సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాల్లో గోల్‌మాల్ వెలుగులోకి వచ్చింది. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్ర బట్టబయలైంది. డీఎస్సీ తరహాలోనే తమకు కావాల్సిన వాళ్లకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగాదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాత పరీక్ష రద్దు చేసింది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఏపీలో ఈ నిబంధనలను మార్చడం పట్ల తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒడిశా, పంజాబ్, తమిళనాడు, మిజోరాం, జమ్ము కశ్మీర్, తెలంగాణ, గుజరాత్ వంటి రాష్ట్రాలన్నింటిలోనూ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ద్వారా రాత పరీక్ష నిర్వహించే భర్తీ చేస్తున్నారు. కానీ, ఏపీలో మాత్రం రాత పరీక్ష లేకుండా నియామకాల్ని చేపట్టేలా జీవోలు జారీ చేయడంతో చంద్రబాబు ప్రభుత్వ బండారం బయటపడింది.
24 గంటల్లోనే రెండు జీవోలు..
ఈ నియామకాల విషయంలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే ప్రభుత్వం రెండు వేర్వేరు జీవోలను విడుదల చేయడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఈనెల 13న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా ఒక్క రోజు తిరిగేసరికి (ఈనెల 14న), ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఏపీపీఎస్సీని ఈ ప్రక్రియ నుండి పూర్తిగా తప్పిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు వెలువరించింది.
ఏపీపీఎస్సీని పక్కన పెట్టి, కేవలం పశుసంవర్ధక శాఖ డిపార్ట్‌మెంటల్ కమిటీ ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించడం గోల్‌మాల్‌కు నిదర్శనమని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఈ వివాదంపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు.. ఈ ఒక్కసారికే పరీక్ష లేకుండా పోస్టులు భర్తీ చేస్తాం అంటూ ప్రకటించడం అభ్యర్థుల్లో మరింత ఆందోళనను, అనుమానాలను రేకెత్తిస్తోంది. అర్హులైన నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ, పారదర్శకతకు తిలోదకాలిచ్చి అడ్డదారిలో నియామకాలు చేపట్టాలని చూస్తే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తుందని అభ్యర్థులు హెచ్చరిస్తున్నారు.


