదు.. ఆ దేశ సైన్యానికీ భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ ప్రతిదాడుల్లో అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. పలు విమానాలు, సైనిక పరికరాలు నష్టపోయినట్లు నివేదికలు వెలువడ్డాయి. మరోవైపు ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను అడ్డుకునేందుకు అమెరికా భారీ సంఖ్యలో ఇంటర్సెప్టర్లను ప్రయోగించాల్సి వచ్చింది. దీంతో యుద్ధం సాగుతున్న కొద్దీ అమెరికా సైనిక సామర్థ్యాలపై, ముఖ్యంగా కీలక ఆయుధ నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది.అసలు ఖర్చు.. క్షిపణులే!ఈ యుద్ధంలో అమెరికా భారీగా క్షిపణులు, ఇంటర్సెప్టర్లను ప్రయోగించింది. ఆగస్టు 1 వరకు ఉపయోగించిన ఆయుధాలను తిరిగి సమకూర్చుకోవడానికే సుమారు 21.7 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని సీబీవో లెక్కించింది. ఇందులో ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైళ్లకు 7.3 బిలియన్, మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్లకు 13.1 బిలియన్ డాలర్లు, ఇతర ఆయుధాలకు 1.2 బిలియన్ డాలర్లు ఉన్నాయి. యుద్ధంలో కోల్పోయిన పరికరాలను భర్తీ చేయడానికి మరో 1.9 బిలియన్ డాలర్లు అవసరమని పేర్కొంది. ఆయుధ నిల్వలకు గండి..డబ్బు ఖర్చవడమే కాదు.. అమెరికా ఆయుధ నిల్వలపైనా యుద్ధం ప్రభావం పడుతోంది. ముఖ్యంగా క్షిపణి రక్షణ ఇంటర్సెప్టర్ల నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని సీబీవో పేర్కొంది. వాటిని పూర్తిస్థాయిలో తిరిగి సమకూర్చుకోవడానికి ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రక్షణ కార్యాలయం పెంటగాన్ మాత్రం తమ వద్ద అధ్యక్షుడి వ్యూహాత్మక అవసరాలకు సరిపడా ఆయుధాలు ఉన్నాయని చెబుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా పెంటగాన్ ఇన్స్పెక్టర్ జనరల్ నివేదిక మాత్రం.. యుద్ధం కారణంగా కీలక ఆయుధాల్లో ‘స్ట్రాటజిక్ ఇన్వెంటరీ షార్ట్‌ఫాల్స్’ ఏర్పడ్డాయని పేర్కొంది. హర్ముజ్ మూసివేత.. ప్రపంచానికి మరో దెబ్బఇరాన్తో యుద్ధం ప్రభావం అమెరికా సరిహద్దులకే పరిమితం కాలేదు. హార్ముజ్ జలసంధిలో రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. యుద్ధం తర్వాత బ్రెంట్ క్రూడ్ ధర రెండో త్రైమాసికంలో బ్యారెల్‌కు 103 డాలర్ల వరకు చేరింది. ఇంధన ధరల పెరుగుదల ఇతర వస్తువులు, రవాణా ఖర్చులపై ప్రభావం చూపడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉందని సీబీవో తెలిపింది. 2027 తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం గతంలో వేసిన అంచనాల కంటే 0.5 శాతం పాయింట్లు ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఇంకా అసలు బిల్లు రాలేదు!సీబీవో చెప్పిన 38 బిలియన్ డాలర్లలో యుద్ధానికి సంబంధించిన ప్రతి ఖర్చూ లేదు. అమెరికా స్థావరాలకు జరిగిన నష్టం, భవిష్యత్‌లో వాటి మరమ్మతులు, యుద్ధానికి అప్పులు తీసుకుంటే చెల్లించాల్సిన వడ్డీ, సైనికులకు భవిష్యత్‌లో అందించాల్సిన వైద్య, వైకల్య ప్రయోజనాలు వంటి ఖర్చులు ఇందులో పూర్తిగా లేవు. రక్షణ శాఖ నుంచి సీబీవో కోరిన సమాచారానికి పూర్తి సహకారం అందకపోవడంతో ఈ అంచనాల్లో కొంత అనిశ్చితి కూడా ఉందని బడ్జెట్ ఆఫీస్ స్పష్టం చేసింది. అమెరికాకే కాదు.. డ్యామేజ్ ట్రంప్‌కు కూడా!యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్నది స్పష్టంగా లేకపోవడంతో ఈ బిల్లు చివరకు ఎంతకు చేరుతుందన్నది కీలక ప్రశ్నగా మారింది. మరోవైపు.. ఈ యుద్ధం ట్రంప్ రాజకీయ ప్రతిష్టపైనా ప్రభావం చూపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయనకున్న ప్రజాదరణ క్రమంగా తగ్గిపోయిందని రాయిటర్స్ లాంటి పలు ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయి. ఇరాన్ యుద్ధం, పెరిగిన ఇంధన ధరలు అమెరికన్లలో అసంతృప్తికి కారణమవుతున్నట్లు అవి వెల్లడించాయి.ముఖ్యంగా నవంబర్ మిడ్‌టర్మ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిపబ్లికన్ పార్టీలో ఆందోళన పెరిగిపోతోంది. యుద్ధ వ్యయం, పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, ఆయుధ నిల్వలపై ఒత్తిడి వంటి అంశాలు ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కీలకంగా మారనున్నాయి. ఒకవైపు యుద్ధాన్ని కొనసాగించాల్సిన వ్యూహాత్మక అవసరాన్ని ట్రంప్ సమర్థిస్తుండగా.. మరోవైపు పెరుగుతున్న ఖర్చు, ఆర్థిక భారం, ప్రజాభిప్రాయంపై దాని ప్రభావం ఆయన ముందున్న పెద్ద సవాళ్లుగా మారాయి.ఇదీ చదవండి: అమెరికా ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు!