బెంగళూరు: ఓ వైపు ప్రభుత్వ అనుబంధ నమ్మ క్లినిక్‌లో డాక్టర్‌గా ఉద్యోగం.. మరోవైపు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్య! నెలకు రూ.70 వేలకు పైగా జీతం తీసుకుంటూనే క్లినిక్ విధులకు దూరంగా ఉన్నారనే ఆరోపణలు కర్ణాటకలో ఓ వైద్యురాలిని చిక్కుల్లోకి నెట్టాయి. పైగా ఆమె అధికార పార్టీకి చెందిన బాగల్‌కోట్ ఎమ్మెల్యే ఉమేశ్ మెటీకి మేనకోడలు కావడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టగా.. విచారణకు హాజరుకాకపోవడం ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది.
వివరాల ప్రకారం.. బాగల్‌కోట్‌లోని వాంబే కాలనీ నమ్మ క్లినిక్‌లో డాక్టర్ అంకిత యరగల్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. అయితే మార్చి 3 నుంచి సెప్టెంబర్ వరకు ఆమె క్లినిక్‌లో విధులకు హాజరుకాలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చే ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఇంతకీ డాక్టర్ అంకిత ఎక్కడున్నారు? అనే ప్రశ్నకు అధికారుల దర్యాప్తులో.. ఆమె ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య విద్య అభ్యసిస్తున్నట్లు తేలిందని అధికారులు చెబుతున్నారు. అంటే ఒకవైపు నమ్మ క్లినిక్ మెడికల్ ఆఫీసర్‌గా జీతం.. మరోవైపు పీజీ మెడిసిన్.. ఈ రెండు బాధ్యతలను ఒకేసారి కొనసాగించారా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
విచారణకు పిలిస్తే.. హాజరు కాలేదు!
ఈ ఆరోపణలపై బాగల్‌కోట్ జిల్లా పరిషత్ సీఈవో గజానన్ బాలే విచారణ చేపట్టారు. అయితే డాక్టర్ అంకిత ఆ విచారణకు హాజరుకాలేదు. దీంతో అధికారులు సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని రూమ్ నంబర్ 11లో జరిగే ఈ విచారణకు తప్పనిసరిగా రావాలని ఆదేశించారు. ఈసారి కూడా హాజరుకాకపోతే.. ఆమె వివరణ లేకుండానే అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
కాలేజీ అనుమతి ఇచ్చినా.. క్లినిక్ సంగతేంటి?
ఈ వ్యవహారంలో మరో కీలక అంశం కూడా తెరపైకి వచ్చింది. డాక్టర్ అంకిత పీజీ చదువుకునేందుకు ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ అనుమతి ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ అనుమతి ఉన్నప్పటికీ నమ్మ క్లినిక్‌లో తన విధులకు హాజరుకాలేదని ఆరోపిస్తున్నారు. అంటే పీజీ చదువుకునేందుకు అనుమతి ఉండటం వేరు.. అదే సమయంలో నమ్మ క్లినిక్‌లో విధులు నిర్వహించకపోయినా జీతం తీసుకోవడం వేరు అన్నది అధికారుల విచారణలో పరిశీలిస్తున్న అంశంగా కనిపిస్తోంది.
రూ.70 వేల జీతం.. తిరిగి చెల్లించాల్సి వస్తుందా?
అనుమతిలేని ద్వంద్వ బాధ్యతలు నిర్వహించినట్లు విచారణలో తేలితే.. ఆ కాలంలో ఆమెకు చెల్లించిన జీతం లేదా గౌరవ వేతనాన్ని తిరిగి రికవరీ చేసే అవకాశం ఉందని అధికారులు నోటీసులో హెచ్చరించారు. అంతేకాదు.. వ్యవహారం ప్రొఫెషనల్ మిస్‌కండక్ట్‌గా తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు కర్ణాటక మెడికల్ కౌన్సిల్, నేషనల్ మెడికల్ కమిషన్‌కు కూడా విషయం పంపే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇక జిల్లా ఆరోగ్య అధికారి రాజ్‌కుమార్ యరగల్ ఇప్పటికే డాక్టర్ అంకితను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. ప్రస్తుతం మొత్తం వ్యవహారం అధికారుల విచారణలో ఉంది. సెప్టెంబర్ 18న జరిగే విచారణలో డాక్టర్ అంకిత హాజరై తనపై వచ్చిన ఆరోపణలపై ఏం వివరణ ఇస్తారు? పీజీ చదువుతో పాటు నమ్మ క్లినిక్ ఉద్యోగానికి సంబంధించిన అనుమతులు, విధులు, జీతం చెల్లింపులపై ఆమె సమర్పించే వివరాలే ఇప్పుడు కీలకంగా మారాయి.
ఇదీ చదవండి: బీజేపీకి కొత్త చిక్కులు.. యూపీ‘ఐ’ ఫైట్ తప్పదా?


