భారతదేశంలో డిజిటల్ విప్లవానికి ప్రతీకగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చెల్లింపులు సాధారణ ప్రజలకు ఎప్పటిలాగే పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. అన్ని యూపీఐ లావాదేవీలపై రుసుములు వసూలు చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ, వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా ప్రస్తుత విధానం కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అందులో ఎవరికి ఎంతమేర ఛార్జీలు వసూలు చేస్తారో తెలియజేస్తూ, ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై స్పష్టత నిచ్చింది.
పూర్తిగా ఉచితం
స్నేహితులు, బంధువులకు డబ్బులు పంపడం: ఎంత మొత్తం పంపినా (పీ2పీ) రూపాయి కూడా ఛార్జీ ఉండదు.
చిన్న దుకాణాల్లో చెల్లింపులు: నెలకు రూ.1 లక్ష వరకు వ్యాపారం చేసే చిన్న దుకాణదారులకు ఎలాంటి రుసుములు ఉండవు.
రోజువారీ చిన్న చెల్లింపులు: రూ.2,000 లోపు చేసే 95 శాతం పైగా వ్యాపార చెల్లింపులు పూర్తి ఉచితం.
అదనపు ఛార్జీలు ఉండవు: యాప్‌లు ప్లాట్‌ఫారమ్ రుసుము వసూలు చేయకూడదు. వ్యాపారులు ఈ భారాన్ని వినియోగదారులపై మోపడానికి వీల్లేదు.
రూ.2,000 లావాదేవీ దాటితే ఛార్జీలు ఎవరిపై..
సాధారణ పెద్ద వ్యాపారాలు: రూ.2,000 దాటిన లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది.
నిత్యావసర సేవలు: రైల్వే, పెట్రోల్, టెలికాం, కరెంట్ బిల్‌లు, బీమా వంటి వాటికి రూ.2,000 దాటితే లావాదేవీకి గరిష్టంగా రూ.5 మాత్రమే.
మ్యూచువల్ ఫండ్స్, షేర్లు: మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్ చెల్లింపులకు కేవలం 0.02% (గరిష్టంగా రూ.300).
🔰 UPI Remains Free for Consumers
UPI continues to be free for customers. Sending money to friends, paying at shops, or scanning a QR code — all remain without charges.
Key Facts:
✅ No charges on P2P: Person-to-Person transfers are always free, regardless of amount.
✅ Small… pic.twitter.com/PyQ7hotNMN— Ministry of Finance (@FinMinIndia) September 16, 2026
ప్రభుత్వ వివరణ ప్రకారం.. నిజాలు, ప్రయోజనాలు
ఇది పూర్తిగా ప్రభుత్వం సొంతంగా తీసుకున్న నిర్ణయం. విదేశీ ఒత్తిళ్ల వల్ల ఛార్జీలు వచ్చాయనే ఆరోపణల్లో నిజం లేదు. పెద్ద వ్యాపారుల నుంచి వచ్చే ఛార్జీలను సైబర్ సెక్యూరిటీ పెంచడానికి, బ్యాంకింగ్ సర్వర్లను బలోపేతం చేయడానికి, పల్లెల్లో డిజిటల్ చెల్లింపులను విస్తరించడానికి ఉపయోగిస్తారు.
ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత?


