సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని సెంట్రల్ పార్క్ సమీపంలో చిరిగిన కరెన్సీ నోట్ల కుప్ప కలకలం రేపింది. పార్క్‌కు ఎదురుగా ఓ చోట పెద్ద సంఖ్యలో చిరిగిన నోట్లు పడి ఉండటాన్ని మార్నింగ్ వాకర్స్ గుర్తించారు. ఆ కుప్పలో రూ.500, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లు ఉన్నట్లు గుర్తించారు. నోట్లతో పాటు ఎల్‌ఐసీ రసీదులు, ఓ మహిళకు సంబంధించిన పాన్ కార్డు కూడా లభ్యమైనట్లు సమాచారం.
దీనిపై వెంటనే మార్నింగ్ వాకర్స్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చిరిగిన నోట్లను పరిశీలించారు. అసలు ఆ నోట్లను అక్కడ ఎవరు పడేశారు? ఎందుకు పడేశారు? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. కాగా, అక్కడికి సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. పాన్ కార్డు, ఇతర ఆధారాల ఆధారంగా ఈ నోట్ల కుప్పకు సంబంధించిన వ్యక్తిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే నోట్లను అక్కడ పడేసిన కారణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు.. అమెరికా వీసాల పేరుతో మోసం..


