యూపీఐ చార్జీలు: ఆ.. ఎంతలే అనుకోవద్దు!! | UPI merchant charges MDR rules October 15 impact explainer | Sakshi
Sakshi News home page

యూపీఐ చార్జీలు: ఆ.. ఎంతలే అనుకోవద్దు!!

Sep 16 2026 2:25 PM | Updated on Sep 16 2026 2:59 PM

UPI merchant charges MDR rules October 15 impact explainer

దేశంలో గత ఆరేళ్లుగా సాగుతున్న ఉచిత యూపీఐ (UPI) చెల్లింపుల సేవలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. పేమెంట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (PCI) ఒత్తిడితో పాటు, ఆర్‌బీఐ, బ్యాంకుల సూచనల మేరకు పెద్ద వ్యాపారుల లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (MDR) పునఃప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌ 15 నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది.

కొత్త చార్జీల నిబంధనలు

మినహాయింపులు: రూ.2,000 లోపు ఉండే వ్యాపార చెల్లింపులు, వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) జరిగే నగదు బదిలీలు, రూ.1 లక్ష లోపు నెలవారీ టర్నోవర్‌ ఉన్న చిరు వ్యాపారులకు ఎలాంటి ఎండీఆర్‌ వర్తించదు.

భారం ఎవరిపై?: వ్యక్తుల నుంచి వ్యాపారులకు (P2M) జరిగే రూ.2,000 పైబడిన లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ విధించనున్నారు.

గరిష్ట పరిమితి: రూ.75,000 దాటిన చెల్లింపులపై ఎండీఆర్‌ రుసుమును గరిష్టంగా రూ.300గా ఖరారు చేశారు.

ఏయే లావాదేవీలపై ఎక్కువ భారం?

ఆగస్టు నెలలో నమోదైన మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో రూ.2,000 దాటిన చెల్లింపుల వాటా ఏకంగా 67 శాతంగా ఉంది. సంఖ్య పరంగా ఇవి 4 శాతం మాత్రమే అయినప్పటికీ, విలువ రీత్యా అత్యంత భారీ మొత్తాలు వీటిలోనే ఉన్నాయి. వ్యాపారులు ఈ అదనపు ఎండీఆర్‌ భారాన్ని వినియోగదారులపైకే నెట్టేసే అవకాశం ఉండటంతో, పెద్ద కొనుగోళ్లపై ప్రభావం పడనుంది.

ఏయే లావాదేవీలపై ఎంత భారం?

కొత్త చార్జీలు ఏయే చెల్లింపులపై ఎలా వర్తిస్తాయో ఉదాహరణలతో చూస్తే..

రూ.2,000 లోపు కొనుగోలు: చేస్తే ఎటువంటి లేదు. ఉదాహరణకు రూ.1,500 విలువైన వస్తువును యూపీఐతో కొనుగోలు చేస్తే కొత్త ఎండీఆర్‌ వర్తించదు.

రూ.5,000 చెల్లింపు: 0.4 శాతం ప్రకారం వ్యాపారికి రూ.20 చార్జీ వర్తిస్తుంది.

రూ.10,000 చెల్లింపు: రూ.40 చార్జీ వర్తిస్తుంది.

రూ.25,000 చెల్లింపు: రూ.100 చార్జీ వర్తిస్తుంది.

రూ.50,000 చెల్లింపు: రూ.200 చార్జీ వర్తిస్తుంది.

రూ.75,000 చెల్లింపు: రూ.300 చార్జీ వర్తిస్తుంది.

రూ.1 లక్ష చెల్లింపు: 0.4 శాతం ప్రకారం రూ.400 వచ్చినా, గరిష్ఠ పరిమితి కారణంగా ఎండీఆర్‌ రూ.300లే అవుతుంది.

కొన్ని రంగాలకు ఫ్లాట్‌ రూ.5

రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయ ఇన్‌పుట్స్‌ వంటి కీలక, తక్కువ మార్జిన్‌ రంగాల్లో రూ.2,000కు పైబడిన లావాదేవీలకు 0.4 శాతానికి బదులుగా ఒక్కో లావాదేవీకి రూ.5 ఫ్లాట్‌ ఎండీఆర్‌గా నిర్ణయించారు.

ఏటా రూ.16,000 కోట్ల ఆదాయం 
ఈ రుసుముల ద్వారా పేమెంట్స్‌ పరిశ్రమకు ఏటా రూ.16,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్‌పీసీఐ డేటా ప్రకారం ఆగస్టులో రూ.29,82,356 కోట్ల విలువైన 2,451 కోట్ల లావాదేవీలు జరిగాయి. పర్సన్-టు-పర్సన్ బదిలీల్లో రూ.2,000 పైబడిన ఉచిత లావాదేవీల వాటా 85% ఉన్నప్పటికీ, వ్యాపార చెల్లింపులపై ఈ చార్జీల భారం పడనుంది.

పెద్ద మొత్తంలో షాపింగ్ చేసేటప్పుడు డిజిటల్ చార్జీలు వసూలు చేస్తే, ప్రజలు మళ్లీ యూపీఐకి ప్రత్యామ్నాయంగా పాత పద్ధతిలోనే నగదు (Cash) వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement